రోడ్ల పనులకు టెండర్లు
* కేంద్ర ప్రభుత్వ రేట్ల అమలు నిర్ణయంతో లైన్క్లియర్
* 10 వేల కిలోమీటర్ల మేర అభివృద్ధికి టెండర్లు పిలిచిన అధికారులు
* దాదాపు రూ. 10 వేల కోట్లు కేటాయించిన తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రహదారులకు కొత్త రూపునిచ్చే బృహత్తర కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలను కూడా అనుసంధానిస్తూ రెండు లేన్ల రోడ్ల నిర్మాణంతోపాటు 10 వేల కిలోమీటర్ల పాత రోడ్లకు పూర్తిస్థాయిలో కొత్త రూపునిచ్చే దిశగా చర్యలు మొదలుపెట్టారు. ఇందుకోసం దాదాపు రూ. 10 వేల కోట్ల మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమైంది. పురపాలక సంఘాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలతో పోలిస్తే రోడ్లు భవ నాల శాఖ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్(ఎస్ఎస్ఆర్) తక్కువగా ఉండటంతో టెండర్లకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపేవారు కాదు. కానీ అన్ని విభాగాల ఎస్ఎస్ఆర్లు ఒకేరకంగా ఉండేలా ఇంజనీరింగ్ విభాగాలన్నీ కేంద్ర ప్రభుత్వ రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ స్టాండర్ట్ డేటాను అనుసరించాలంటూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రోడ్ల టెండర్లకు లైన్ క్లియరైంది.
దీంతో ముందుగా పది వేల కిలోమీటర్ల ప్రస్తుత రహదారులను అభివ ృద్ధి చేసే పనులకు అధికారులు తాజాగా టెండర్లను ఆహ్వానించారు. జనవరి 15 నాటికి అగ్రిమెంట్ పనులు పూర్తి చేసి పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు రూ. 2,400 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిని వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 149 మండల కేంద్రాల నుంచి సంబంధిత జిల్లా కేంద్రాలకు రెండు లేన్ల రోడ్ల నిర్మాణం, నియోజకవర్గ కేంద్రాల మీదుగా ఉన్న రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చే పనులకు సంబంధించి తొలిదశలో దాదాపు 3,200 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,200 కిలోమీటర్ల రోడ్ల పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల కోసం రూ. 2,585 కోట్లు, నియోజకవర్గ కేంద్రాల మీదుగా ముఖ్యమైన రోడ్లను రెండు లేన్లుగా మార్చేందుకు రూ. 3,704 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 389 వంతెనల నిర్మాణం కోసం రూ. 1,974 కోట్లను కేటాయించింది. మూడేళ్ల కాలంలో ఈ మొత్తం పనులు పూర్తి చేయాల్సి ఉంది.
రోడ్లు నిర్మించిన తర్వాత ఐదేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యత సదరు కాంట్రాక్టర్లదేనని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా రోడ్ల నిర్వహణ చార్జీలనూ రెట్టింపు చేసింది. అయితే కాంట్రాక్టర్ల లబ్ధికే ప్రభుత్వం ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ బీటీ సింగిల్ రోడ్డుకు కిలోమీటర్కు నిర్వహణ చార్జీ ఇప్పటి వరకు రూ. 12 వేలుండగా దాన్ని రూ. 24 వేలకు, డబుల్ రోడ్డుకు రూ. 15 వేలుండగా రూ. 30 వేలకు, ఇక మట్టి, కంకర రోడ్డుకు రూ. 6 వేలుండగా దాన్ని రూ. 12 వేలకు పెంచింది.