ఏసీ బోగీలో.. ఎలుక కొరికేసింది!
తిరువనంతపురం: ఒకపక్క ప్రయాణికుల ట్వీట్లకు సాక్షాత్తు రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పందించి చర్యలు చేపడుతుంటే.. మరోవైపు రైళ్లలో ఎలుకలు సృష్టిస్తున్న గలాటా మాత్రం సద్దుమణగడం లేదు. దేశంలో ఏదో ఒక మూల నిత్యం ఈ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ఎలుకలు ఒక ప్రయాణికుడి కాలి బొటనవేలును కొరికి పడేశాయి. కనీస ప్రాథమిక చికిత్స అందుబాటులో లేకపోవడం, టీటీఈ నిర్లక్ష్యం వెరసి ప్రయాణికుడి ఆగ్రహానికి కారణమైంది.
టికేజి నాయర్ మంగళూరు ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు. రైలు కొట్టాయం స్టేషన్ చేరుకునేసరికి ప్రయాణికులందరూ నిద్రలోకి జారుకోగానే ఎలుకలు తమ ప్రతాపాన్ని చూపించాయి. ప్రయాణికులపై దాడిచేశాయి. నాయర్ కాలి బొటనవేలును గాయపర్చాయి. రక్తస్రావంతో విపరీతమైన నొప్పి కలగడంతో ఉలిక్కిపడి లేచాడు నాయర్. దీంతో అతనితో పాటు మిగతా ప్రయాణికులందరూ టీటీఈకి ఫిర్యాదుచేశారు. ఎర్నాకులంలో వైద్య సహాయం అందుతుందని అతడు చెప్పాడు గానీ అలాంటిదేమీ జరగేలేదు. త్రిసూర్ స్టేషన్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆ తర్వాత టీటీఇ పత్తా లేకుండా పోయాడు. చివరికి మర్నాటి ఉదయం 11 గంటల తరువాత రైలు కన్నూర్ చేరాక వైద్యబృందం వచ్చి సెప్టిక్ లోషన్‌తో గాయం శుభ్రం చేశారు తప్ప, యాంటీ టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ కూడా ఇవ్వలేదు. తమ దగ్గర డాక్టర్ గానీ, పారా మెడికల్ సిబ్బంది కానీ లేరని సమాధానం చెప్పారు. చివరకి మంగళూరు చేరిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్ కిల్లర్ సహా కొన్ని మాత్రలు ఇచ్చి పంపించారు.
కనీసం యాంటీసెప్టిక్ ఇంజక్షన్ లేకపోవడం బాధ కలిగించదని నాయర్ ఆవేదన వ్యక్తంచేశారు. చికిత్స కోసం దాదాపు 11 గంటల పాటు వేచిచూడాల్సి రావడం దురదృష్టకరమన్నారు. తనకు తీరని మనోవేదన మిగిల్చిన ఈ ఉదంతంపై నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించనున్నట్లు నాయర్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి హెచ్చరికలను ఉద్యోగులు పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపడకపోవడం, కనీస వైద్యసాయం కూడా అందుబాటులో లేకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు.