పోలీసుల అదుపులో ఏటీఎం నిందితుడు ! | Police arrested ATM suspect identified | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఏటీఎం నిందితుడు !

Nov 24 2013 2:44 AM | Updated on Aug 21 2018 7:53 PM

బెంగళూరులోని కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు!

 ‘సైకో’గా తేల్చిన పోలీసులు.. ఈ నెల 10న ధర్మవరంలో మహిళను హత్యచేసి.. ఏటీఎం కార్డులను అపహరించాడు
       రెండు చోట్ల ఏటీఎం కేంద్రానికి ఒకేరకం దుస్తులతో వచ్చాడు


 సాక్షి ప్రతినిధి, అనంతపురం:  బెంగళూరులోని కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు! దాడిచేసిన వ్యక్తిని సైకో అని పోలీసులు తేల్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ నెల 10న అనంతపురం జిల్లా ధర్మవరంలో చంద్రబాబునగర్‌కు చెందిన ప్రమీలమ్మ అనే మహిళపై కూడా అతడు దాడి చేశాడు. ఆమె రెండు ఏటీఎం కార్డులను లాక్కొని పిన్ నంబర్ తెలుసుకున్న తర్వాత హత్య చేశాడు. ఆ రాత్రికే కదిరికి పారిపోయి 11న అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి ఓ కార్డు ద్వారా రూ. నాలుగు వేలు డ్రా చేశాడు. తర్వాత బెంగళూరులో 15న మరో ఏటీఎం కార్డు ద్వారా రూ.18 వేలు డ్రా చేశాడు. అయితే ప్రమీలమ్మ కుమారుడు ఆ రెండు ఏటీఎంలను బ్లాక్ చేయించారు.

 ఆ ఏటీఎం కార్డులు పని చేయకపోవడంతో డబ్బుల కోసం 19న కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఏటీఎం కేంద్రంలోనే దాడి చేసి, ఏటీఎం కార్డును తస్కరించాడు. కదరిలో ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసిన సమయంలోనూ.. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసినప్పుడూ సైకో ఒకే విధమైన దుస్తులు ధరించినట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డులను పరిశీలిస్తే స్పష్టమైంది. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు శనివారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో బెంగళూరు పోలీసులు శనివారం ధర్మవరం చేరుకుని విచారించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని గమనించిన పోలీసులు నిందితుడి వ్యహారశైలిని పరిశీలించాక అతనో సైకోగా తేల్చారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా అందులో ఈ సైకో కూడా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement