
ఎన్నికలకు శశికళ సిద్ధం!
కేడర్ మన్ననలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా సంస్థాగత ఎన్నికల ద్వారా ఎంపికయ్యేందుకు శశికళ సిద్ధంగానే ఉన్నారని ఆమె భర్త, సంపాదకుడు నటరాజన్ వ్యాఖ్యానించారు.
చెన్నై : కేడర్ మన్ననలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా సంస్థాగత ఎన్నికల ద్వారా ఎంపికయ్యేందుకు శశికళ సిద్ధంగానే ఉన్నారని ఆమె భర్త, సంపాదకుడు నటరాజన్ వ్యాఖ్యానించారు. అమ్మ జయలలిత మరణంలో ఎలాంటి అనుమానాల్లేవు అని పేర్కొన్నారు. శశికళ ఎన్నడూ ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ సోమవారం ఓ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో దివంగత సీఎం జయలలిత ఆరోగ్యం గురించి, శశికళ , పన్నీరు సెల్వం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ మేరకు.. జయలలిత మరణించారన్న విషయాన్ని తాను నేటికీ జీర్ణించుకోలేకున్నట్టు పేర్కొన్నారు.
ఆమె మరికొంత కాలం తమిళ ప్రజలకు సేవలు అందిస్తారని భావించినట్టు తెలిపారు. తన ఆరోగ్యం గురించి జయలలిత నిర్లక్ష్యం వహించినట్టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో, కారు ఎక్కే సమయంలో ఆమెకు సాయంగా భద్రతాధికారులు చేతిని అందించే వారని, ఆ అధికారులైనా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని సూచించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రోగం వస్తే మందులు వేసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే సమస్య జఠిలం అవుతుందన్న విషయాన్ని పరిగణించాల్సిన అవసరం ఉందని సూచించారు.
జయలలిత మీద శశికళకు ఎంతో గౌరవం ఉందని, ఆరోగ్య విషయంగా ఆమెకు సూచనలు, సలహాలు ఇచ్చారో ఏమో గానీ, ఇచ్చేందుకే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే, ఎన్నడూ ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం శశికళ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. జయలలితను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా వెన్నంటి ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అమ్మ మరణంలో ఎలాంటి అనుమానాలు లేవు అని, రాజకీయ లబ్ధి కోసం పన్నీరు సెల్వం లాంటి వాళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. అనుమానం అన్నది ఉండి ఉంటే, సీబీఐ విచారణకు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆదేశించి ఉండాల్సిందని పేర్కొన్నారు.
అపోలో, ఎయిమ్స్ , లండన్ వైద్యులు అమ్మ ఆరోగ్యం మెరుగుకు అందించిన చికిత్సల గురించి ఇప్పటికే వివరించి ఉన్నారని, అలాంటప్పుడు అనుమానాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అన్నాడీఎంకేని రక్షించుకోవాల్సిన బాధ్యత శశికళ మీద ఉందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ›ప్రధాన కార్యదర్శి నియమాకాన్ని ఎన్నికల కమిషన్ రద్దుచేసిన పక్షంలో ఎన్నికల ద్వారా మళ్లీ ఎన్నికయ్యేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారన్నారు.
రెండాకుల చిహ్నం అమ్మశిబిరానికి తప్పకుండా దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం పళని స్వామి, శశికళ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ చివరగా ఆయన ముగించడం గమనార్హం. ఇక, అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ దాఖలు చేసుకున్న తీర్పు పునస్సమీక్షా పిటిషన్ ఆరో తేదీ విచారణకు రానున్నడంతో ఆమె భర్తతో పాటు, ఆ శిబిరం వర్గాలు ఎదురుచూపుల్లో ఉన్నాయి.