
ప్రపంచవ్యాప్త విస్తరణ
వచ్చే ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కనీసం 20 నగరాల్లో పటిష్టమైన కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ సేవల సంస్థ మైండ్‌ట్రీ చైర్మన్ సుబ్రతో బాగ్చి వెల్లడించారు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కనీసం 20 నగరాల్లో పటిష్టమైన కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ సేవల సంస్థ మైండ్‌ట్రీ చైర్మన్ సుబ్రతో బాగ్చి వెల్లడించారు. శుక్రవారమిక్కడ టై ఎంట్రప్రెన్యూరియల్ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాన్ని వివరించారు. కంపెనీ ప్రధాన లక్ష్యాల్లో 2020 నాటికి నాయకత్వ మార్పు చేపట్టడం ఒకటని పేర్కొన్నారు. అలాగే, వివిధ దేశాల్లో విస్తరించే క్రమంలో అక్కడి వారికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు మైండ్‌ట్రీ గురించి స్థానికంగా కూడా సదభిప్రాయం సాధించాలన్నది తమ అభిమతమన్నారు. కాగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే విషయంలో వెనుకంజ వేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ అన్నారు. కాగా, బాగ్చి రచించిన తెలుగు అనువాదం ‘16 ఏండ్లకే ఎంబీఏ ఆలోచనలతో’ పుస్తకాన్ని నాసా వ్యోమగామి బెర్నార్డ్ హ్యారిస్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.