breaking news
bhumanagi reddy
-
భూమా మృతికి వెంకయ్య సంతాపం
హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా కర్నూలు జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూమా సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, ఆ విషాదం నుంచి కోలుకునే లోపే ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ, వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. -
టీడీపీ కుట్రలను తిప్పి కొడతాం
నంద్యాల: టీడీపీ కుట్రలను తిప్పికొట్టి.. కర్నూలు జెడ్పీ పీఠం కైవసం చేసుకుంటామని వైఎస్సార్సీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ కంటే 10 జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీకి అధికంగా గెలుకుందన్నారు. అయితే ప్రజా తీర్పును అవహేళన చేస్తూ వారిని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ నాయకులు కుట్రలు పన్నారని, వాటిని తిప్పి కొడతామన్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన లాలుస్వామికి జెడ్పీ చైర్మన్ దక్కే విధంగా వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన జెడ్పీటీసీలు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచి పార్టీ మారిన ఎంపీ ఎస్పీవెరైడ్డిపై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ప్రలోభాలతో కాకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు. నంద్యాల పట్టణంలో వందేళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని విశ్వవిద్యాలయంగా మార్చాలని ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిని కోరనున్నట్లు చెప్పారు. గత ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వల్లే నంద్యాల ప్రాంతానికి పెద్ద ప్రాజెక్టులు రాలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేపట్టే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇక నుంచి భూమా శోభా మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రస్తుతం నంద్యాలలో రూ.20 లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వాటని పోలీస్ శాఖకు అప్పగిస్తున్నామన్నారు. అలాగే కళాశాల విద్యార్థులకు వైఫైని కూడా త్వరలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో మృతి చెందిన పేదల కోసం వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే పేదల కోసం ఫ్రీజర్ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇతర సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు.