రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించి, సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించి, సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పంటలు నష్టపోయి, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, కె.శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వపరంగా సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలకు దిగుతామని.. ఇతర పార్టీలతో కలసి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ ఆధ్వర్యంలో కరువు, రైతన్నల ఆత్మహత్యలు, సాగు సంక్షోభంపై సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లారని కిష్టారెడ్డి విమర్శించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.లక్షన్నర పరిహారం అందించేలా జీవో 421ను తీసుకువచ్చారని.. ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలుచేస్తున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అందిస్తూ పార్టీ సహాయచర్యలు చేపడుతుందని కిష్టారెడ్డి తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శివకుమార్ డిమాండ్ చేశారు.