breaking news
Benefits Adoption
-
సెన్సెక్స్‌కు 314 పాయింట్లు నష్టం
27,644 పాయింట్లకు చేరిక * కొనసాగుతున్న లాభాల స్వీకరణ * 89 ‘మైనస్‌తో’ 8,370కు నిఫ్టీ అంచనాలు తప్పిన ఐటీసీ ఆర్థిక ఫలితాలు లాభాల స్వీకరణకు దారితీయడంతో స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. వడ్డీరేట్లను ఈ ఏడాదే పెంచే అవకాశాలున్నాయంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ యెల్లెన్ గత శుక్రవారం చేసిన వ్యాఖ్యల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు మరింత పతనమయ్యాయి. ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్‌లతో పాటు సిమెంట్ స్టాక్స్ కూడా పడిపోయాయి. మొత్తం మీద బీఎస్ఈ సెన్సెక్స్ 314(1.1 శాతం) పాయింట్లు నష్టపోయి 27,644 పాయింట్ల వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు(1.05 శాతం) నష్టపోయి 8,370 పాయింట్ల వద్ద ముగిశాయి. డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ముగుస్తున్న నేపథ్యంలో లాభాల స్వీకరణ జరిగిందని, ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని నిపుణులంటున్నారు. రేట్ల కోత ఆశలతో షేర్లను కొనుగోలు చేస్తూ వచ్చిన ఇన్వెస్టర్లు కొన్ని బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పొజిషన్లు తగ్గించుకున్నారని వారంటున్నారు. ఐటీసీ బేర్.... ఐటీసీ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. చాలా బ్రోకరేజ్ సంస్థలు కొనచ్చనే రేటింగ్‌ను కొనసాగించాయి. కానీ టార్గెట్ ధరను తగ్గించడంతో ఈ షేర్ 3.7 శాతం క్షీణించి రూ.317కు పతనమైంది. సీఎల్ఎస్ఏ టాటా స్టీల్‌ను రూ.290 టార్గెట్ ధరగా అమ్మవచ్చంటూ డౌన్‌గ్రేడ్ చేయడంతో ఈ షేర్ 2.7 శాతం పతనమై రూ.332 వద్ద ముగిసింది. 30కు 26 నష్టాల్లోనే 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. 1,531 షేర్లు నష్టపోగా, 1,149 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.1,975 కోట్లు. ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.11,976 కోట్లు., ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,80,829 కోట్లు. విదేశీ ఇన్వెస్టర్లు 74 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.17 లక్షల చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు. -
రైల్వే షేర్లు కుదేల్
- భారీ ప్రతిపాదనలు లేకపోవడం కారణం - లాభాల స్వీకరణతో క్షీణించిన పలు రైల్వే షేర్లు ముంబై: ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఊపునివ్వడంలో విఫలమైన రైల్వే బడ్జెట్ కారణంగా రైల్వే షేర్లు కుదేలయ్యాయి. రైల్వేలకు సంబంధించిన పలు షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్‌లో పెరిగినప్పటికీ, చివరకు నష్టాల్లోనే ముగిశాయి. రైల్వే బడ్జెట్లో భారీ సంస్కరణలు ఉంటాయనే అంచనాలతో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న రైల్వే షేర్లలో లాభాల స్వీకరణ జరిగిందని నిపుణులంటున్నారు. విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రతిపాదన కారణంగా హింద్ రెక్టిఫైర్ 15 శాతం వృద్ధితో రూ.89కు పెరిగింది. సబర్బన్ రైళ్లలో మహిళల భద్రత కోసం నిఘా కెమెరాలు అమరుస్తామన్న ప్రతిపాదనతో జికామ్ సెక్యూరిటీ సిస్టమ్స్ 5 శాతం పెరిగి రూ.179 వద్ద ముగిసింది. శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామన్న కారణంగా ఏటూజడ్ ఇంజినీరింగ్ 10 శాతం ఎగసి రూ.19 వద్ద ముగిసింది. టిటాఘర్ వ్యాగన్స్ 0.5 శాతం వృద్ధితో రూ.582కు ఎగసింది. కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ఎలాంటి మార్పు లేకుండా రూ.49 వద్ద ముగిసింది.సిమ్కో 7 శాతం, స్టోన్ ఇండియా 6 శాతం, సింప్లెక్స్ కాస్టింగ్స్ 4.2 శాతం, కాళింది రైల్ నిర్మాణ్ (ఇంజినీర్స్) 4 శాతం చొప్పున క్షీణించాయి. కంటైనర్ కార్పొరేషన్ 3.4 శాతం, టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ 2.5 శాతం, బీఈఎంఎల్ 1.6 శాతం, నెల్కో 1.9 శాతం చొప్పున తగ్గాయి.