ఆగని అత్యాచారాలు : సిఐ, ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బదౌన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిపి చెట్టుకు ఉరివేసిన ఘటన ఘటనను మరువక ముందే మరో సామూహిక అత్యాచార సంఘటన వెలుగుచూసింది. ముజఫర్‌నగర్ జిల్లా దుల్హేరా గ్రామంలో ఓ మహిళపై ఐదుగురు మగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు షాపూర్ నుంచి దుల్హేరా గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఐదుగురు దుండగులు ఆమెను దగ్గరలోని శ్మశానానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో గ్రామస్తులు దుల్హేరా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. గ్రామస్తుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐతో పాటు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బుదానా సర్కిల్ ఆఫీసర్ శైలేంద్ర లాల్‌తో పాటు ఆరుగురిని సస్పెండ్ చేసినట్టు సీనియర్ ఎస్‌పీ హెచ్‌ఎన్ సింగ్ శనివారం తెలిపారు. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.


