breaking news
boyhood
-
బాయ్‌హుడ్ రీమేక్‌తో షారుఖ్ కొడుకు ఎంట్రీ
ముంబయి: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు. హాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్టయి ఆస్కార్ అవార్డు పొందిన చిత్రం బాయ్హుడ్ను తిరిగి బాలీవుడ్ లో నిర్మించడం ద్వారా ఆర్యన్‌ను ప్రేక్షకుల దగ్గరికి చేర్చాలని షారుఖ్ నిర్ణయించారు.. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని, అందులో తాను నటిస్తానని ఆర్యనే స్వయంగా తన తండ్రి షారుఖ్‌కు చెప్పాడట. లండన్‌లో ఈ చిత్రాన్ని చూసిన వెంటనే ఆర్యన్ షారుఖ్‌కు ఎంతో ఆత్రుతతో ఫోన్ చేసి తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేసినట్లు కుటుంబ సంబంధికుల సమాచారం. అంతేకాదు, ఏదైనా మంచి పుస్తకంగానీ, మంచి చిత్రంగానీ తప్పక చదవాలని, చూడాలని ఒకరికొకరు ఎప్పుడూ చెప్పుకుంటుంటారట. ఈ నేపథ్యంలోనే ఆస్కార్ అవార్డు పొందిన బాయ్హుడ్ను తన కుమారుడిని హీరోగా పెట్టి తీయాలని షారుఖ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ చిత్ర నిర్మాతలను కూడా ఆయన సంప్రదించారని, నిర్మాణ హక్కులను తమకు ఇవ్వాలని కోరారని తెలిసింది. అయితే, బాయ్ హుడ్ చిత్రాన్ని మొత్తం 12 ఏళ్లపాటు చిత్రీకరించారు. ఇందులో ఎల్లర్ కాల్ట్రేన్ నటించాడు. ఈ పన్నెండేళ్లలో వచ్చిన మార్పుల ఆధారంగా చిత్రాన్ని తీశారు. అయితే, షారుఖ్ రిమేక్ చేయనున్న ఈ చిత్రంలో బాల్యంనాటి సన్నివేశాలకోసం తన చిన్న కుమారుడు అబిరామ్తో చిత్రీకరిస్తారని నిర్ణయించినట్లు తెలిసింది. చిత్ర నిర్మాణానికి పూర్తి స్థాయిలో అనుమతి వచ్చాక దర్శకుడిని నిర్ణయిస్తారు. అయితే, ఇప్పటికే మనీశ్ శర్మతో మాట్లాడుతున్నారని తెలిసింది. ఈయన షారుఖ్ నటించిన ఫ్యాన్, రాహుల్ దలాకియా చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
కాలపరీక్షలో...వెండితెర విజేత
సింగీతం శ్రీనివాసరావు సుప్రసిద్ధ దర్శకుడు హాలీవుడ్ తారాగణం:ఎల్లార్ కోల్ట్రానే, లోరెలీ లింక్లాటర్, ప్యాట్రీషియా ఆర్క్వెట్, ఎథాన్ హాకీ చాయాగ్రహణం: లీ డేనియల్, షానె కెల్లి దర్శకత్వం: రిచర్డ్ లింక్లాటర్ విడుదల: 2014 జూలై 11 (అమెరికా) సినిమా నిడివి: 165 నిమిషాలు నిర్మాణ వ్యయం: 40 లక్షల డాలర్లు (రూ. 24 కోట్లు) ఇప్పటివరకు వసూళ్లు: 444 లక్షల డాలర్లు (దాదాపు రూ. 276 కోట్లు) నాకు నచ్చిన హాలీవుడ్ సినిమా అంటే కచ్చితంగా ‘బాయ్‌హుడ్’ పేరు చెబుతా. అలాగని నాకు ఇదొక్కటే నచ్చిందని కాదు. ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని చాలా బాగుంటాయి. మరికొన్ని కలకాలం నిలిచిపోయేవిలా ఉంటాయి. ఈ రెండో కోవకు చెందినదే - ‘బాయ్‌హుడ్’.నిజానికి గతవారం ముగిసిన ‘ఆస్కార్’ అవార్డుల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా ఇది. ‘బర్డ్‌మ్యాన్’ చిత్రానికీ, ‘బాయ్‌హుడ్’ చిత్రానికీ మధ్య ఒక తెలియని పోటీ ఆ అవార్డుల్లో నెలకొంది. కథాకథనానికి సంబంధించి రెండు వేర్వేరు శైలులను ఇష్టపడే వారి మధ్య జరిగిన పోటీ అది. ‘బర్డ్ మ్యాన్’ చిత్రం హాలీవుడ్ మీద తీసిన వ్యంగ్యపూరిత హాస్య చిత్రమైతే, ‘బాయ్‌హుడ్’ సినిమా పన్నెండేళ్ళ జీవితంలోని ఘట్టాలను సహజాతి సహజంగా చూపిన సినిమా. హాలీవుడ్ జీవితం మీద తీసిన సినిమాగా ‘బర్డ్ మ్యాన్’ ఉత్తమ చిత్రంతో పాటు మరో మూడు విభాగాల్లో ఆస్కార్‌ను అందుకోవడం ఆశ్చర్యం అనిపించదు. ‘బాయ్‌హుడ్’ చిత్రం ఒక పాత్రను అద్భుతంగా చిత్రిస్తూ, పెరిగే వయసుతో పాటు అమాయకత్వం తరగిపోతూ రావడాన్ని చూపెడుతుంది. నిజం చెప్పాలంటే, ‘బాయ్‌హుడ్’ ఒక అద్భుతసృష్టి. నాకు తెలిసినంత వరకూ, ఇంతవరకూ ఇలాంటి ప్రయోగం ఎవరూ చెయ్యలేదు. ఇది మన జీవితాన్ని అనుసరిస్తూ చేసిన విచిత్రమైన సినిమా. ఇదొక అమెరికన్ కుటుంబానికి అద్దం పట్టే కథ. చూస్తున్నంతసేపూ ఒక సినిమా చూస్తున్నట్టుండదు. కొన్నేళ్ళ పాటు కొందరి జీవితాలను వాళ్లతో పాటు మనమూ అనుసరిస్తూ వెళుతున్నట్టుంటుంది. ఆరేళ్ల కుర్రాడు. మేసన్ అతని పేరు. అతని అక్క - సమంత. వాళ్ల తల్లి - ఒలివా. విడిపోయిన ఆమె భర్త - సీనియర్ మేసన్. వేరొకతనితో ఒలివా పెళ్లి. ఈ వాతావరణంలో మేసన్ పదేళ్ళ పెరుగుదల... ఇదీ సూక్ష్మంగా కథ.మామూలుగా మన సినిమాల్లో ఒక పాత్ర తాలూకు చిన్నప్పటి వేషాన్ని చూపించాలంటే, ఎవరైనా బాలనటునితో చిత్రీకరిస్తారు. కానీ విశేషమేమిటంటే - ఆరేళ్ల మేసన్ పాత్రను ఆరేళ్ల ఎల్లార్ కోల్ట్రాన్ పోషించాడు. ఇలాగే వాళ్ల వాళ్ల వయసులకు తగ్గట్టు మిగతా నటీనటులు పాత్రలు పోషించారు. ఇలా 2002వ సంవత్సరంలో ప్రారంభమైన షూటింగ్, అదే నటీనటులతో ప్రతి సంవత్సరం చిత్రీకరిస్తూ, అలా అలా 12 ఏళ్ళు చిత్రీకరించారు. అంటే ఆరేళ్ల కుర్రాడికి 18 ఏళ్ళు వచ్చేవరకూ అతనిలో ఏయే మార్పులు వచ్చాయో, వాటిని యథాతథంగా చిత్రీకరిస్తూ, 2013 వరకూ తీసి సినిమా ముగించారు. ఇలా ఇందులో నటించిన నటీనటులందరూ ఆ షూటింగ్ జరిగిన 12 సంవత్సరాల్లో ఎలా పెరిగారన్నది చూస్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి. ఇలాంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే రాయడం ఒక సాహసం. ఒక విచిత్రం. దీని దర్శకుడు రిచర్డ్ లింక్లాటర్ (ఖజీఛిజ్చిటఛీ ఔజీజ్చ్ట్ఛుట) చూచాయగా ఒక కథను నిర్ణయించుకున్నాడట. కాలాన్ని బట్టి నటీనటులు ఎలా మారుతుంటారో, దాన్ని బట్టి ప్రతి సంవత్సరం స్క్రీన్‌ప్లేను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ, చేర్చుకుంటూ రాసుకున్నాడట. ఈ సినిమాలో ట్రిక్స్ లేవు. స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు. ఉన్నదల్లా జీవితమే! సమంత పాత్ర పోషించిన లోరెలీ సాక్షాత్తూ దర్శకుడు లింక్లాటర్ కూతురే. ఇటీవల ‘బాఫ్తా’ అవార్డుల్లో ‘బాయ్‌హుడ్’ ఉత్తమ చిత్రమైతే, లింక్లాటర్ ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అంటారు. రిచర్డ్ లింక్లాటర్ ఒక పుణ్య పురుషుడు. ‘ఆస్కార్’ అవార్డుల్లోనూ ‘బాయ్‌హుడ్’ చిత్రం తొమ్మిది విభాగాల్లో నామినేటై, ఉత్తమ చిత్రం విభాగంలో గట్టి పోటీనిచ్చినా, చివరకు ఉత్తమ సహాయ నటి విభాగంలో మాత్రమే ఆస్కార్‌ను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ‘ఆస్కార్’ను అందుకోకపోయినా, అంతకు మించిన గౌరవమున్న చిత్రంగా ‘బాయ్‌హుడ్’ రానున్న రోజుల్లో హాలీవుడ్ చిత్ర చరిత్రలో నిలిచిపోతుంది. పైకి చేదుగా అనిపించే ఈ తీపి జ్ఞాపకాన్ని తెరపై ఆస్వాదించండి. కథ ఏమిటంటే... సమంత, మేసన్ అక్కా తమ్ముళ్లు. వీళ్ల తల్లి ఒలివా సొంత కాళ్లపై నిలబడాలనుకుని డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం సంపాదిస్తుంది. ఒలివా భర్త సీనియర్ మేసన్ ఇరాక్ యుద్ధంలో ఉండడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతుంటాడు. దాంతో ఒలివా, సీనియర్ మేసన్ విడిపోతారు. మూడేళ్ల తర్వాత - ఒలివా తన కుమారుడి ప్రొఫెసరైన బిల్‌తో ప్రేమలో పడుతుంది. బిల్ పిల్లలతో కలిసి సమంత, మేసన్ ఉండాల్సి వస్తుంది. బిల్‌కు క్రమశిక్షణ ఎక్కువ. పిల్లల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు. కొన్నాళ్ల తర్వాత బిల్ మద్యానికి బానిసై, ఒలివాను హింసిస్తుంటాడు. దాంతో ఒలివా, అతడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఇదంతా తెలుసుకున్న సీనియర్ మేసన్, ఒలివాకు సర్ది చెప్పి సమంత, మేసన్లను వేరే ప్రాంతానికి తీసుకువెళతాడు. మళ్లీ కొత్త జీవితం మొదలవుతుంది. ఒలివా వేరొకరితో సహజీవనం చేస్తుంది. మేసన్‌కు క్రమంగా ఫొటోగ్రఫీపై ఆసక్తి మొదలవుతుంది. ఒక పార్టీలో మేసన్, షీనా అనే యువతితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరూ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మేసన్‌కు షీనాతో త్వరగా బ్రేకప్ అవుతుంది. ఇంతకీ ఫొటోగ్రఫీలో మేసన్‌కు సిల్వర్ మెడల్ వస్తుంది. డిగ్రీ కూడా సాధిస్తాడు. సమంత, మేసన్‌ల భవిష్యత్ ప్రణాళికలను చర్చించడానికి ఒలివా వారిని లంచ్‌కు పిలుస్తుంది. గత జీవితం చాలా విఫలమైందనీ, అందుకే ఇల్లు అమ్మేస్తున్నాననీ ఒలివా చెబుతుంది. ఇంతలో మేసన్ చదువుకోవడానికి యూనివర్సిటీకి వెళతాడు. అక్కడ పరిచయమైన స్నేహితుడితో కలిసి నేషనల్ పార్క్‌కు వెళతాడు. ‘ఈ క్షణాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉండాలి’ అని వాళ్లు అనుకోవడంతో సినిమాకు ‘శుభం’ కార్డు పడుతుంది. ఆయన రూటే సెపరేటు! అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, రచయిత అయిన యాభై అయిదేళ్ళ రిచర్డ్ స్టూవర్ట్ లింక్లాటర్ విభిన్న తరహా చిత్రాలను రూపొందిస్తుంటారు. ప్రేమ చుట్టూ తిరిగే కథతో ఆయన తీసిన ‘బిఫోర్ సన్‌రైజ్’ (1995), ‘బిఫోర్ సన్‌సెట్’ (2004), ‘బిఫోర్ మిడ్నైట్’ (2013)ల చలనచిత్ర త్రయం గురించి సినీ వర్గీయులు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అదే నటీనటుల్ని తీసుకొని కొన్నేళ్ళ పాటు వాళ్ళను చిత్రీకరించడమనే పద్ధతిని ఆయన ఆ ట్రయాలజీలోనూ, ఈ ‘బాయ్‌హుడ్’లోనూ అనుసరించారు. సినీ దర్శకత్వానికి రాక ముందు అనేక సంవత్సరాలు ఆయన ఫిల్మ్ టెక్నిక్‌లకు అభ్యాసాలుగా, ప్రయోగాలుగా చాలా లఘు చిత్రాలు తీశారు. చిత్రం ఏమిటంటే, ఒక రోజులో జరిగిన కథగా సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. ఇటీవలి కాలంలో ఆ రకమైన ఇతివృత్తాలు బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఇక, పన్నెండేళ్ళ పాటు ఆయన చిత్రీకరించిన ‘బాయ్‌హుడ్’ తాజాగా వార్తల్లో నిలిచింది. హాలీవుడ్ చిత్రాలు తీస్తున్నప్పటికీ, ఇప్పటికీ స్వస్థలమైన టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోనే ఉండడం ఆయన విల క్షణత. సాంప్రదాయిక సినీ కథాకథన శైలికి భిన్నంగా వెళ్ళడం వృత్తిపరంగానూ లింక్లాటర్ను ఇతరులకు భిన్నంగా నిలుపుతోంది. -
‘బర్డ్‌మ్యాన్’కు ఆస్కార్ కిరీటం
‘బర్డ్‌మ్యాన్’, ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’లకు నాలుగేసి అవార్డులు... ‘విప్‌ల్యాష్’కు 3 సహజత్వానికి ప్రాధాన్యమిచ్చిన ‘బాయ్‌హుడ్’కు ఒకే అవార్డు స్పెషల్ ఎఫెక్ట్స్‌లో ‘ఇంటర్స్టెల్లార్’... సౌండ్ ఎడిటింగ్‌లో ‘అమెరికన్ స్నైపర్’లకు పట్టం ఉత్తమ విదేశీ భాషా చిత్రం... పోలెండ్‌కు చెందిన ‘ఇదా’ ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) అంగరంగ వైభవంగా సాగింది. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ ఈ అవార్డు ప్రదానోత్సవ వేదిక వద్ద తారల సందడి తగ్గలేదు. హాలీవుడ్‌కూ, అక్కడ కష్టాలు పడే నటీనటులకూ అద్దం పట్టిన వ్యంగ్యభరిత హాస్య చిత్రం ‘బర్డ్ మ్యాన్’ ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ‘ఉత్తమ చిత్రం’గా ఎంపికైంది. ‘ఉత్తమ చిత్రం’తో పాటు ‘ఉత్తమ దర్శకుడు’, ‘ఉత్తమ ఛాయాగ్రహణం’, ‘ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’తో కలిపి, మొత్తం 4 విభాగాల్లో ‘బర్డ్‌మ్యాన్’ చిత్రం ఈ 87వ వార్షిక అకాడెమీ అవార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, మేకప్, కాస్ట్యూవ్ు డిజైన్ విభాగాలు నాలుగింటిలో ఉత్తమంగా నిలిచింది. ఇక, ‘విప్‌ల్యాష్’ చిత్రం ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఉత్తమ సహాయ నటుడి విభాగాలు మూడింటిలో విజేత అయింది. ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ అయిన ఎనిమిది సినిమాలూ కనీసం ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి. అయితే, అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బాయ్‌హుడ్’ చిత్రం మాత్రం ఒకే ఒక్క అవార్డుతో సంతృప్తిపడాల్సి వచ్చింది. ఒక చిన్న పిల్లవాడు పన్నెండేళ్ళ పైచిలుకు వయసు దాకా పెరిగే క్రమాన్ని అదే నటీనటులతో, కాలాన్ని లెక్క చేయక ‘బాయ్‌హుడ్’గా రూపొందించిన రిచర్డ్ లింక్లేటర్కు నిరాశ ఎదురైంది. అలాగే, అమెరికన్లు పెద్ద పీట వేస్తారనుకున్న ‘అమెరికన్ స్నైపర్’కూ ఒకే అవార్డు (సౌండ్ ఎడిటింగ్) దక్కింది. నిరుడు ‘గ్రావిటీ’తో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికైన ఎమాన్యుయెల్ లుబెజ్కీ ఈసారి ‘బర్డ మ్యాన్’తో మళ్ళీ ఆస్కార్ గెలవడం విశేషం. అయితే, ఉత్తమ నటన విభాగాల్లో మొత్తం శ్వేత జాతీయులనే నామినీలుగా ఎంచుకున్నారనే విమర్శలు... రాజకీయాలున్నాయనే గుసగుసలు... ఆత్మహత్యల నివారణ, ప్రభుత్వ నిఘా లాంటి అంశాలపై ఉపన్యాసాల మధ్య ఈ ఉత్సవం సాగడం గమనార్హం. ఈసారి అవా ర్డులందుకొన్న చిత్రాల్లో ‘అమెరికన్ స్నైపర్’, ‘ది థీరీ ఆఫ్...’, ‘ఇమిటేషన్ గేమ్’ లాంటివన్నీ నిజజీవిత వ్యక్తుల ఆధారంగా రూపొందినవే కావడం విశేషం. ఉత్తమ చిత్రం: బర్డ్‌మ్యాన్ ‘బర్డ్ మ్యాన్’ (లేదా ‘ది అనెక్స్పెక్టెడ్ వర్చ్యూ ఆఫ్ ఇగ్నోరెన్స్’) సినిమా అమెరికన్ వ్యంగ్యభరిత హాస్య - నాటకీయ చిత్రం. వరుసగా అనేక చిత్రాల్లో సూపర్‌హీరో ‘బర్డ్‌మ్యాన్’గా పాత్రపోషణ చేసి సుపరిచితుడై, తెర మరుగైన రిగ్గన్ థామ్సన్ అనే హాలీవుడ్ నటుడి పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. అతను బ్రాడ్వేలో సొంత నాటకం ద్వారా ఒక సీరియస్ నటుడిగా మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆశిస్తాడు. అయితే, పేరుతో పాటు అహంకారం కూడా ఎక్కువున్న ఒక సినీ తార కూడా తన తారాగణంలో ఉండడంతో థామ్సన్‌కు ఎదురైన ఇబ్బందులేమిటి? వగైరా అంశాలతో వ్యంగ్యభరిత హాస్యం రంగరించిన సినిమా ఇది. రెండు గంటల నిడివి గల ఈ చిత్రం గత ఏడాది అక్టోబర్ 17న అమెరికాలో విడుదలైంది. తాజా ఆస్కార్ అవార్డుల్లో మొత్తం 9 విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది. ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’కు కూడా 9 విభాగాల్లో నామినేటైంది. చివరకు చెరి నాలుగేసి విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ దర్శకుడు: అలెగ్జాండ్రో గొంజాలెజ్ ఇనారిట్ (చిత్రం: ‘బర్డ్ మ్యాన్’) యాభై ఒక్క సంవత్సరాల అలెగ్జాండ్రో సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. మెక్సికోలో జన్మించిన ఆయన 17 ఏళ్ళ వయసులో అట్లాంటిక్ సముద్రంపై సరకుల రవాణా నౌకలో ప్రయాణం సాగించారు. చిన్న వయసులో చేసిన ఆ ప్రయాణాలు సినీ రూపకర్తగా తనపై అమిత ప్రభావాన్ని చూపాయని ఆయనే చెబుతుంటారు. తాను చూసిన ప్రదేశాలను నేపథ్యాలుగా ఎంచుకోవడం ఆయన అలవాటు. ఆయన తీసిన సినిమాలు ‘అమోరెస్ పెర్రోస్’ (2000), ‘21 గ్రామ్స్’ (2003), ‘బాబెల్’ (2006), ‘బ్యూటిఫుల్‘ (2010), తాజా ‘బర్డ్ మ్యాన్’ (2014)లు ప్రపంచవ్యాప్తంగా ఆదరణనూ, అవార్డుల్నీ అందుకోవడం విశేషం. ‘బర్డ్ మ్యాన్’కు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ గెలుచుకోవడం అందుకు తాజా ఉదాహరణ. ఒక మెక్సికన్ సినీ రూపకర్తకు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు రావడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది ‘గ్రావిటీ’ చిత్రం ద్వారా ఆ ఘనత సాధించిన అల్ఫాన్సో క్యువారోన్ కూడా మెక్సికనే! ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్మెయిన్ (చిత్రం: ‘ది థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్’) ప్రపంచ ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీసిన ‘ది థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్’లో హ్యాకింగ్ పాత్రకు చాలా శ్రమించి, ప్రాణం పోశారు - నటుడు ఎడ్డీ రెడ్మెయిన్. హ్యాకింగ్ మాజీ భార్య రాసిన జ్ఞాపకాల పుస్తకం ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమా తీశారు. కేవలం 33 ఏళ్ళ వయసులో ఆయన పోషించిన ఈ నిజజీవిత పాత్ర అందరి ప్రశంసలనూ అందుకుంది. అత్యంత సహజంగా సాగిన ఈ పాత్రపోషణకు ఇప్పటికే ఉత్తమ నటుడిగా ‘గోల్డెన్ గ్లోబ్’, ‘బాఫ్తా’తో సహా పలు అవార్డులందుకున్న ఈ ఇంగ్లీషు నట, గాయక, మోడల్‌కు ఆస్కార్ తాజా విజయం. ఉత్తమ నటుడి విభాగంలో ‘బర్డ్ మ్యాన్’లోని టైటిల్ పాత్రధారి మైకేల్ కీటన్తో పోటీ పడి, ఆస్కార్‌ను గెలిచారు ఎడ్డీ. లండన్‌లో పుట్టి పెరిగిన ఎడ్డీ ఇరవయ్యేళ్ళ వయసులోనే రంగస్థలంపై నటుడిగా ఓనమాలు దిద్దారు. ‘ది గుడ్ షెపర్డ్’, ‘లే మిజరబుల్స్’ లాంటి పలు చిత్రాల్లో నటించిన ఎడ్డీకి టెలివిజన్ నటనలోనూ అనుభవం ఉంది. రంగస్థలం, టీవీ, సినిమా - మూడింటిలోనూ తనదైన ముద్ర వేయడం విశేషం. ఆస్కార్ అందుకున్న ఎడ్డీని స్టీఫెన్ హ్యాకింగ్ అభినందించారు. ఉత్తమ నటి: జూలియన్ మూర్ (చిత్రం: ‘స్టిల్ ఎలైస్’) పిన్న వయసులోనే అల్జీమర్స్ వ్యాధి వచ్చి, బాధకు గురైన మహిళగా ‘స్టిల్ ఎలైస్’ చిత్రంలో చూపిన నటన జూలియన్ మూర్కు ఆస్కార్ కిరీటాన్ని అలంకరించింది. భావోద్వేగపరంగా సమస్యలకు గురైన మహిళల పాత్రలను పోషించడంలో మూర్ దిట్ట. ఆ రకంగా 54 ఏళ్ళ ఈ అమెరికన్ నటి, పిల్లల పుస్తకాల రచయిత్రి ఇప్పటికి అయిదు సార్లు నటనా విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. తొలిసారిగా ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు. పిల్లల కోసం ఆమె రాసిన పుస్తకాల్లో కొన్ని ‘బెస్ట్ సెల్లర్స్’ ఉండడం విశేషం. టూ మచ్ బాబూ... వ్యాఖ్యాతలు ఎంత జోరుగా ఉంటే వేడుకలు అంత పసందుగా సాగుతాయి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు నీల్ ప్యాట్రిక్ హ్యారిస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘ఇవాళ హాలీవుడ్ బెస్ట్ అండ్ వెటైస్ట్.... ఐ మీన్ బ్రైటెస్ట్ పీపుల్‌కి అవార్డులు ప్రదానం చేయబోతున్నాం’ అని వేడుక ఆరంభంలోనే చర్చకు తావిచ్చే మాటలు మాట్లాడారు నీల్. ఈ ఏడాది నామినేషన్స్‌లో నల్ల జాతికి చెందినవారికి ప్రముఖ విభాగాల్లో స్థానం కల్పించలేదనే వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ‘బెస్ట్ అండ్ వెటైస్ట్’ అని ప్రసంగం మొదలుపెట్టి, అంతలోనే వెటైస్ట్ అంటే బ్రైటెస్ట్ అని మాట మార్చాడు. ఇక, ‘బర్డ్ మ్యాన్’ చిత్రం గురించి మాట్లాడేటప్పుడు అందులోని సన్నివేశాన్ని తలపించే విధంగా లో దుస్తుల్లో వేదిక పైకి వచ్చాడు నీల్. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వీక్షించే ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో ఇలా చేయడం ‘టూ మచ్ బాబూ’ అన్నవాళ్లూ ఉన్నారు. విజేతల పేర్లు వీరిద్దరికే తెలుసు! ఆస్కార్ అవార్డ్ విజేతలను ఎంపిక చేయడమనే వ్యవహారం అంత సులువు కాదు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్‌లో మొత్తం 6,100 మంది సభ్యులు ఉంటారు. వీళ్లందరూ వేసిన ఓట్లే విజేతలను నిర్ణయిస్తాయి. మూడేళ్లకు ముందు ఓటింగ్ విధానం మొత్తం పేపర్ వర్క్‌తోనే సాగేది. కానీ, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ పద్దతిలో ఓట్లు వేయడం మొదలైంది. సభ్యులందరి ఓట్లను చివరికి పరిగణనలోకి తీసుకునేది ఇద్దరే వ్యక్తులు. వాళ్లే.. ‘ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థకు చెందిన ‘బ్రియాన్ కల్లినన్, మార్తా రూయిజ్’. విజేతలను కూడా నిర్ణయించేది వీళ్లే. గత మంగళవారంతో ఓటింగ్ ముగిసింది. 24 శాఖలకు సంబంధించి 6,000 పై చిలుకు ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లు లెక్కించి, విజేతలను శుక్రవారం నిర్ణయిస్తారు. 24 శాఖలకు సంబంధించిన విజేతలను నిర్ణయించిన తర్వాత ఒక్కో విజేత పేరుని ఒక్కో కార్డులా తయారు చేస్తారు. వాటిని ఆయా శాఖ పేరు ముద్రించిన కవర్లలో భద్ర పరుస్తారు. ఈ 24 కవర్లను రెండు బ్రీఫ్‌కేసులలో పెడతారు. ఒకవేళ పొరపాటున ఈ బ్రీఫ్‌కేసులు పోతే..? అందుకే విజేతలను నిర్ణయించిన బ్రియాన్ కల్లినన్, మార్తా రూయిజ్లువారి పేర్లను తమ మనసులో గుర్తుంచుకుంటారు. అది అవార్డు కమిటీ నిబంధన. విజేతల ఎంపిక పూర్తయ్యి, బ్రీఫ్‌కేసులు రెడీ అయిన క్షణం నుంచీ ఈ ఇద్దరినీ సెక్యుర్టీ గార్డులు వెన్నంటే ఉంటారు. ఆస్కార్ అవార్డు వేడుక ముగిసే వరకు ప్రకృతి అవసరాలు మినహా కాపలాదారుల కనుసన్నల్లోనే ఈ ఇద్దరూ ఉండాలి. చివరి నిమిషం వరకూ విజేతల వివరాలు బ్రియాన్, మార్తాలకు తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు. నామినీలకూ 'కోట్లు'! పోటీలో అందరూ గెలవాలని ఎక్కడా ఉండదు. గెలిచినవాళ్లకు ఆనందం, గెలవనివాళ్లకు బాధ కూడా సహజమే. అందుకే, నామినేషన్‌తో సరిపెట్టుకున్నవారికి కొంతలో కొంత ఊరట ఇచ్చే విధంగా ఆస్కార్ అవార్డ్ కమిటీ వారికి ఒక్కొక్కరికీ లక్షా 68 వేల డాలర్లు (సుమారు కోటి రూపాయలకు పైగా) విలువ చేసే బహుమతులు ఇచ్చింది. వీటిని ఓ పెద్ద బ్యాగ్‌లో ఉంచి ఇస్తారు. అందులో ఏమేం ఉంటాయంటే... బ్రాండెడ్ స్ప్రే, సోప్ లిప్ గ్లాస్ హెర్బల్ టీ, యాపిల్స్ స్త్రీలకు బ్రాండెడ్ మణికట్టు గొలుసు, పురుషులకు మంచి టైలు అలెక్సిస్ సెలెజ్కీ అనే ఫిజికల్ ట్రైనర్ దగ్గర పది సెషన్స్ ఉచిత శిక్షణ చర్మ, కేశ సంరక్షణకు సంబంధించిన సౌందర్య సాధనాలు హోమ్ స్పా సిస్టమ్ ఓ ఐదు నక్షత్రాల హోటల్లో మూడు పగలు, రెండు రాత్రులు గడిపే సౌకర్యం లగ్జరీ రైల్ ట్రిప్ ఓ జ్యోతిష్కుడు నామినీల ఇంటికెళ్లి ఈ ఏడాది వారి జాతకం ఎలా ఉందో చెప్పే వెసులుబాటు. ఇలా పలు రకాల బహుమతులు ఉంటాయి. ఎర్ర గులాబీలు ‘‘అందమైన భామలు.. లేత మెరుపు తీగలు.. ముట్టుకుంటే మాసిపోయె వన్నెల అందాలు...’’ అందాల భామలను చూసినప్పుడు ఈ పాట గుర్తుకు రావడం ఖాయం. ఆస్కార్ వేడుకలో ఎర్ర తివాచీపై ఒయ్యారాలు పోయిన అందగత్తెలను చూసి, ఇంగ్లిష్‌వాళ్లు ఏం పాటేసుకున్నారో కానీ.. మన తెలుగువాళ్లు మాత్రం ఈ పాట పాడుకోకుండా ఉండలేరు. ప్రతి ఏడాదీ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో రెడ్ కార్పెట్‌పై ‘కాట్ వ్యాక్’ చేసే నటీమణులను వీక్షించడానికి చాలామంది టీవీలకు కళ్లప్పగించేస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. చూపులు తిప్పుకోవడం కష్టమైందట. నిజమే కదూ... విజేతలు వీరే! ఉత్తమ చిత్రం: బర్డ్‌మ్యాన్ ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్మెయిన్ ఉత్తమ నటి: జూలియన్ మూర్ ఉత్తమ సహాయ నటుడు: జె.కె. సిమ్మన్స్ (‘విప్‌ల్యాష్’) ఉత్తమ సహాయనటి: ప్యాట్రీషియా ఆర్క్వెట్టె (బాయ్‌హుడ్) ఉత్తమ యానిమేటడ్ మూవీ: ‘బిగ్ హీరో సిక్స్’ ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎమాన్యుయెల్ లుబెజ్కీ (‘బర్డ్‌మ్యాన్’) ఉత్తమ వస్త్రాలంకరణ: మిలెనా కానొనెరో (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్) ఉత్తమ దర్శకుడు: అలె గ్జాండ్రో ఇనారిట్ (బర్డ్‌మ్యాన్) ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సిటిజన్ ఫోర్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: క్రైసిస్ హాట్‌లైన్ - వెటరన్స్ ప్రెస్ వన్ ఉత్తమ కూర్పు: టామ్ క్రాస్ (‘విప్‌ల్యాష్’) ఉత్తమ విదేశీ భాషా చిత్రం: పోలండ్ చిత్రం ‘ఇదా’ ఉత్తమ మేకప్ - కేశాలంకరణ: ఫ్రాన్సెస్ హానన్, మార్క్ కౌలియర్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్) ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (అలెగ్జాండ్రె డెస్ప్లాట్) ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గ్లోరీ... (చిత్రం ‘సెల్మా’) ఉత్తమ ప్రొడక్ష న్ డిజైన్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఆడమ్ స్టాక్హొజెన్, అన్నా పినోక్) ఉత్తమ యానిమేటెడ్ లఘుచిత్రం: ‘ఫీస్ట్’ (ప్యాట్రిక్ ఓస్బోర్న్, క్రిస్టీనా రీడ్) ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ‘ది ఫోన్ కాల్’ ( మ్యాట్ కిర్క్‌బీ, జే మ్స్ లూకాస్) ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: ‘అమెరికన్ స్నైపర్’ (ఏలన్ రాబర్ట్ ముర్రే బుబ్ అస్మాన్) ఉత్తమ సౌండ్ మిక్సింగ్: ‘విప్‌ల్యాష్’ (క్రెగ్మాన్, బెన్ విల్కిన్స్, థామస్ కర్లే) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ‘ఇంటర్స్టెల్లార్’ (పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్లే, ఇయాన్ హంటర్, స్కాట్ ఫిషర్) ఉత్తమ ఎడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: ‘ది ఇమిటేషన్ గేమ్’ (గ్రాహమ్ మూర్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: అలె గ్జాండ్రో ఇనారిట్ (‘బర్డ్‌మ్యాన్’) -
హీరోల కంటే మేమేమి తక్కువ: పాట్రికా
హాలీవుడ్ చిత్రసీమలో కూడా మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్నారని నటి పాట్రికా అర్క్విటే (46) ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. తమకు కూడా నటులతో పాటు సమాన వేతనాలందించాలని ఆమె కోరారు. పాట్రికా అర్క్విటే ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బాయ్ హుడ్' చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటి అవార్డును దక్కించుకున్నారు. ఈ చిత్రంలో విడాకులు పొందిన ఓ తల్లిగా ఆమె పోషించిన పాత్ర అద్భుతం. దర్శకుడు రిచర్డ్ లింక్లటర్ ఈ పాత్రను గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు పన్నేండేళపాటు చిత్రీకరణ జరుపుకున్న గొప్ప వర్ణనాత్మక చిత్రంలో పాట్రికా అర్క్విటే గొప్ప నటనా ప్రతిభను కనబరిచారు. ఈ అవార్డు అందుకుంటున్న సందర్భంలో ఆమె మాటలు అందరినీ అమితంగా ఆకర్షించాయి. చిత్ర పరిశ్రమలో మహిళా హక్కుల గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. హాలీవుడ్లో మహిళలకు సమాన వేతనాలు ఇవ్వాలని కోరారు. దీనికి అందరు సమ్మతం తెలిపారు. 'ఓకే జీసస్.. నాకు ఈ అవార్డు అందించిన అకాడమీకి ధన్యవాదాలు. నేను ఈ అవార్డును చిత్ర బృందానికి నాతోపాటు అద్భుతంగా నటించిన ఇతరులకు అంకితం చేస్తున్నాను' అని ఉద్వేగపూరితంగా అన్నారు. పాట్రికా అర్క్విటే ఆస్కార్ నామినేషన్‌కు వరకూ రావటం కూడా ఇదే తొలిసారి. -
జోరు మీద బాయ్‌హుడ్
మరో రెండు వారాల్లో ఆస్కార్ విజేతల ఎవరో తెలుస్తారనగా ఈ లోపే బ్రిటీష్ అకాడమీ టెలివిజన్,ఫిలిం ఆర్ట్స్ (బాఫ్తా) అవార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఆస్కార్ బరిలో హాట్ ఫేవరెట్స్‌గా ఉన్న ‘బాయ్‌హుడ్’, ‘బర్డ్‌మేన్’ చిత్రాలు మరోసారి బాఫ్తా అవార్డుల్లో తలపడ్డాయి. అత్యంత కీలక విభాగాలైన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను ‘బాయ్‌హుడ్’ చిత్రం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి చిత్రంపై పడింది.‘బర్డ్‌మేన్’ కేవలం ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును మాత్రమే దక్కించుకుంది. ఆస్కార్ నామినేషన్స్‌లో హాట్ ఫేవరె ట్‌గా ఉన్న మరో చిత్రం‘ ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లంచ్ బాక్స్’కు నిరాశే ఎదురైంది. పోలాండ్ చిత్రం ‘ఇదా’ ఈ విభాగంలో విజేతగా నిలిచింది.