ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది.
ఉక్కునగరం, న్యూస్‌లైన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఉత్పత్తి 40 శాతానికి పడిపోయింది. విశాఖ స్టీల్ ప్రతిరోజూ సుమారు 12-13 వేల టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తోంది. యాజమాన్యం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించి సాధ్యమైనంత మేర ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తోంది.
వర్షం కారణంగా ప్లాంటుకు అవసరమైన బొగ్గు గంగవరం, వైజాగ్ పోర్టు నుంచి సరఫరా కాకపోవడం, అందుబాటులో ఉన్న నిల్వలు తడవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విశాఖ స్టీల్ క్యాప్టివ్ పవర్ ప్లాంటుకు బొగ్గును, స్టీల్ తయారీకి కోకింగ్ కోల్‌ను వినియోగిస్తోంది. ఒడిశాలోని తాల్చేరు నుంచి బొగ్గు, ఆస్ట్రేలియా నుంచి కోకింగ్ కోల్ దిగుమతి చేసుకుంటోంది. వర్షాల వల్ల ప్లాంటులోని అన్ని విభాగాల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గితే తప్ప పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వర్ష ప్రభావం విశాఖ స్టీల్‌ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా తీవ్ర నష్టాన్ని కలిగించింది.