
ఎస్‌బీఐ గృహ రుణాలు చౌక!
బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీరేటును 0.4 శాతం (40 బేసిస్ పాయింట్లు) వరకూ తగ్గించింది.
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీరేటును 0.4 శాతం (40 బేసిస్ పాయింట్లు) వరకూ తగ్గించింది. తాజా నిర్ణయం ప్రకారం మహిళలకు 0.05 శాతం అదనపు వడ్డీ ప్రయోజనం ఉంటుంది. 100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం. కొత్తగా రుణాలు తీసుకునే వారికి ఈ నిర్ణయం వర్తిస్తుంది. శుక్రవారం నుంచీ కొత్త రుణ రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. కీలక పాలసీ రేట్లను యథాపూర్వం కొనసాగిస్తూ, రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
రెండు స్లాబ్స్...
ఎస్‌బీఐ ప్రకటన ప్రకారం ఇకపై గృహ రుణాలు రెండు స్లాబ్‌ల కింద అందుబాటులో ఉంటాయి. ఇందులో రూ.75 లక్షల లోపు ఒకటి. రూ. 75 లక్షల పైన మరొకటి. రూ.75 లక్షల వరకూ రుణ రేటు కొత్త రుణగ్రహీతలకు 10.15 శాతంగా ఉండనుంది. ఇప్పటివరకూ రూ.30 లక్షల రుణం దాటితే చాలు... వడ్డీరేటు 10.50 శాతంగా ఉండేది. అంటే ఇక్కడ వడ్డీ తగ్గింపు 35 బేసిస్ పాయింట్లు. మహిళల విషయంలో ఈ రేటు మరో 5 బేసిస్ పాయింట్లు తక్కువగా 10.10% ఉంటుంది. ఈ ఐదు బేసిస్ పాయింట్లను కలుపుకుంటే వడ్డీరేటు 0.40% వరకూ తగ్గినట్లు లెక్క. రూ.75 లక్షలకు మించిన రుణాలపై కొత్త రేటు 10.30%. మహిళల విషయంలో ఇది 10.25%.
ఈఎంఐల తీరు...: 30 సంవత్సరాల రుణ కాలానికి సంబంధించి రూ. లక్షకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) మహిళల విషయంలో రూ.885గా ఉంటుంది. ఇతరుల విషయంలో ఇది రూ.889. ఇప్పటివరకూ ఈ మొత్తం రూ.915గా ఉంది.
కారణాలు ఇవీ..!
రుణ రేట్లు అధిక స్థాయిలో ఉండడం, దీనితో రుణాలకు డిమాండ్ తక్కువగా ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. రుణ వృద్ధి రేటు పెంపు లక్ష్యంగా ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర మందగమనంలో ఉన్న రియల్టీకి కూడా ఈ నిర్ణయం కొంత ఊరటనిస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
రుణ పరిమితి పెంపు...
కనీస రేటు వద్ద రుణ పరిమితిని రూ. 30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ పెంచడం తాజా నిర్ణయాల్లో ప్రధానమైంది. రిస్క్ వెయిటేజ్‌పై తన పాలసీని ఆర్‌బీఐ జూన్‌లో మార్చడం దీనికి నేపథ్యం. రూ.75 లక్షల వరకూ గృహ రుణాలకు సంబంధించి రిస్క్ వెయిటేజ్‌ని ఆర్‌బీఐ అప్పట్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇంతక్రితం బ్యాంక్ రూ.30 లక్షల వరకూ రుణంపై 10.30 శాతం రుణ రేటును అమలుచేసింది. రూ.30 లక్షలకు పైన రుణ రేటు 10.50 శాతంగా ఉంది.
హోమ్ లోన్‌బుక్ చూస్తే...
ఎస్‌బీఐ గృహ రుణాల పరిమాణం రూ.1,30,034 కోట్లు. మొత్తం బ్యాంక్ లోన్‌బుక్‌లో ఈ వాటా 13.6%. - పండుగల సీజన్ డిమాండ్‌ను ఆకర్షించడానికి అక్టోబర్‌లో కారు, వినియోగ వస్తువుల రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది.
హెచ్‌డీఎఫ్‌సీ కూడా...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరో దిగ్గజ గృహ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఈ విభాగంలో వడ్డీరేట్లను తగ్గించింది. పావు శాతం వరకూ వడ్డీరేటు తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది పరిమిత ఆఫర్ మాత్రమేనని ఒక ప్రకటనలో పేర్కొంది. జనవరి 31వ తేదీ లోపు సమర్పించిన అన్ని కొత్త దరఖాస్తులకు ఇది వర్తిస్తుందని వివరించింది. తొలి విడత రుణ పంపిణీ ఫిబ్రవరి 28కల్లా జరుగుతుందని తెలిపింది. దీనిప్రకారం రూ.75 లక్షల వరకూ రుణ రేటు ప్రస్తుత 10.50 శాతం నుంచి 10.25 శాతానికి తగ్గుతుంది.