
'అమ్మ' ఫొటోలు గాయబ్!
దివంగత నేత జయలలిత బతికున్నప్పుడు అన్నాడీఎంకేకు చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె పట్ల అపారమైన గౌరవాభిమానాలను చూపేవారు.
చెన్నై: దివంగత నేత జయలలిత బతికున్నప్పుడు అన్నాడీఎంకేకు చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె పట్ల అపారమైన గౌరవాభిమానాలను చూపేవారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె పట్ల గౌరవాన్ని చాటుతూ అన్నాడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని తమ టేబుళ్లపై జయలలిత ఫొటోలను పెట్టుకున్నారు. ఏదైనా అంశంపై సభలో మాట్లాడాల్సినప్పుడు, బల్లపై చరచాల్సినప్పుడు చాలా జాగ్రత్తగా అమ్మ ఫొటొను పక్కకుపెట్టి ఆ పని చేసేవారు. అలాంటి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తాజాగా తమ టేబుళ్ల నుంచి జయలలిత ఫొటోను తొలగించడం గమనార్హం. ఇటీవలి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల టేబుళ్లపై జయలలిత ఫొటోలు లేవు.
అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లోనూ, డైరీల్లోనూ, ఆహ్వానాల్లోనూ జయలలిత ఫొటో ప్రముఖంగా కనిపించేది. గత బడ్జెట్ సమావేశాల్లోనూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రుల టేబుళ్ల ముందు ఆమె ఫొటోలు కనిపించాయి. కానీ, ఈ సమావేశాలకు వచ్చేసరికి తమ టేబుళ్లపై ఉన్న జయ ఫొటోను తొలగించాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.