breaking news
Bridge work
-
ప్రజల భద్రత గాలికి వదిలిన ‘నితిన్ సాయి’ కంపెనీ
ముదిగుబ్బ బైపాస్ రోడ్డు పనుల్లో నాణ్యత నగుబాటుగా మారింది. పనులు దక్కించుకున్న నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిబంధనలకు పాతరేస్తూ పైపై పూతలతో పనులు చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా వేసిన బ్రిడ్జి పిల్లర్లు అప్పుడే బీటలు వారగా, కాంక్రీట్ వాల్ ఉబ్బిపోయింది. ఆమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులు కళ్లుమూసుకుని బిల్లులపై సంతకాలు చేసేస్తున్నారు. ధర్మవరం: ప్రజలకు మెరుగైన రహదారులు కల్పించి సుఖవంతమైన ప్రయాణం అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి మరీ ముదిగుబ్బకు బైపాస్ రహదారిని మంజూరు చేయించారు. అందులో భాగంగా 2021 డిసెంబర్లో రూ.116.81 కోట్ల వ్యయంతో ముదిగుబ్బ నుంచి 7.749 కిలోమీటర్ల పొడవున ఎన్‌హెచ్–42 బైపాస్ రోడ్డును నిర్మించేలా టెండరు పిలిచారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఈ పనులు దక్కించుకుంది. నిబంధనలకు పాతరేస్తూ బైపాస్ రోడ్డు పనుల్లో అంతులేని అక్రజుమాలకు పాల్పడుతోంది. నాణ్యత గాలికి.. బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ఇటీవల నిర్మించిన బ్రిడ్జి పనులను చూస్తే నాణ్యత తేటతెల్లమవుతోంది. బ్రిడ్జి నిర్మాణంలో నిలువు కాంక్రీట్ వాల్ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. నాసిరకం కాంక్రీట్ మిశ్రమం వాడటం వల్లే ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అలానే బ్రిడ్జి ఉపరితలంలో మట్టికట్ట పనులు లేయర్ల వారీగా సరిగా చేయక పోవడంతో ఇరువైపులా ఉన్న ప్రీకాస్టెడ్ కాంక్రీట్ వాల్ బయటకు ఉబ్బింది. దీంతో నాసిరకం పనులు ఎక్కడ బయటపడతాయోనని కన్స్ట్రక్షన్స్ కంపెనీ సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి మేకప్ చేసింది. పట్టించుకోని అధికారులు.. ముదిగుబ్బ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి నాసిరకంగా జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు పనుల నాణ్యతను పరిశీలించకుండానే విడతల వారీగా సదరు కంపెనీకి బిల్లులు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల సైతం నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీతో లాలూచీ పడటంతోనే అవినీతి పెచ్చుమీరుతున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ విజిలెన్స్‌కు ఎంపీ మాధవ్ ఫిర్యాదు ముదిగుబ్బ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులలో జరుగుతున్న అక్రమాలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సెంట్రల్ విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. పనుల్లో అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. బైపాస్ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరారు. ‘విజిలెన్స్’పై కంపెనీ ప్రతినిధుల దౌర్జన్యం బైపాస్‌రోడ్డు నిర్మాణ పనులలో జరుగుతున్న అక్రమాలను విచారించేందుకు వెళ్లిన విజిలెన్స్ అధికారులపై గతంలో నితిన్‌సాయి కనస్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు దౌర్జన్యం చేశారు. విజిలెన్స్ అధికారుల ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లడంతో పాటు పనులు పరిశీలించకుండా అడ్డుకున్నారు. దీంతో అధికారులు సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి పనులు నాణ్యత జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై నేషనల్ హైవే ఈఈ మధుసూదన్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. -
రెండేళ్లవుతున్నా పనుల పూర్తి లే దు..
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న వివిధ పనులు మంజూరై రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. మంజూరు పనులు, పూర్తైవి, వివిధ దశల్లో ఉన్నవి, ప్రారంభం కాని వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులు జిల్లాకు 34 మంజూరుకాగా, ఇప్పటి వరకు 21 పనులు పూర్తి చేశారని, ఇంకా 13 పనులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఇందుకు గల కారణాలు అధికారులను అడిగారు. కుంటాల, సిర్పూర్, రెబ్బెన, కెరమెరి, వాంకిడి, నేరడిగొండ, బాబేర (బోథ్)లో ఈ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 75 రోడ్డు పనులకుగాను 40 పనులు పూర్తి చేశారని, మిగతా 25 వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఇంకా ఆరు టెండర్ల స్థాయిలో ఉన్నాయని, అటవీ శాఖ అనుమతులు లేకపోవడం వల్ల కొన్ని పనులు నిలిచిపోయాయన్నారు. ఎక్కడెక్కడ ఆ పనులు నిలిచిపోయాయో వివరాలు తనకు పంపాలని మంత్రి సూచించారు. 13వ ఫైనాన్స్ కింద జిల్లాలో 18 పనులు ఉన్నాయని అన్నారు. అధికారులకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. ఈజీఎస్, గ్రామాల లింకురోడ్లు, మెటల్‌రోడ్లు తదితర పనులనూ వాకాబు చేశారు. ఐకేపీ, అంగన్వాడీ భవన నిర్మాణాలు ఎన్ని పూర్తయ్యాయో తెలుసుకున్నారు. అంతకు ముందు జిల్లాలో 23 జేఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఒక డిప్యూటీ ఈఈ పోస్టు ఖాళీగా ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ అమీనోద్దీన్, డిప్యూటీ ఈఈలు ప్రకాష్, శైలేందర్, సురేష్, రవి ప్రకాష్, అధికారులు పాల్గొన్నారు. విద్య, ఆర్డబ్ల్యూస్పై సమావేశం విద్య, ఆర్వీఎం, సాంఘిక సంక్షేమ శాఖల్లో పనుల తీరుపై ఆ శాఖల అధికారులతో మంత్రి జోగు రామన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, ఉపాధ్యాయులు విద్యావ్యవస్థను పటిష్ట పర్చడం లేదన్నారు. పూర్తయిన పనులకు డబ్బులు చెల్లించాలని, ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. అదనపు గదుల నిర్మాణం ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ నిర్మాణాలు చేపట్టాలని, ఆర్వీఎం, ఆర్ఎంఎస్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్డు తెగల వారికి అందిస్తున్న సంక్షేమం పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీలకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి 2013-14లో 3,631 మంది కి రూ.22.60 కోట్లు లక్ష్యం కాగా, రూ.20,71 కోట్లతో 2,831 మందికి బ్యాంకు రుణాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు అధికారులు తెలిపారు. 1991 నుంచి 2010 వరకు 3,911 మంది ఎస్సీ, ఎస్టీలకు 6,438.12 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చామని పేర్కొన్నారు. దళిత మహిళలకు ఆగష్టు 15న రూ. 18.37 కోట్లతో 106 మంది లబ్ధిదారులకు వ్యవసాయ భూములు పంపిణీ చేశామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన నిధుల ప్రతిపాదనలు పంపితే సీఎంతో మాట్లాడి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ.. మంత్రి సూచనలు పాటించి సంక్షేమ పథకాల అమలు బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో సత్యనారాయణ, ఆర్వీఎం పీవో యాదయ్య, డీడీఎస్డబ్ల్యూ శంకర్, అధికారులు పాల్గొన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సూచిం చారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో తాగునీటికి, వ్యవసాయానికి సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. జిల్లాలో 14 ఏఈఈ, రెండు మం డలాలకు ఒక ఈఈ చొప్పున పదిహేను మండలాలు ఉన్నాయని ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్ మంత్రికి వివరించారు. హౌసింగ్ కాలనీలో విద్యుత్ సరఫరాకు కొన్ని కాల నీల్లో పనులు పూర్తయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో ని ఆశ్రమ పాఠశాలల్లో విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పనులకు కలిపి మొత్తం 112 పనులకు గాను 100 పనులు పూర్తి చేశామని ఎస్ఈ తెలిపారు. సీఎల్డీపీ, ఇందిరా జలప్రభ పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల కొరకు ప్రభుత్వ భూములు కేటాయించాలని ఎస్ఈ కోరారు. విద్యుత్ కోతలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం వివరాలు సక్రమంగా ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. సోలార్ సిస్టంతో నీటి పథకాలు.. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగంపై మంత్రి జోగు రామన్న సమీక్షించారు. సోలార్ సిస్టమ్ ద్వారా నీటి పథకాలు పనిచేసేలా ప్రతిపాదించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి ఆదేశించారు. వివిధ పత్రికల్లో వస్తున్నా ప్రతికూల వార్తలపై స్పందించాలని, మంచినీటి ట్యాంకులను అధికారులు పరిశీలించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్, ఎస్ఈలు, డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు.