breaking news
Jyoti Uday
-
పోలీసుల అదుపులో ఏటీఎం నిందితుడు !
‘సైకో’గా తేల్చిన పోలీసులు.. ఈ నెల 10న ధర్మవరంలో మహిళను హత్యచేసి.. ఏటీఎం కార్డులను అపహరించాడు రెండు చోట్ల ఏటీఎం కేంద్రానికి ఒకేరకం దుస్తులతో వచ్చాడు సాక్షి ప్రతినిధి, అనంతపురం: బెంగళూరులోని కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు! దాడిచేసిన వ్యక్తిని సైకో అని పోలీసులు తేల్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ నెల 10న అనంతపురం జిల్లా ధర్మవరంలో చంద్రబాబునగర్‌కు చెందిన ప్రమీలమ్మ అనే మహిళపై కూడా అతడు దాడి చేశాడు. ఆమె రెండు ఏటీఎం కార్డులను లాక్కొని పిన్ నంబర్ తెలుసుకున్న తర్వాత హత్య చేశాడు. ఆ రాత్రికే కదిరికి పారిపోయి 11న అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి ఓ కార్డు ద్వారా రూ. నాలుగు వేలు డ్రా చేశాడు. తర్వాత బెంగళూరులో 15న మరో ఏటీఎం కార్డు ద్వారా రూ.18 వేలు డ్రా చేశాడు. అయితే ప్రమీలమ్మ కుమారుడు ఆ రెండు ఏటీఎంలను బ్లాక్ చేయించారు. ఆ ఏటీఎం కార్డులు పని చేయకపోవడంతో డబ్బుల కోసం 19న కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఏటీఎం కేంద్రంలోనే దాడి చేసి, ఏటీఎం కార్డును తస్కరించాడు. కదరిలో ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసిన సమయంలోనూ.. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసినప్పుడూ సైకో ఒకే విధమైన దుస్తులు ధరించినట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డులను పరిశీలిస్తే స్పష్టమైంది. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు శనివారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో బెంగళూరు పోలీసులు శనివారం ధర్మవరం చేరుకుని విచారించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని గమనించిన పోలీసులు నిందితుడి వ్యహారశైలిని పరిశీలించాక అతనో సైకోగా తేల్చారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా అందులో ఈ సైకో కూడా ఉన్నట్లు తెలిసింది. -
గార్డులు లేని ఏటీఎంలను మూసేయిస్తాం
= మూడు రోజులు గడువు = బెంగళూరులో 600 కేంద్రాల వద్ద ‘నో సెక్యూరిటీ’ = వాటి వద్ద సర్కార్ భద్రత కల్పించలేదు = ఆ బాధ్యత ఆయా బ్యాంకులదే = ఏ క్షణంలోనైనా ఆగంతుకున్ని పట్టుకుంటాం : హోం మంత్రి వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలను మూయించి వేస్తామని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ హెచ్చరించారు. మూడు రోజుల్లోగా అన్ని కేంద్రాల వద్ద గార్డులను నియమించాలని బ్యాంకులకు సూచించారు. ఇక్కడి కార్పొరేషన్ సర్కిల్లోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలో అదే బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఓ ఆగంతకుడు మంగళవారం ఉదయం వేట కత్తితో దాడి చేసిన నేపథ్యంలో బుధవారం జార్జ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో రెండు వేల ఏటీఎంలుంటే 600 కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరని తెలిపారు. అన్ని ఏటీఎంలకు భద్రత కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు కనుక ఆయా బ్యాంకులే బాధ్యత వహించాలని అన్నారు. ఏటీఎంలకు సరైన భద్రత కల్పించే విషయమై సూచనలు చేయడానికి హోం శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఏటీఎంల వద్ద భద్రత ఉందో, లేదో పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఆగంతుకున్ని పట్టుకుంటాం ఏటీఎం కేంద్రంలో జ్యోతిపై దాడి చేసిన ఆగంతకుని ఆచూకీ తెలిసిందని, ఏ క్షణంలోనైనా అతనిని పట్టుకుంటామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. ఇప్పటికే అతని కోసం గాలించడానికి తన నాయకత్వంలో ఎనిమిది బృందాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు జరుగుతోందన్నారు. సీసీ టీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా ఆగంతకుని ఆనవాళ్ల గురించి పోలీసులకు కొన్ని క్లూలు లభించాయన్నారు. అతను కన్నడంలో మాట్లాడినందున ఎప్పటి నుంచో రాష్ట్రంలో ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. కోలుకుంటున్న జ్యోతి దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతికి మంగళవారం రాత్రి మేజర్ న్యూరోసర్జికల్ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ఇక్కడి కెంగేరిలోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మెదడులోకి చొచ్చుకు పోయిన పుర్రె ఎముకను తొలగించామని పేర్కొంది. దెబ్బ తిన్న మెదడు పొరలను సరి చేసినట్లు వెల్లడించింది. విరిగిన పుర్రె ఎముకలను కూడా తిరిగి అతికించినట్లు తెలిపింది. ప్లాస్టిక్ సర్జికల్ బృందం ముక్కు, ముఖంపై ఏర్పడిన గాయాలకు చికిత్సలు చేసిందని వివరించింది. పేషెంట్ సృ్పహలో ఉందని, మాట్లాడుతోందని తెలిపింది. ప్రస్తుతం ఆమె న్యూరో ఇంటెన్సిన్ కేర్ యూనిట్లో ఉన్నారని, అనుక్షణం ఆమెను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. రక్తం ఎక్కించామని, ప్రస్తుతం మెడికల్ మేనేజ్మెంట్లో ఉందని పేర్కొంది. చీఫ్ న్యూరో సర్జన్, ఆస్పత్రి ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్కే. వెంకట రమణ ఈ ప్రకటనను విడుదల చేశారు. కాగా హోం మంత్రితో పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, నగర పోలీసు కమినర్ ఆస్పత్రిలో ఆమెను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆమెకు ఏదైనా సాయం అందించగలమేమో...పరిశీలిస్తామని జార్జ్ తెలిపారు.