breaking news
Bhimasena
-
భీమసేనుడు
భీముడు అంటే కుంతీపుత్రుడయిన భీమసేనుడే కాదు. భయం కలిగించగల వాడెవరయినా భీముడే. శ్రీమన్నారాయణుడికి ‘భీమో, భీమ పరాక్రమః’ అని విష్ణు సహస్ర నామాలలో రెండు నామాలు కనిపి స్తాయి. మన పౌరాణిక నామాలు దాదాపు అన్నీ సార్థక నామాలే. ఆ పేర్లకు ఆ వ్యక్తుల గుణ గణా లతోనో, ఘన కార్యాలతోనో జీవిత విశేషాలతోనో ముడిపడిన వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. సాధారణ అర్థంలో మాత్రం భీముడు అంటే వాయుదేవుడి వరం వలన కుంతీదేవికి కలిగిన భీమబలుడైన కుమారుడు. బాల్యం నుంచే భీముడు బండలు పిండి చేయగల బలశాలి. పాండవుల పట్ల దుర్యోధనుడి ఈర్ష్యకు తొట్ట తొలి కారణం భీముడి అసాధారణ మైన శరీర బలం. కౌరవ పాండ వులు కలసి పెరుగుతూ విద్యా భ్యాసం చేసే రోజులలో, భీముడు కొంటెతనంతో తన భుజబలాన్ని తన సవతి తమ్ముళ్ల మీద ప్రయో గించే వాడని భారతం చెప్తుంది. పది పదిహేనుమంది కౌరవులని ఒక్కసారి చంకనెత్తుకొని నీళ్లలో ముంచే వాడు. వాళ్లు చెట్లెక్కి పళ్లు కోస్తుంటే, చెట్టునే కదిలించి చెట్టు పళ్లనూ, వాటిని కోస్తున్న పిల్లలనూ ఏకకా లంలో కిందికి రాల్చేసి నవ్వేవాడు. జన్మతః ఈర్ష్యాళు వైన దుర్యోధనుడికి భీముడి బాహుబలమంటే కంట గింపు. అది భీముడిని కుట్రలు చేసి చంపి వేసే ప్రయ త్నాల దాకా వెళ్లింది. అయితే దుర్మార్గుడి దుర్మార్గం వల్ల కూడా సజ్జ నుడు సత్ఫలితాలే పొందుతాడు. నిద్రిస్తున్న భీముడి కాళ్లూ చేతులు కట్టివేసి దుర్యోధనుడు నీళ్లలో పారే యించినా, భీముడు పాతాళ లోకానికి వెళ్లి, వెయ్యి ఏనుగుల బలం వరంగా పొంది తిరిగి వచ్చాడు. భీముడు కార్యశూరుడేగానీ అతడిని కార్యోన్ముఖం చేసేందుకు గట్టి బాహ్య ప్రేరణ ఏదైనా కావాలి. అదృష్టవశాత్తూ అతడికి ధర్మరాజు మార్గదర్శనం లభించింది. అన్న వ్యూహానికి తన పరాక్రమం జోడించి ఎన్నో ఘన విజయాలు సాధించగలిగాడు. తల్లి దీవించి పంపగా వెళ్లి ప్రజాకంటకుడైన బకాసు రుడిని పరిమార్చాడు. శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో మహా వీరుడైన జరాసంధుడిని మట్టుపెట్టాడు. ద్రౌపది ప్రేర ణతో కీచకుడిని చంపి మూటగట్టాడు. యుద్ధంలో కౌరవులను ఎక్కువ మందిని భీముడే చంపేస్తాడు. ఆ పగతోనే, దృతరాష్ర్టుడు, యుద్ధానంతరం, అన్ని పాత వైరాలూ మరిచిపోయి ఆప్యాయంగా కౌగిలించుకొనే మిషతో భీముడిని తన ఉక్కు కౌగిలిలో నలిపి చంపటానికి సిద్ధపడతాడు. వ్రతం చెడిందే గానీ ఫలం దక్కలేదు. యతో ధర్మ స్తో జయ అన్న పాఠాన్ని ఆ మోహాంధుడైన రాజుకు నేర్పేం దుకు విధి చేసిన ఆఖరి ప్రయత్నం అది. - ఎం. మారుతి శాస్త్రి -
ధృతరాష్ట్ర కౌగిలి
నానుడి కురుసార్వభౌముడైన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయినా, వేదవ్యాసుడి వరం వల్ల అతడికి పదివేల ఏనుగుల బలం ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్నాడు. నిండుసభలో చేసిన ప్రతిజ్ఞ మేరకు వందమందినీ భీముడే మట్టుబెట్టాడు. కొడుకులు మరణించినందుకు దుఃఖంతో, వాళ్లందరినీ పొట్టన పెట్టుకున్న భీముడిపై కోపంతో రగిలిపోసాగాడు. అలాంటి సమయంలో పట్టాభిషేకానికి ముందు పెదనాన్న ఆశీస్సుల కోసం ధర్మరాజు సపరివార సోదర సమేతంగా ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. వారితో కృష్ణుడు కూడా ఉన్నాడు. ఆశీస్సులు తీసుకుంటున్న ఒక్కొక్కరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ, భీముడి వద్దకు ‘రా నాయనా.. భీమసేనా..’ అంటూ వచ్చాడు ధృతరాష్ట్రుడు. అతడి పగను, పన్నాగాన్ని ఎరిగిన కృష్ణుడు ముందే ఏర్పాటు చేసిన ఇనుప విగ్రహాన్ని ముందుకు నెట్టమని భీముడికి సైగ చేశాడు. భీముడు అలాగే చేశాడు. విగ్రహాన్ని భీముడనుకున్న ధృతరాష్ట్రుడు తన బిగికౌగిలిలో బంధించాడు. అతడి బలానికి ఆ విగ్రహం పిండి పిండిగా రాలిపోయింది. అందుకే పాత పగలు మనసులో పెట్టుకుని, ఆప్యాయంగా చేరదీసి, కదల్లేని పరిస్థితులు కల్పించి నాశనం చేయడాన్ని ధృతరాష్ట్ర కౌగిలిగా అభివర్ణిస్తారు.