స్వాతంత్ర్య దినోత్సవం లాంటి సందర్భాన్ని.. ప్రధానమంత్రిపైన, యూపీఏ ప్రభుత్వంపైన విమర్శల కోసం నరేంద్రమోడీ దుర్వినియోగం చేశారని మంత్రి నారాయణస్వామి అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం లాంటి సందర్భాన్ని.. ప్రధానమంత్రిపైన, యూపీఏ ప్రభుత్వంపైన విమర్శల కోసం నరేంద్రమోడీ దుర్వినియోగం చేశారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణస్వామి అన్నారు. ఆరోజు బహిరంగ వేదికను మోడీ దుర్వినియోగం చేశారని, తన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, సాధించిన విజయాలను ప్రస్తావించడానికి బదులు విమర్శలకే ఆయన అధిక సమయం కేటాయించారని చెప్పారు. తద్వారా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కూడా అర్హుడు కాదని నిరూపించుకున్నట్లు విమర్శించారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజున కేంద్రాన్ని విమర్శించడం ద్వారా సంప్రదాయాలను ఉల్లంఘించారని నారాయణస్వామి అన్నారు. పుదుచ్చేరి సర్కారు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా అమలుచేయలేకపోవడం వల్లే ఆ రాష్ట్రం పేద రాష్ట్రంగా మిగిలిపోయిందని, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్ఆరు. త్వరలో శ్రీలంకలో జరగబోయే చోగమ్ సదస్సులో పాల్గొనకూడదంటూ డీఎంకే సహా తమిళనాడులోని రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు వస్తున్నందువల్ల దానిపై ప్రధానమంత్రి ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంటారన్నారు.