పలువురు మంత్రులు తమ నివేదికలు బుధవారం రాజ్యసభలో ప్రవేశపెడుతుండగా.. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు వెల్‌లో ఆందోళన చేస్తుండటంపై ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ అభ్యంతరం వ్యక్తంచేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: పలువురు మంత్రులు తమ నివేదికలు బుధవారం రాజ్యసభలో ప్రవేశపెడుతుండగా.. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు వెల్‌లో ఆందోళన చేస్తుండటంపై ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘లోక్‌సభ సభ్యుడై మంత్రిగా ఉంటే ఈ సభలో వచ్చి ప్రభుత్వపరంగా తన పనితాను చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి ఎలా సభావ్యవహారాలకు ఆటంకం కలిగిస్తారు..’ అని డిప్యూటీ చైర్మన్‌ను అడిగారు. వెంకయ్యనాయుడు కూడా లేచి ‘పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ఏంచేస్తున్నారు? మీ మంత్రులే వెల్‌లోకి వస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. దీంతో.. లోక్‌సభ సభ్యులు మంత్రులుగా ఉండి ఇక్కడికి వచ్చి.. ఎలా అంతరాయం కలిగిస్తారని కావూరిని డిప్యూటీ చైర్మన్ ప్రశ్నించారు. ‘మీరు సభను వదిలిపెట్టండి..’ అని సూచించారు.
మంత్రులుగా ఉన్నవారు నిరసన తెలపాలనుకుంటే.. ఆ పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు రమేశ్, సుజనాచౌదరిలు డిప్యూటీ చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికి సభ మళ్లీ అదుపుతప్పటంతో 3.34 గంటల సమయంలో నాలుగు గంటల వరకు వాయిదావేశారు. తిరిగి సభ సమావేశమయ్యాక పలు బిల్లులను ఆమోదించారు. ఆ తరువాత సభ 4.26 సమయంలో సాయంత్రం 5 గంటలకు వాయిదాపడింది. మళ్లీ సమావేశమయ్యాక కావూరి మాట్లాడుతూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఏ ప్రాతిపదికన తెస్తున్నారని ప్రశ్నిస్తుండగా.. ‘ఆ బిల్లు సభకు రాలేదు.. దానిపై ఇప్పుడు మాట్లాడేందుకు ఏమీ లేదు’ అంటూ కురియన్ సభను గురువారానికి వాయిదావేశారు.