‘క్వీన్’ కెర్బర్
♦ సెరెనాకు షాక్ ఇచ్చిన జర్మనీ స్టార్
♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం
♦ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ వశం
♦ రూ. 16 కోట్ల 35 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
మనకే దక్కాల్సిందని రాసిపెట్టి ఉంటే... కాస్త ఆలస్యంగానైనా, అవాంతరాలు ఎదురైనా... అంతిమంగా, కచ్చితంగా అది మనకే దక్కుతుంది. ఈ విషయం జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ విషయంలో నిజమైంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ కెర్బర్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది.
గత సంవత్సరం ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టి... ఈ ఏడాది తొలి రౌండ్లోనే మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకొని ముందంజ వేసిన కెర్బర్...
ఆ తర్వాత ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ... ఆఖరికి తుది పోరులో ఎవరెస్ట్లాంటి సెరెనా విలియమ్స్‌ను మట్టికరిపించి ‘ఔరా’ అనిపించుకుంది.
మెల్బోర్న్: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ పెను సంచలనం నమోదు చేసింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ కెర్బర్ 6-4, 3-6, 6-4తో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరిన 34 ఏళ్ల అమెరికా స్టార్ సెరెనా అంతిమ సమరంలో మాత్రం చేతులెత్తేసింది.
ఈ ఫైనల్‌కు ముందు... ఇప్పటికే 25సార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరి 21సార్లు టైటిల్ నెగ్గిన సెరెనా అనుభవం ముందు... కెరీర్లోనే తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఆడుతున్న 28 ఏళ్ల కెర్బర్ ఎదురునిలుస్తుందా అనే సందేహం కలిగింది. ఇద్దరి బలాబలాలను పరిశీలిస్తే అందరూ సెరెనాయే గెలుస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎడంచేతి వాటం క్రీడాకారిణి అయిన కెర్బర్ అద్భుత ఆటతీరును కనబరిచింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన పోరులో సెరెనాపై పైచేయి సాధించిన కెర్బర్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.
గతంలో సెరెనా చేతిలో ఐదుసార్లు ఓడిపోయి, ఒక్కసారి మాత్రమే నెగ్గిన కెర్బర్ ఈసారి ఫైనల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. తొలి సెట్లో కెర్బర్ రెండుసార్లు సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన కెర్బర్ కేవలం 3 అనవసర తప్పిదాలు చేసి 39 నిమిషాల్లో తొలి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్లో సెరెనా తేరుకుంది. అవకాశం వచ్చిన ఒకేసారి కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్ 33 నిమిషాల్లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో కెర్బర్ మళ్లీ విజృంభించింది.
రెండుసార్లు సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి 5-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ అపార అనుభవమున్న సెరెనా వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి ఈ ఆధిక్యాన్ని 5-4కు తగ్గించింది. అయితే పదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కెర్బర్ బ్రేక్ చేసి 6-4తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో మిసాకి దోయ్ (జపాన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో కెర్బర్ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో 6-7 (4/7)తో కోల్పోయి... రెండో సెట్ టైబ్రేక్‌లో 5-6తో ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే కెర్బర్ పట్టువిడవకుండా పోరాడి నెగ్గింది. ఈసారి కెర్బర్ ఖాతాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చేరాలని రాసిపెట్టి ఉందేమో... అందుకే తొలి రౌండ్లోనే ఓడి రిక్తహస్తాలతో ఇంటిదారి పట్టాల్సిన కెర్బర్ ఆఖరికి విన్నర్స్ ట్రోఫీతో విమానం ఎక్కుతోంది.
♦ ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లోనే మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకొని ఆ తర్వాత అదే టోర్నీలో విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా కెర్బర్ రికార్డు నెలకొల్పింది.
♦ ఈ గెలుపుతో కెర్బర్ 1994లో స్టెఫీ గ్రాఫ్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను... 1999లో స్టెఫీ గ్రాఫ్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నెగ్గిన జర్మనీ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
♦ స్టెఫీ గ్రాఫ్ తర్వాత ఓపెన్ శకంలో (1968 తర్వాత) ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో జర్మనీ క్రీడాకారిణిగా కెర్బర్ నిలిచింది.
ఓపెన్ స్లామ్ సింగిల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను ఓడించిన నాలుగో క్రీడాకారిణిగా కెర్బర్ ఘనత వహించింది. గతంలో సెరెనాపై ఆమె అక్క వీనస్ విలియమ్స్ (2001 యూఎస్ ఓపెన్, 2008 వింబుల్డన్) రెండుసార్లు... మరియా షరపోవా (2004 వింబుల్డన్), సమంతా స్టోసుర్ (2011 యూఎస్ ఓపెన్) ఒక్కోసారి గెలిచారు.
విజేతగా నిలిచిన కెర్బర్‌కు 34 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 16 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 2000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సెరెనాకు 17 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 8 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
అందరికంటే ముందుగా సెరెనాకు నా అభినందనలు. నీ విజయాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచావు. నా విషయానికొస్తే తొలి రౌండ్లోనే ఓటమి అంచుల్లో నిలిచాను. అయితే నాకు రెండో అవకాశం దక్కింది. దానిని సద్వినియోగం చేసుకొని ఫైనల్‌కు చేరాను. సెరెనాపై నెగ్గి చాంపియన్‌గా నిలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మొత్తానికి ఈ రాత్రి నా కల నిజమైంది. చాలా ఏళ్లుగా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. ఇకనుంచి నేనూ ఓ గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అని చెప్పుకుంటాను’’ -ఎంజెలిక్ కెర్బర్