ఇన్ఫీ ఏంచేస్తుందో..!
కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల సందడి మళ్లీ ప్రారంభమవుతోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నేడు (శుక్రవారం) ప్రకటించనున్న సెప్టెంబర్ క్వార్టర్(2013-14, క్యూ2) ఫలితాల
ముంబై: కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల సందడి మళ్లీ ప్రారంభమవుతోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నేడు (శుక్రవారం) ప్రకటించనున్న సెప్టెంబర్ క్వార్టర్(2013-14, క్యూ2) ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఐటీ రంగానికి సంబంధించి సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ రంగంలోని కంపెనీలు మెరుగైన ఫలితాలనే నమోదుచేయొచ్చని పరిశ్రమ విశ్లేషకులు భారీ అంచనాల్లో ఉన్నారు. గడిచిన పలు త్రైమాసికాల్లో నిరుత్సాహ పరుస్తున్న ఇన్ఫీ.. ఈసారి మాత్రం కచ్చితంగా మెప్పిస్తుందని భావిస్తున్నారు. మొత్తంమీద ఐటీ కంపెనీలు మొత్తం క్యూ2లో మెరుగైన లాభాలను ఆర్జించవచ్చనేది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడం, అమెరికాలో రికవరీ జోరందుకుంటున్న సంకేతాలు.. ఇవన్నీ దేశీ సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు.
ఆదాయాల్లో 2-5 శాతం సీక్వెన్షియల్ వృద్ధి...
ఈ ఏడాది క్యూ2లో బడా ఐటీ కంపెనీల ఆదాయాల్లో 2-5 శాతం సీక్వెన్షియల్(క్యూ1తో పోలిస్తే) వృద్ధి ఉండొచ్చనేది విశ్లేషకుల అంచనా. దేశీ ఐటీ నంబర్‌వన్ టీసీఎస్.. బ్లాక్‌బస్టర్ ఫలితాలను ప్రకటించొచ్చనేది అత్యధికుల అభిప్రాయం. ఈ నెల 15న టీసీఎస్ ఫలితాలు వెలువడనున్నాయి. మైండ్‌ట్రీ మంచి పనితీరునే కనబరిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. గత కొద్ది నెలలుగా యాజమాన్యాల వ్యాఖ్యల్లో బులిష్ ధోరణిని గమనిస్తే... జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఐటీ రంగ ఫలితాలకు అత్యంత పటిష్టమైనదిగా నిలిచే అవకాశాలున్నాయని.. రానున్న త్రైమాసికాల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందనేది నిపుణుల విశ్లేషణ. కాగా, ఇన్ఫీ ఈ ఏడాది ఆదాయ అంచనాలను(గతంలో 6-10 శాతంగా పేర్కొంది) పెంచొచ్చని కూడా పరిశీలకులు చెబుతున్నారు.
అమెరికా రికవరీ దన్ను...
భారత్ ఐటీకి కీలక మార్కెట్లుగా నిలుస్తున్న అమెరికా, బ్రిటన్‌లలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రికవరీ స్థిరీకరణతో మన కంపెనీల సేవలు, ఉత్పత్తులకు డిమాండ్ పెరగనుంది. మొత్తంమీద ఈ ఏడాదిలో ఆయా దేశాల్లోని క్లయింట్ల ఐటీ వ్యయాలు కూడా పెరగనున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. 2013-14లో వృద్ధి అంచనాలపై ఇప్పటికీ బులిష్‌గానే ఉన్నామని, గతేడాదికంటే మెరుగైన వ్యాపారం ఉంటుందని రెండు వారాల క్రితం టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్.చంద్రశేఖరన్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. ఐటీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పుంజుకుంటున్న సంకేతాలు కనబడుతున్నాయని కూడా ఆయన చెప్పడం గమనార్హం. సెప్టెంబర్‌లో క్లయింట్‌లతో సంప్రతింపుల ప్రకారం... ఈ ఏడాది ఐటీ ఆఫ్‌షోర్ మార్కెట్ 13-14% వృద్ధి చెందొచ్చని అంచనా వేస్తున్నట్లు ‘ఆఫ్‌షోర్ ఇన్‌సైట్స్’ అనే సంస్థ పేర్కొంది. దేశీ ఐటీ కంపెనీల చాంబర్ ‘నాస్కామ్’.. ఈఏడాది ఐటీ పరిశ్రమ వృద్ధిరేటు లక్ష్యాన్ని 11-14% మధ్య నిర్ధేశించడం తెలిసిందే. తాజా సానుకూల పరిస్థితులతో.. నాస్కామ్ తన వృద్ధి అంచనాలను కాస్త పెంచొచ్చనే విశ్వాసం వ్యక్తమవుతోంది.
రూపాయి బూస్ట్...
డాలరుతో రూపాయి మారకం విలువ పతనంతో దేశీయంగా పలు కంపెనీలను దెబ్బతీస్తుండగా... ఐటీ కంపెనీలకు మాత్రం వరంగా మారుతోంది. డాలర్లలో వచ్చే ఆదాయం రూపాయిల్లోకి మార్చుకోవడంవల్ల అధిక ప్రయోజనం లభించనుండటమే దీనికి కారణం. జూలై-సెప్టెంబర్ మధ్య రూపాయి విలువ దాదాపు 11 శాతం(క్యూ1తో పోలిస్తే) పతనమైంది. ఒకానొకదశలో ఆల్‌టైమ్ కనిష్టమైన 68.80ని తాకి... ప్రస్తుతం 61-62 స్థాయిలో కదలాడుతోంది. కాగా, రూపాయి 1% క్షీణిస్తే.. ఐటీ కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్‌లు 30-35 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు అంటే 1%) ఎగబాకుతాయని అంచనా. క్యూ2లో రూపాయి పతనాన్ని లెక్కలోకి తీసుకుంటే ఐటీ కంపెనీల మార్జిన్లలో సీక్వెన్షియల్‌గా 200-350 బేసిస్ పాయింట్ల వృద్ధి నమోదుకావచ్చనేది కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ చెబుతోంది. ‘ఈ ఏడాది ఇప్పటిదాకా ఐటీ రంగం సూచీ 40 శాతం ఎగబాకి.. సెన్సెక్స్‌ను మంచి లాభాలను నమోదు చేసింది. ఇదే కాలంలో రూపాయి విలువ అన్ని ప్రధాన ప్రపంచ కరెన్సీలతో 15 శాతం మేర ఆవిరైంది’ అని గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.