పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని, ఇలా అ నేక కోరికలు నెరవేర్చమని దేవుడికి మొక్కుకోవడం, ఆ తరువాత మొక్కులు చెల్లించుకోవడం చాలా కామన్. దయచేసి భార్య నుంచి కాపాడు తల్లీ అని మొక్కుకున్న 25 ఏళ్ల యువకుడి మొర ఆలకించిందట అమ్మవారు. అందుకే వినూత్న రీతిలో ఆ దేవికి కృతజ్ఞతలు తెలిపాడు. అసలు కథ ఏంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
విడాకులను వేడుకగా జరుపుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ఉత్తర ప్రదేశలోని బస్తీ జిల్లా, సోన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. భార్యతో ఇబ్బందుల పడిన భర్త, ఆమెనుంచి తన విముక్తి కల్పనించమని దేవుడికి మొక్కుకున్నాడు. ఆ మొక్కు నెరవేరడంతో, వైవాహిక బంధానికి ముగింపు పలికిన సందర్భంగా స్థానిక ఆలయానికి 9 కిలోమీటర్ల 'దండావత్ యాత్ర'ను చేపట్టిన వైనం, చుట్టు పక్కల గ్రామాల్లో చర్చకు దారి తీసింది.
ఇదీ చదవండి: ట్రంప్‌కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం
నార్ఖోరియా గ్రామంలోని మైనిహవాన్ టోలా నివాసి జోగేష్. 2022లో సమీప గ్రామానికి చెందిన పూజను వివాహం చేసుకున్నాడు. ఇతని తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు గ్రామంలోనే నివసిస్తున్నారు. జోగేష్ తండ్రి జగదీష్ ఒక రైతు. అతనేమో ఢిల్లీలోని పిఓపి (POP) ఫ్యాక్టరీలలో పనిచేసేవాడు. పెళ్లైన రెండేళ్లకే వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. నిరంతరం ఏదో ఒక గొడవ. ఈ ఘర్షణలు, మానసిక ఒత్తిడితో విసిగి పోయిన భర్త, కోర్టును ఆశ్రయించాడు. అదే సమయంలో భార్య బారి నుండి విముక్తి లభిస్తే, తన ఇంటి నుండి ఆలయం వరకు దండావత్ యాత్ర చేస్తానని ‘మా బైదా సమయ్ మాతా’ ఆలయంలో మొక్కుకున్నాడు. రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత, ఈ ఏడాది జనవరిలో అతనికి విడాకులు మంజూరైనాయి. దీంతో అతనితో పాటు,అతని కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది.
అయిత జోగేష్ ఉండేది ఢిల్లీలో ఉన్నందున మొక్కు తీర్చుకోవడం ఆలస్యమైంది.అయితే, పవిత్ర నవరాత్రులు సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు మార్చి 27వ తేదీన, దండావత్ యాత్ర చేయడానికి భాన్‌పూర్ ఎస్‌డిఎం హిమాంశు కుమార్‌నుంచి అనుమతి తీసుకుని మరీ మాతా ఆలయం వరకు 12 గంటల్లో 9 కిలోమీటర్ల దండవత్ యాత్రను పూర్తి చేశాడు.

చట్టపరంగా, సామాజికంగా తన భార్య నుండి విముక్తి లభించడంతో మొక్కును తీర్చుకోవాలని ఉదయాన్నే అన్నపానీయాలు ముట్టుకోకుండా, తన గ్రామం నుండి భాన్‌పూర్‌లోని అమ్మవారి ఆలయానికి పొర్లు దండాలు పెడుతూ ఆలయానికి చేరుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రయాణంలో అతని తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామానికి చెందిన అనేకమంది ప్రజలు డప్పులు వాయిస్తూ, అమ్మవారి నామాన్ని జపిస్తూ ఊరేగింపుగా వెళ్లారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా వారితో పాటు ఉన్నారు.
సాయంత్రం 6 గంటలకు, రక్తసిక్తమైన మోకాళ్లతో, అలసిపోయిన శరీరంతో గుడికి చేరుకున్న అతను, అమ్మవారి దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. వైవాహిక జీవిత నరకం నుండి బయటపడ్డాక ఇప్పుడు తనకు ప్రశాంతంగా ఉందని అతను మీడియాతో చెప్పాడు.


