ఖైదీల్లో చిగురించిన ఆశలు | life prisoners release january 26 | Sakshi
Sakshi News home page

ఖైదీల్లో చిగురించిన ఆశలు

Jan 25 2018 11:00 AM | Updated on Jan 25 2018 11:00 AM

ఆరిలోవ(విశాఖ తూర్పు): అర్థరాత్రి క్షమాభిక్ష గంట మోగింది. ఖైదీల్లో ఆశలు చిగురింపజేసింది. ఎన్నో ఏళ్లుగా నాలుగు గోడల నడుమ మగ్గుతున్న ఖైదీలు కొందరు బయటపడే మార్గం సుగమమైంది. దీంతో వారిలో ఆనందం వెల్లువిరుస్తోంది. కారాగారాల్లో సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను క్షమాభిక్షపై విడదుల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ సమావేశంలో మంగళవారం తీసుకొంది. అందులో భాగంగా అదేరోజు రాత్రి జీవో నంబరు 8ని విడుదల చేసింది. దీనిలో ఉన్న నిబంధనల ప్రకారం జైళ్లలో క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను సిద్ధంచేసి జైల్‌ అధికారులు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది.

14 మంది అర్హులతో జాబితా
జీవో నంబరు 8లోని నిబంధనల ప్రకారం విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలలో అర్హుల జాబితాను అధికారులు బుధవారం సిద్ధం చేశారు. ప్రభుత్వం విడదుల చేసిన జోవో ప్రకారం ఈ నెల 26 నాటికి అర్హులైన సత్‌ప్రవర్తన కలిగిన 14 మంది జాబితా సిద్ధం చేసినట్లు జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు. వీరిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు ఎక్కువమందికాగా అనంతపురం, కర్నూలుకు చెందిన ఇద్దరు ఖైదీలున్నట్లు చెప్పారు. వారిలో విశాఖకు చెందిన ఓ మహిళ విడుదలకు అర్హులైనట్లు వివరించారు. ఈ జాబితా ఇక్కడ రెండుసార్లు స్క్రీనింగ్‌ జరుగుతుందన్నారు. అనంతరం డీఐజీ కార్యాలయానికి పంపిస్తామని, అక్కడ స్క్రీనింగ్‌ జరిగిన అనంతరం జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు పంపిస్తారన్నారు. వారు మరో రెండుసార్లు ఈ జాబితాను స్క్రీనింగ్‌ చేసిన అనంతరం అర్హులను ప్రకటిస్తారని తెలిపారు. అంతవరకు ఈ జాబితా గోప్యంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ఖైదీలు ఉగాదికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ జాబితాను ఫిబ్రవరి 2న జైళ్లశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

ఇవీ నిబంధనలు
పురుషులు రిమాండ్‌తో పాటు ఏడేళ్లు వాస్తవ జైలు శిక్ష, మరో మూడేళ్లు రెమిషన్‌ పీరియడ్‌తో కలసి 10 సంవత్సరాలు శిక్ష అనుభవించి ఉండాలి.
మహిళలు రిమాండ్‌తో పాటు ఐదేళ్లు శిక్ష అనుభవించి రెండేళ్లపాటు రెమిషన్‌ పీరియడ్‌తో కలిసి మొత్తం ఏడేళ్లు శిక్ష అనుభవించి ఉండాలి.
65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వెసులుబాటు ఉంది. వారిలో పురుషులకు, మహిళలకు ఒకే విధంగా ఐదేళ్లు శిక్ష, మరో రెండేళ్లు రెమిషన్‌తో కలిపి ఏడేళ్లు శిక్ష అనుభవించి ఉండాలి.
గంజాయి అక్రమ రవాణా కేసుల్లో శిక్ష పడినవారు అనర్హులు. (పదేళ్ల తర్వాత వీరు విడుదలవుతారు.)
ఐపీసీ 379 నుంచి 402 సెక్షన్లపై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, కింది కోర్టులో శిక్షపడి పై కోర్టుకు వెళ్లడం ద్వారా శిక్ష తగ్గిన వారు, ఉరి శిక్ష పడి రాష్ట్రపతిచే శిక్ష మార్చబడినవారు అనర్హులు.

రెండేళ్ల తర్వాత మళ్లీ
రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్నుడు క్షమాభిక్ష జీవో విడుదలైంది. 2015 మార్చి 15న క్షమాభిక్ష జీవో విడుదలైంది. దీని ప్రకారం 2016 జూన్‌లో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 41 మంది జీవిత ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి కాలుపెట్టారు. 2013 డిసెంబరు 21న క్షమాభిక్షపై ఇక్కడి నుంచి 37 మంది ఖైదీలను విడుదల చేశారు. వారిలో ఇద్దరు మహిళా ఖైదీలున్నారు. దీంతోపాటు 2009 జనవరి 26న 25 మంది ఖైదీలు విడుదలయ్యారు.

రెమిషన్‌ అంటే...
సత్‌ ప్రవర్తన కలిగిన ఖైదీలకు కొన్ని రోజులు శిక్ష పొందినట్లు కలుస్తాయి. ఇలాంటి ఖైదీలకు నెలకు 5 రోజులు చొప్పున కలుస్తాయి(ఏడాదిలో 60 రోజులు). దీంతోపాటు జైలు ఉన్నతాధికారి దృష్టిలో ఉత్తముడుగా గుర్తింపు పొందిన ఖైదీలకు ఏడాదిలో 30 రోజులు కలుపుతారు. ఇవి కాకుండా రాష్ట్ర జైళ్లశాఖ ఉన్నతాధికారులు సైతం ఏడాదిలో 30 రోజులు కలుపుతారు. ఇలా పొందిన రోజులనే రెమిషన్‌ పీరియడ్‌గా లెక్కిస్తారు. ఈ కాలాన్ని ఖైదీ శిక్ష అనుభవించిన కాలానికి జతచేస్తారు. ఇలా రెమిషన్‌ పీరియడ్‌ పురుషులకు మూడేళ్లు, మహిళలకు రెండేళ్లు ఉంటే క్షమాభిక్షకు ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement