breaking news
Central Delta
-
శ్రమఫలం అందే వేళ చెలగాటం
సాగునీటి కోసం శివారు రైతుల కలవరం 7న కాలువలు కట్టేస్తామంటున్న ప్రభుత్వం 20 వరకూ ఇవ్వాలని అన్నదాతల అభ్యర్థన (లక్కింశెట్టి శ్రీనివాసరావు-సాక్షి ప్రతినిధి)పంట చేతికొచ్చే దశలో సర్కారుతీరు శివారు ఆయకట్టు రైతుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చేలు ఈనిక దశ దాటిన తరుణంలో పంటకు సరిపడా నీరు కావాలన్న రైతన్నల గోడును జిల్లా యంత్రాంగం మానవీయ కోణంలో ఆలకించాలి. ఏడో తేదీతో కాలువలు మూసేస్తామన్న ప్రకటన కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. రబీలో సాగునీటి సమస్య సెంట్రల్ డెల్టాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తదితర నియోజకవర్గాల్లోని శివారు ఆయకట్టు రైతుల ఆక్రందనలు ఆందోళన రూపం దాల్చాయి. అన్నదాతలు రోడ్డెక్కి సాగునీటి సరఫరా గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం చెబుతున్న గడువుకు, రైతులు అడుగుతున్న దానికి మధ్య తేడా కేవలం పది రోజులు మాత్రమే. కనీసం 20 వరకైనా నీరివ్వాలంటున్న రైతుల మొరను కలెక్టర్ సావధానంగా ఆలకించి సానుకూలమైన ప్రకటన చేయూలి. ఈ వారం మొదట్లో చంద్రబాబు సర్కార్ మొండితనంతో ఏకపక్షంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి డెల్టా రైతుల మనోభావాలను దెబ్బ తీసింది. గోదావరి జిల్లాల రైతులంతా నెత్తీనోరు మొత్తుకున్నా పెడచెవినపెట్టి ఎత్తిపోతలను పట్టాలెక్కించింది పోలవరం ప్రాజెక్టును నీరుగార్చే కుట్రలో భాగంగానే అని రైతులు అభిప్రాయపడుతున్నారు. వారి అనుమానాలనైనా నివృత్తి చేసిందా అంటే అదీ లేదు. ‘టీ కప్పులో తుపాన్’సద్దుమణిగినట్టే.. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల మధ్య కోల్డ్‌వార్ జిల్లాలో పాలనాపరంగా ప్రతికూల వాతావరణం నెలకొనేలా చేసింది. వైద్య ఆరోగ్యశాఖలో అందరినీ దొంగలుగా జమకడుతున్నారంటూ ఆ శాఖ ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఒకే వేదికపైకి వచ్చి ప్రత్యక్ష కార్యాచరణ దిశగా అడుగులు వేశారుు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో కలెక్టర్ అరుణ్‌కుమార్ సమయానుకూలంగా స్పందించి తీసుకున్న దిద్దుబాటు చర్యలతో టీకప్పులో తుపాన్‌లా సమస్య పరిష్కారమవడం హర్షణీయమే. లేదంటే రాష్ట్రస్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైన పశ్చిమగోదావరి జిల్లా తరహా పరిణామాలు ఇక్కడ కూడా ఉత్పన్నమయ్యేవి. అక్కడి కలెక్టర్, అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి, చివరకు రాజధాని వరకు వెళ్లారుు. ఈ వారం మధ్యలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జరిపిన కాకినాడ జీజీహెచ్ పర్యటన రోగులకు కొంతలో కొంత ఊరటనిచ్చేదిగా ఉంది. రూ.20 కోట్లతో తల్లీపిల్లలకు సూపర్ స్పెషాలిటీ వార్డు, కార్డియాలజీ విభాగానికి 30 అదనపు పడకలను మంత్రి ప్రకటించారు. టీడీపీ ఊరించిన అనేక తాయిలాల్లా కాక ఆ ప్రకటన వాస్తవరూపం దాల్చేలా మంత్రి చొరవ తీసుకోవాలి. జిల్లాకు లభించిన పెట్రో యూనివర్సిటీ స్థల సేకరణ కారణంగా వెనక్కుపోతుందనుకుంటే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయానికి కూడా అదే గతి పట్టేలా కనిపిస్తోంది. స్థలం కేటాయించకుంటే ఈ విద్యా సంవత్సరం నుంచి కొనసాగించేదిలేదంటూ ఢిల్లీ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రతిష్టాత్మక విద్యాలయం తరలిపోయే ప్రమాదముంది. చిన్నారుల విషాదాంతం రంగంపేట మండలం బి.దొంతమూరు అంగన్వాడీ కేంద్రంలో ఆహారం విషతుల్యమై ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. ఒకే కుటుంబానికి చెందిన ఆ పిల్లలు నాలుగు రోజుల తేడాలో మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కామినేని చెప్పిన రోజే కాకినాడ జీజీహెచ్‌లో మరో విద్యార్థి మృతి చెందడం వైద్య సేవల లోపాన్ని ఎత్తిచూపుతోంది. విద్యార్థుల అస్వస్థత, మృతికి అంగన్వాడీలో తిన్న ఆహారమా లేక మరేదైనా కారణమా అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాక కాని చెప్పలేమని అధికారులంటున్నారు. అధికార పక్షానికి సవాలు విసిరిన బోస్ ఈ వారం జిల్లా రాజకీయాలు, పదవుల పందేరాలు ఆసక్తిని రేకెత్తించాయి. అధికార టీడీపీ బీసీల్లో శెట్టిబలిజ వర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీగా తొలి ప్రాధాన్యమని గతంలో ప్రజల సమక్షంలో ప్రకటించింది. తీరా పదవుల పందేరం వచ్చేసరికి వీవీవీఎస్ చౌదరికి కట్టబెట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ఇచ్చిన మాట తప్పడం సీఎం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, ఎమ్మెల్సీ విషయంలో తన నిజస్వరూపాన్ని ప్రదర్శించారనే ఆగ్రహం బీసీల్లో వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుకు పూర్తి భిన్నమైన నేత అనే విషయాన్ని మరోసారి చెప్పకనే చెప్పారు. ఎమ్మెల్సీగా మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఎంపికతో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఎంపికతో విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన పార్టీగా అన్ని వర్గాల నుంచి వైఎస్సార్ సీపీ ప్రశంసలందుకుంది. ప్రమాణస్వీకారం చేసి జిల్లాకు వచ్చిన బోస్‌ను అభినందించేందుకు కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి ద్రాక్షారామ వరకు పెద్ద ఎత్తున తరలి రావడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్త్తేజానికి నాంది పలికింది. ద్రాక్షారామ సత్కార సభలో తన శైలికి విభిన్నంగా సాగిన బోస్ ప్రసంగం కూడా రాజకీయవర్గాల్లో కాక పుట్టించింది. ఇళ్ల పట్టాల వ్యవహారం, అధికారులు అధికారపక్షానికి కొమ్ముకాసే చర్యలపై సమరానికి సై అంటూ విసిరిన సవాల్ జిల్లాలో ఆసక్తిని రేకెత్తించి కేడర్‌లో మనోధైర్యాన్ని నింపింది. జ్యోతులకు జగన్ పరామర్శ సోదరుడు సత్తిబాబు మృతితో పుట్టెడు దుఖంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూను పరామర్శించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వారం ఇర్రిపాక వచ్చారు. వాస్తవానికి జగన్ హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ వెళ్లాల్సి ఉన్నా నెహ్రూ సోదరుడి మృతి విషయాన్ని తెలుసుకుని ప్రయూణాన్ని జిల్లా మీదుగా మార్చుకుని పరామర్శకు వచ్చారు. జగన్ పర్యటన, ఎమ్మెల్సీ బోస్‌కు లభించిన అపూర్వ స్వాగతం జిల్లాలోని వైఎస్సార్ సీపీ శ్రేణులకు కొత్త ఊపిరులూదాయి. -
నేటి నుంచి గలగలా గోదారి
తూర్పు, మధ్య డెల్టాలకు నేడు నీటి విడుదల ధవళేశ్వరం : సుమారు రెండు నెలల అనంతరం గోదారమ్మ పంట కాలువల్లోకి పరుగులు తీయనుంది. తూర్పు,సెంట్రల్ డెల్టాలకు ఆదివారం నీటిని విడుదల చేయనున్నారు. 58 రోజుల విరామం అనంతరం తూర్పు డెల్టాకు, 55 రోజుల విరామం అనంతరం సెంట్రల్ డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు మధ్య డెల్టాకు, 10.30 గంటలకు తూర్పు డెల్టాకు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ సుగుణాకరరావు లాంఛనంగా నీటిని విడుదల చేస్తారని హెడ్‌వర్క్స్ ఈఈ తిరుపతిరావు తెలిపారు. వాస్తవానికి జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేయాలి. అయితే రబీ పంట ఆలస్యం కావడంతో ఏప్రిల్ 17 వరకు తూర్పు డె ల్టాకు, ఏప్రిల్ 20 వరకు మధ్య డెల్టాకు నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. దాంతో కాలువలకు షార్ట్ క్లోజర్ పనులను మాత్రమే చేయడానికి వీలైంది. ఆ పనుల కోసమే ఇంతవరకు నీటిని విడుదల చేయలేకపోయారు. తూర్పు, మధ్య డెల్టాల్లో సుమారు రూ. 50 కోట్ల మేరకు పనులను పూర్తి చేసినట్టు ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు శనివారం తెలిపారు. సహజ జలాలే ఆధారం కాలువలకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వర్షాలు ఇంకా పడకపోవడంతో గోదావరి సహజ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రోజుకు సుమారు 3,500 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్‌కు చేరుతుంది. వానలు పడేంతవరకు ఈ నీరే శరణ్యం. ప్రాజెక్టులవారీ క్యాడ్ కమిటీలు వేయాలి రామచంద్రపురం : రాష్ట్ర స్థాయి క్యాడ్ కమిటీ ద్వారా ఎటువంటి పనులూ జరగడం లేదని, ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి చిన్న పనికీ రాష్ట్రస్థాయి క్యాడ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. రైతులకు అనువుగా ఉండేలా ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలను వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల రైతుల సమస్యలను సకాలంలో గుర్తించి వాటి పరిష్కారానికి వెంటనే పనులు చేపట్టడానికి వీలవుతుందన్నారు. నీటితీరువా నిధులు ఇప్పుడా! నీటితీరువా నిధులు ఇప్పుడు విడుదల చేశారని, కాలువలకు నీళ్లు ఇచ్చే సమయంలో ఈ నిధులు విడుదల చేయడంవల్ల ప్రయోజనమేమిటని త్రినాథరెడ్డి ప్రశ్నించారు. ఈ ఏడాది తూర్పు డెల్టాలో ఎ-కేటగిరీ పనులకు రూ.2.85 కోట్లు, బి-కేటగిరీ పనులకు రూ.3.02 కోట్లు నీటి తీరువా నిధులు విడుదలయ్యాయన్నారు. మధ్య డెల్టాలో ఎ-కేటగిరీకి రూ.38 లక్షలు, బి-కేటగిరీకి రూ.3.93 కోట్లు విడుదలయ్యాయన్నారు. కాలువల్లో తూడు తీత పనులు చేపట్టక పోవడంవల్ల వర్షాకాలంలో పంటలు ముంపు బారిన పడే అవకాశం ఉందని అన్నారు.