breaking news
Buddhist University
-
అంతర్జాతీయ స్థాయిలో.. బౌద్ధ విశ్వవిద్యాలయం!
ఎందుకు సాగర్? బౌద్ధంలో మహాయాన పద్ధతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చైనా, సింగపూర్, కంబోడియా, మలేసియా, జపాన్.. తదితర దేశాలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మహాయాన పద్ధతిని విశ్వవ్యాప్తం చేసిన ఆచార్య నాగార్జునుడంటే.. ఆ దేశాల్లో బౌద్ధులకు ప్రత్యేక ఆరాధన భావముంది. నాగార్జునుడు నివసించిన ప్రాంతం నాగార్జునసాగర్ పరిసరాలే కావటంతో ఇక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. నాగార్జునుడి కాలంలో ఈ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందించిన విశ్వవిద్యాలయం విలసిల్లింది. అప్పట్లోనే ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. అందుకే చరిత్రకు సరైన గౌరవం ఇవ్వడంతోపాటు నాటి యూనివర్సిటీని పునరుద్ధరించినట్లవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్‌లో ప్రపంచ స్థాయి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ తక్షశిల తరహాలో పెద్ద విశ్వవిద్యాలయం ఉన్నట్టు చారిత్రక ఆధారాలున్న నేపథ్యంలో దీన్ని పునరుద్ధరించేందుకు ఓ ప్రపంచస్థాయి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే యోచన చాలాకాలంగా ఉంది. ఇప్పుడు ఈ కలను నిజం చేసేందుకు మలేసియా ముందుకొచ్చింది. ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనం పేరుతో బౌద్ధ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీని పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ బుద్ధవనంలోనే ఇప్పుడు మలేషియా ఆర్థికసాయంతో అంతర్జాతీయస్థాయి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. మలేషియాకు చెందిన డీఎక్స్ఎన్ గ్రూపు ఇందుకోసం రూ.200 కోట్లను వెచ్చించేందుకు సంసిద్ధత తెలిపింది. డీఎక్స్ఎన్ గ్రూపు అధినేత, చైనా మూలాలున్న పారిశ్రామిక వేత్త లిమ్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నారు. దాదాపు రూ.200 కోట్లు వ్యయమయ్యే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆ సంస్థ ఇటీవల ప్రతిపాదన అందజేసింది. ప్రాజెక్టు త్రీడీ యానిమేటెడ్ చిత్రాన్ని కూడా రూపొందించింది. దీనికి 40 ఎకరాలు అవసరమవుతాయని పేర్కొంది. కావాల్సిన భూమి కేటాయించాలని కోరుతూ బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మలేసియా సంస్థ పనులు ప్రారంభించనుంది. సంప్రదాయ విద్య, ఆధునిక మేళవింపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక విద్యాబోధనతో ఈ విశ్వవిద్యాలయం అలరారనుంది. ఓవైపు ఆధునిక విద్యను అందిస్తూనే సంప్రదాయ బోధనకు పెద్ద పీట వేస్తామని బుద్దవనం ప్రత్యేకాధికారి లక్ష్మయ్య తెలిపారు. ఒత్తిడిని జయించటం, సన్మార్గం, సంప్రదాయం, ప్రపంచ శాంతి.. వంటివి ఒంటబట్టే విధంగా విద్యాబోధన ఉంటుందని, బౌద్ధాన్ని అనుసరిస్తున్న దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ పర్యాటకానికి ఇది కొత్త కోణం కల్పిస్తుందన్నారు. అత్యాధునిక హంగులతో.. - బుద్ధగయలోని ప్రధాన మందిరం నమూనాలోనే ఇక్కడ యూనివర్సిటీ ప్రధాన భవనం రూపుదిద్దుకోనుంది. ఇది 21 అంతస్తుల్లో 6.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 15 ఎకరాల్లో రూ.147 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారు. దీనికి నలుదిక్కులా ఒక్కోటి 7 అంతస్తుల్లో.. నాలుగు భవనాలుంటాయి. - మూడు ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ భిక్షువుల వసతి గృహ సముదాయాలు నిర్మిస్తారు. 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.3.3 కోట్లతో దీన్ని సిద్ధం చేస్తారు. - యాభై పడకల సామర్థ్యం ఉండే ఆసుపత్రిని రూ.11 కోట్లతో నిర్మిస్తారు. ఇది చాలా ఆధునికంగా ఉంటుంది. - ఔషధ మొక్కలు, మామిడి మొక్కలతో 8 ఎకరాల్లో పెద్ద తోట పెంచుతారు. తైవాన్ చేయూతతో! - బౌద్ధాన్ని అనుసరించే మరోదేశం తైవాన్ కూడా నాగార్జునసాగర్‌లో నిర్మాణాలకు ముందుకొచ్చింది. - 20 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ భిక్షువుల పాఠశాలను నిర్మించనుంది. రూ.16.50 కోట్ల వ్యయంతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ భవనం ఉంటుంది. - దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో ఓ భారీ బౌద్ధ మందిరాన్ని నిర్మిస్తారు. ఇక్కడ 70 అడుగుల ఎత్తుతో ఆచార్య నాగార్జునుడి భారీ విగ్రహం ఏర్పాటు చేస్తారు. - సైన్స్, మెకానికల్, కార్పెంటరీ శిక్షణతో కూడిన వృత్తి విద్యా కేంద్రం ఉంటుంది. 60 వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.18 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తారు. - బెంగళూరుకు చెందిన లోటస్ నిక్కో గ్రూపు 5–స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇందుకు రూ.42 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. – సాక్షి, హైదరాబాద్ -
బౌద్ధ ‘సాగర’o!
నాగార్జున సాగర్‌లో అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం - బుద్ధవనంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం - తైవాన్, చైనా, శ్రీలంక, జపాన్ సాయంతో వ్యవస్థాపన - నలంద విశ్వవిద్యాలయం తరహాలో పునరుద్ధరణ ‘అవిద్య నశిస్తే మనిషి వివేకవంతుడవుతాడు.. పుస్తకాలను కాదు జీవితాన్ని చదవాలి.. దుఃఖం దూరమై ప్రశాంతత నెలకొనాలి..’ ఆ ప్రాంతంలో చెట్టూపుట్టా రాయిరప్పా చెప్పే పాఠాలివి. బుద్ధుడి బోధనల కోసం 14 దేశాల విద్యార్థులు వచ్చిన నేల అది.. నలంద విశ్వవిద్యాలయానికి ఏమాత్రం తీసి పోని ప్రాంతమది.. అదే క్రీ.శ. రెండో శతాబ్దంలో ఓ వెలుగు వెలిగిన శ్రీ పర్వత విజయపురి విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయం జాడ నాగార్జున సాగర్ నీటిలో ప్రశాంతంగా నాగార్జున కొండపై కనిపిస్తుంది. ప్రపంచంలోనే మన్నికైన విశ్వవిద్యాలయాన్ని సొంతం చేసుకున్న ఆ నేలపై ఇప్పుడు మళ్లీ బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ప్రపంచ శాంతికి మార్గం చూపిన ఆ త«థాగతుడి బోధనలోని సారాన్ని ఔపాసన పట్టేందుకు ప్రపంచ నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేలా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తైవాన్, ఇండోనేషియా, శ్రీలంక, చైనా, జపాన్ వంటి దేశాల సహకారంతో నెలకొల్పాలని భావిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ ఒకప్పుడు ప్రపంచంలోనే దిగ్గజ విశ్వవిద్యాలయంగా వెలుగొంది కనుమరుగై.. పునరుజ్జీవం తర్వాత విదేశీ విద్యార్థులను ఆకట్టు కుంటున్న నలంద యూనివర్సిటీ తరహాలోనే, శ్రీ పర్వత విజయపురి విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన బుద్ధవనం ప్రాజెక్టులో భాగంగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు బౌద్ధం విరాజిల్లుతున్న కొన్ని దేశాల్లో మన్నికైన విశ్వ విద్యాలయాలున్నాయి. బుద్ధవనంలో మంచి విశ్వవిద్యాలయం ఏర్పాటు కావాలంటే ఆ దేశాల సహకారం తప్పనిసరని ప్రభు త్వం భావిస్తోంది. ఇందుకోసం ఆయా దేశాల సహకారం తీసుకో నుంది. ఇప్పటికే తైవాన్ సహా కొన్ని దేశాలు సహకరించేందుకు ముందుకొచ్చాయి. త్వరలో అధికారుల బృందం తైవాన్‌తోపాటు మరికొన్ని దేశాలకు వెళ్లి చర్చించనుంది. ఎంతో ఉపయోగం.. ప్రస్తుత తరుణంలో బౌద్ధ విశ్వవిద్యాలయం యువతకు కొత్త బాటలు వేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ యూనివర్సిటీ వస్తే స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో మైసూరు సమీపంలో ఓ చిన్న విశ్వవిద్యాలయం ఉంది. విశాలమైన స్థలం ఉన్న బుద్ధవనంలో మంచి విశ్వవిద్యాలయం వస్తే నలంద తర్వాత అంత గొప్ప యూనివర్సిటీగా మారే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ పేరుతో సంస్థ ఏర్పాటవుతోంది. ఇటీవలే స్వయంగా దలైలామా వచ్చి దీనికి శంకుస్థాపన చేశారు. బుద్ధుడి బోధనలే కాదు.. శాంతి, అహింస.. వంటి బుద్ధుడి బోధనలే బౌద్ధ విశ్వవిద్యాలయం లక్ష్యం కాదు. బుద్ధుడిని భౌషజ్య గురుగా పేర్కొంటారు. వైద్యులకే గురువు అని దాని సారాంశం. మనో వైకల్యాన్ని జయించేందుకు మనిషికి చక్కటి మార్గాన్ని ఆయన చూపారు. అలాగే అంగత్తర నికాయలో ఆయన గణితాన్ని ప్రతిపాదించారు. సాధారణ విద్యతోపాటు బుద్ధుడి సారాన్ని రంగరించిన ప్రత్యేక బోధనలు ఇక్కడ ఉంటాయి. బౌద్ధ వాజ్ఞ్మయ పరిరక్షణ, పరిశోధన, ప్రచురణలు ఇక్కడి నుంచి సాగుతాయి. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిన సమయంలో బౌద్ధ వాజ్ఞ్మయం కాలిబూడిదైంది. కానీ అప్పటికే చైనా, మంగోలియా వంటి దేశాలు వాటిని తమ భాషల్లో సొంతం చేసుకున్నాయి. వాటిని మన భాషల్లోకి తర్జుమా చేసి నేటి తరానికి అందించటం కూడా బౌద్ధ విశ్వవిద్యాలయ లక్ష్యాల్లో ఒకటి. నిగూఢమైన బౌద్ధ బోధనలపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ప్రత్యేక కోర్సులు, పీహెచ్డీలుంటాయి. హ్యూయన్‌త్సాంగ్ మాటల్లో మన ప్రస్తావన చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ధ విద్యాలయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు చరిత్ర చెబుతోంది. ఆయన మన దేశంలో పర్యటిస్తూ 639వ సంవత్సరంలో ధాన్యకటకానికి చేరుకున్నారు. అప్పట్లో అక్కడ ప్రత్యేక విద్యాలయం ఉండేది. బౌద్ధంలోని త్రిపీఠిక (పాళి భాషలో తిపిటక)లో ఉండే అభిధర్మ పీఠిక (అభిదమ్మ పిటక) బోధన ఇక్కడ మాత్రమే ఉత్తమంగా ఉందని ఆయన పేర్కొన్నట్లు తేలింది. ఏడాదిపాటు దాన్ని ధాన్యకటకంలో నేర్చుకుని సంతోషంతో ముందుకు సాగుతున్నట్టు తన యాత్రా విశేషాల్లో ఆయన ప్రస్తావించారు. ఇదే సమయంలో శ్రీ పర్వత విజయపురి విశ్వవిద్యాలయం (ప్రస్తుత నాగార్జున సాగర్ తీరం) ఉన్న ప్రాంతానికి వెళ్లగా అప్పటికే అది అంతరించిందని, ఆ భవనాలు ఇతర అవసరాలకు వాడుతున్నారని ఆయన పేర్కొన్నట్టు చరిత్రలో రుజువులు లభించాయి. ఇక్కడికి 14 దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకున్నట్టు లిఖించి ఉన్న శాసనాలు లభించటం విశేషం.