ట్రిపుల్ తలాఖ్: సుప్రీం తీర్పుపై హర్షాతిరేకాలు
వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ విధానం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు..
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ విధానం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముస్లిం మహిళలు, మహిళా సంఘాలు స్వాగతించాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందని, అమానుషమైన ట్రిపుల్ తలాఖ్ విధానం నుంచి విముక్తి లభించిందని పలువురు అభిప్రాయపడ్డారు.
ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా సమర్థించి స్వాగతిస్తున్నానని ఈ కేసు పిటిషనర్ షాయరా బాను తెలిపారు. ముస్లిం మహిళలకు ఇది నిజంగా చరిత్రాత్మక రోజు అని ఆమె అభివర్ణించారు. ట్రిపుల్ తలాఖ్ బాధితురాలైన షాయరా బాను ఈ విధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడిన సంగతి తెలిసిందే. ముస్లిం సమాజంలో మహిళల దుస్థితిని అర్థం చేసుకొని ఈ తీర్పును స్వాగతించాలని, సాధ్యమైనంత త్వరగా ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షాయిస్తా అంబర్ సైతం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ముస్లిం మహిళలకు మిఠాయిలు తినిపిస్తూ ఆమె సంబరాలు నిర్వహించారు. దేశంలోని పలుచోట్ల ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలు ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.


