balunayak
-
కల్తీ పెట్రోల్‌పై వినియోగదారుల కన్నెర్ర
♦ పెట్రోల్ బంకు వద్ద రెండు గంటల పాటు ఆందోళన ♦ స్టాక్‌ను విక్రయించరాదని తహశీల్దార్ ఆదేశం ♦ టెస్టింగ్ కోసం పెట్రోల్, డీజిల్ నమునాల సేకరణ ఉప్పునుంతల : ఉప్పునుంతలలోని బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని మంగళవారం ఉదయం వినియోగదారులు ఆందోళన చేశారు. పెట్రోలు పోయించుకొని కొద్దిదూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పెట్రోల్‌లో నీళ్లు కలిపారని వారు ఆరోపించారు. తాము పోయించుకున్న పెట్రోల్‌ను బైక్‌ల నుంచి తీసి బాటిళ్లలో పట్టి నీటిలా పేరుకుకోవడం చూపించారు. మొదటగా సిద్దాపూర్‌కు చెందిన బాలునాయక్ అనే కానిస్టేబుల్ ఉప్పునుంతలలోని బాలాజీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొన్నాడు. కిలోమీటర్ దూరం వెళ్లగానే బైక్ ఆగిపోయింది. దీంతో అనుమానంతో అతను బైక్ మెకానిక్‌ను పిలిపించి చూపగా పెట్రోల్‌ను బాటిల్లోకి తీసి చూశారు. అందులో 30 నీరులా కిందకు పేరుకుకోవడంతో బంకు దగ్గరకు వచ్చి నిలదీశాడు. ఆ తర్వాత వరుసగా అంతకుముందు బంకులో పెట్రోల్ పోయించుకొని వెళ్తే తమ బైక్‌లు ఆగిపోయావని మరికొంతమంది వాహనదారులు అక్కడకు వచ్చి ఆందోళన వ్యక్తంచేశారు. బాధితులు ఫిర్యాదుచేయడంతో తహశీల్దార్ సైదులు పెట్రోల్‌ను పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తహశీల్దార్ ఎదుటే పెట్రోల్ పరీక్ష చేయించారు. తాము ఇక్కడ ఎలాంటి కల్తీకి పాల్పడలేదని ఇండిన్ ఆయిల్ కంపెనీ నుంచి వచ్చిన పెట్రోల్‌ను యధావిధిగా అమ్ముతున్నామని నిర్వాహకుడు తెలిపారు. కొంతమందికి పెట్రోల్ డబ్బులు వాపస్చేశారు. కల్తీగా తేలితే కఠిన చర్యలు.. పెట్రోల్,డీజిల్‌లో కల్తీగా నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ సైదులు తెలిపారు. పెట్రోల్, డీజిల్ షాంపిళ్లను బాటిళ్లలో తీయించారు. ప్రస్తుతం కల్తీగా భావిస్తున్న స్టాక్ విక్రయాన్ని నిలిపేయాలని బంకు నిర్వాహకునికి సూచించారు. షాంపిళ్లను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపనున్నామని తహశీల్దార్ తెలిపారు. -
మాటల యుద్ధం
నిన్నమొన్నటి వరకు వారిద్దరూ ఒకే పార్టీలో ఉండి కలిసి పని చేసిన వారు. మనస్పర్ధలున్నా ఏకతాటిపై నడిచారు. ఇద్దరు ఓ ఉన్నత హాదాల్లో ఉన్నవారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య సఖ్యత చెడింది. మాటల యుద్ధం మొదలయ్యింది. రోజు రోజుకూ అంతరాలు పెరుగుతున్నాయి. ఒక వైపు మాటల తూటాలు, మరో వైపు నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. వారిద్దరిలో ఒకరు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాగా, మరొకరు నల్లగొండ జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్. దేవరకొండ మూడు సార్లు ఎంపీగా పని చేసిన అనుభవం, దేవరకొండ నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఎమ్మెల్యేగా పని చేసి అన్నీ తానై నియోజకవర్గంలో అన్ని జెడ్పీటీసీ స్థానాలను, ఎంపీపీ స్థానాలను ఒంటి చేత్తో గెలిపించుకున్న నాయకుడు బాలునాయక్. నిన్నమొన్నటి వరకు వీరిద్దరూ కలిసే పని చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో వీరిద్దరికి మంచి పేరుంది. అయితే మారిన సమీకరణలు, పొత్తులు, ఎత్తుల కారణాలతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య సఖ్యతలేదు. మాటల యుద్ధం పెరుగుతోంది. దేవరకొండ ఎమ్మెల్యేగా పని చేసిన బాలునాయక్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరారు. దీంతో ఆయన వెంట నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు కదిలారు. ఇంత వరకు బాగానే ఉన్నా వీరిద్దరూ ప్రస్తుతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ పార్టీలో ఒకరి కుట్ర వల్ల తాను బలైనట్లు తనపై గతంలో కుట్ర జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడానికి ఓ వ్యక్తే కారణమంటూ పరోక్షంగా గుత్తాను విమర్శించారు. ఓ వైపు జానారెడ్డిని కొనియాడుతూనే గుత్తా సుఖేందర్‌రెడ్డిని విమర్శించారు. తనను నమ్ముకున్న జనం కోసం, నియోజకవర్గ అభివద్ధి కోసం పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా ప్రత్యారోపణలు ప్రారంభించారు. తాను మోసం అన్న మాట ఎరుగనని, కుట్రలు తనకు తెలియవని చెబుతూనే పొత్తులో భాగంగా దేవరకొండ సీటు గల్లంతయినా సమష్టిగా పనిచేసి బాలునాయక్‌ను జెడ్పీ చైర్మన్‌ను చేశామన్నారు. అవసరాల కోసం వెళ్లి అనవసర ఆరోపణలు చేయవద్దని విమర్శించారు. అయితే ఈ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైనా వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మాత్రం గత కొంత కాలం నుంచే నడుస్తోంది. తన సీటు గల్లంతు కావడానికి గుత్తా సుఖేందర్‌రెడ్డే కారణమన్న బలమైన నమ్మకంతో బాలునాయక్ ఉండగా, క్యాడర్‌ను మొత్తం ఆయన టీఆర్ఎస్లోకి చేర్చే ప్రయత్నం చేస్తుండగా వీరిద్దరి మధ్య అంతరం పెరిగింది. నియోజకవర్గంలో పట్టు కోసం ఇరువురు ప్రయత్నిస్తుండగా గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ క్యాడర్‌కు దేవరకొండ నియోజకవర్గానికి ఎంపీనైనా, ఎమ్మెల్యేనైనా తానేనని అన్నింటా ముందుంటానని భరోసా కల్పిం చడం, దేవరకొండకు తరచు ఆయన వస్తుండటంతో ఆయన కూడా నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. పార్టీపరంగా నియోజకవర్గంలో గుత్తాకంటూ కొంత విశ్వసనీయత ఉండటంతో ఆయన నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఏదేమయినా వీరిద్దరి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఎవరికి లాభిస్తుందో, ఎవరికి నష్టం చేకూరుస్తుందో వేచి చూడాలి. -
నాటి దేవరకొండ జెడ్పీటీసీలే.. నేటి ఎంపీ.. ఎమ్మెల్యే
దేవరకొండ జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి నేడు నల్లగొండ ఎంపీగా కొనసాగుతుండగా, బాలూనాయక్ దేవరకొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుత్తా 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో దేవరకొండ నుంచి విజయం సాధించారు. బాలూనాయక్ ఇదే స్థానం నుంచి 2001లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. కీలక పదవుల్లో ఉండి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలూనాయక్‌లకు రాజకీయ భవిష్యత్నిచ్చింది దేవరకొండ అనే విషయం అక్షర సత్యం. రాజకీయ అరంగేట్రంతోనే ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైనప్పటికీ ఆ తర్వాత అక్కడి ప్రజలు వారిని అక్కున చేర్చుకున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో భుజాలకెత్తుకున్నారు. నాటి నుంచి వెనుదిరిగి చూడకుండా ఆ ఇద్దరి నేతలు తమ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నార కంచుకోటలో పాగా వేసిన బాలూనాయక్ దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన నేనావత్ బాలూనాయక్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఓటమితో కుంగిపోకుండా 2001లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు. 2006 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం 2009 వరకు దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి అప్పటి వరకు సీపీఐకి కంచుకోటగా ఉన్న దేవరకొండలో పాగా వేశారు. ఐదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. తద్వారా తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీకి ‘గుత్తా’ జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకప్పుడు స్వగ్రామంలో వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలైనవ్యక్తే. ఓటమి విజయానికి నాం దిగా భావించి ఆ తర్వాత 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో దేవరకొండ స్థానం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. అనంతరం ఏపీ మదర్ డెయిరీ చైర్మనగా ఎంపికయ్యారు. 1999 సార్వత్రిక ఎన్నిక ల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2009 ఎన్నికల్లో మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన విషయంలో పార్లమెంటులో తన వాణిని గట్టిగా వినిపించి తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించారు. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన దేవరకొండ అంటే ఎంతో మక్కువని తరుచూ వ్యాఖ్యానిస్తుండటం ఈ ప్రాంతంపై, ఇక్కడి ప్రజలపై ఆయనకున్న అభిమానాన్ని తెలియజేస్తోంది. -
తీరని కష్టం
సాక్షి, మచిలీపట్నం : ఎడతెరిపిలేని వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. చేతికందే దశలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు కృష్ణమ్మకు వరద ముప్పు ముంచుకొచ్చింది. భారీ వర్షాలకు జిల్లా కోలుకోలేని దెబ్బతినడంతో నష్టాలను అంచనా వేసే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించిన జిల్లా అధికారులు శనివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సహాయక చర్యలను వివరించారు. కృష్ణానదిలో వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు 8 అడుగుల మేర ఎత్తి 3.15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇందకీలాద్రికి వాహనాల రాకపోకలు నాలుగోరోజూ నిలిపివేశారు. రికార్డు స్థాయిలో వర్షం... నందిగామ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. గత పదేళ్లలోని ఎప్పుడూలేని విధంగా ఏకంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం కూడా భారీ వర్షం పడింది. నల్లవాగు, పూచివాడు, రాళ్లవాగు, మురుగువాగులు పొంగుతున్నాయి. గండివాగు పొంగడంతో రహదారిపైకి వరదనీరు చేరి శుక్రవారం రాత్రి నందిగామ-మధిర మధ్య రాకపోకలు స్తంభించాయి. శనివారం కూడా వర్షాలు కురవడంతో రైతులు పత్తి, మొక్కజొన్న పంటలపై ఆశలు వదులుకున్నారు. నందిగామ, చందర్లపాడు మండలాల్లో పలు డొంక రోడ్లు పూర్తిగా తెగిపోయాయి. అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం ప్రాంతాల్లోనూ వరి చేలు ముంపు బారిన పడ్డాయి. గుడివాడ, కైకలూరు ప్రాంతాల్లో వరద నీరు గ్రామాలు, ఇళ్లలోకి చేరింది. కైకలూరు-ఏలూరు ప్రధాన రహదారి నుంచి పెనుమాకలంక-మణుగూరుకు వచ్చే రహదారికి పెద ఎడ్లగాడి వద్ద కొల్లేరుకు గండి పడింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నూజివీడు ప్రాంతంలో నాట్ల దశలోనే మొక్కజొన్నకు ఎదురుదెబ్బ తగిలింది. తిరువూరు, మైలవరం ప్రాంతంలో పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. చేనేత మగ్గాలు పెట్టిన గుంతల్లోకి నీరు చేరి చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో పెడన నియోజకవర్గంలోని 8 గ్రామాల్లో 5,924 కుటుంబాల చేనేత కార్మికులు పనిలేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ ఇన్చార్జి జాయింట్ డెరైక్టర్ బాలూనాయక్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడీఏ, ఏవోలు ఆయా మండలాల వారీగా నష్టాల అంచనాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. 1.16 లక్షల ఎకరాలు మునక... జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ పి.ఉషాకుమారి, డీఆర్వో ఎల్.విజయ్‌చందర్ తదితర ముఖ్య అధికారులు జిల్లాలో వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో 1,16,078 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులు నిర్ధారించారు. వాటిలో పత్తి 50,980, వరి 51,622, వేరుశనగ 21,125, మొక్కజొన్న 1,670, మినుము 200, కూరగాయలు 3,747, పసుపు 1500, మిర్చి 2,950, అరటి 650, తమలపాకు 280, బొప్పాయి 90 ఎకరాల్లో నీట మునిగినట్టు అంచనా వేశారు. 120 గ్రామాలపై ప్రభావం... పది మండలాల్లో 120 గ్రామాలపై భారీ వర్ష ప్రభావం పడటంతో రెండు లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. మూడు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 71 ఇళ్లు పూర్తిగా, 149 పాక్షికంగా, గుడిసెలు 32, పశువుల పాకలు 2 దెబ్బతిన్నాయి. 1,078 నివాస గృహాల్లోకి నీరు చేరింది. 69 పశువులు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ రూ.2.39 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఏడు పునరావాస శిబిరాల్లో 811 మందిని తరలించారు. 650 మందికి ఆహార, నీటి ప్యాకెట్లు అందించి రెండు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న రోడ్లు... జిల్లాలో 499 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతినగా రూ.129 కోట్లు నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్ రోడ్లు 750 కిలోమీటర్ల మేర వంద రోడ్లు దెబ్బతిన్నాయి. నష్టం అంచనా వేయాల్సి ఉంది. పురపాలక సంఘాల్లో 800 కిలోమీటర్లు మేర పైపులైన్లు, డ్రెయిన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. 1,020 వీధిలైట్లు దెబ్బతిన్నాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఆరు పనులు దెబ్బతినగా రూ.3.50 లక్షలు నష్టం వాటిల్లింది. 25 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వానికి జిల్లా అధికారులు పంపిన నివేదికలో ప్రస్తావించారు. రేపు సీఎం రాక విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ :రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాలలో ఆయన పర్యటించేందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చి ఏరియల్ సర్వే చేస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు విమానాశ్రయంలో వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు.