
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేట గ్రామంలో ప్రతీకార హత్య కేసులో 18 మందికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం నల్లగొండ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులను పోలీసులు జైలుకు తరలించగా.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేట గ్రామానికి చెందిన పండుగ రాజమల్లు మృతికి కారకుడైన అదే గ్రామానికి చెందిన భట్ట లింగయ్య జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు.

2017లో రాజమల్లు కుటుంబ సభ్యులు 18 మంది భట్ట లింగయ్యపై దాడి చేసి హత్య చేశారు.

లింగయ్య కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు పండుగ రామస్వామి, పండుగ సాయిలు, పండుగ రాములు, పండుగ మల్లేష్, బండగొర్ల వలరాజ్, పండుగ యాదయ్య, జక్కుల రమేష్, పండుగ శ్రీకాంత్, పండుగ సతీష్, పండుగ నర్సయ్య, బండగొర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పండుగ మల్లయ్య, పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, జక్కుల భిక్షమయ్య, పోలేబోయిన లింగయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సాక్ష్యాధారాలను పరిశీలించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడో అదనపు జడ్జి రోజారమణి 18మందికి జీవిత ఖైదుతో పాటు రూ.6 వేల చొప్పు న జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.













