
వామ్మో! ఈ యాంకర్ ఎక్స్‌ప్రెషన్ చూసి..!
డొనాల్డ్ ట్రంప్ అనగానే ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలే గుర్తుకొస్తాయి.
డొనాల్డ్ ట్రంప్ అనగానే చాలామందికి ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలే గుర్తుకొస్తాయి. విపరీతమైన వ్యాఖ్యలతో, విచ్ఛిన్నకరమైన భావజాలంతో ఈ బిలియనీర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు.
మరి, అలాంటి ట్రంప్‌లో కూడా ఓ గొప్ప ఉదారవాది ఉన్నాడంట. ఆయనకు విశాల హృదయం ఉందట. ఈ మాటలు వింటుంటే మనకు ఎలా ఉంటుందో కానీ, ఓ టీవీ యాంకర్ మాత్రం ట్రంప్‌గారి గొప్పతనం గురించి వింటూ కళ్లుతేలేసింది. ట్రంప్ గురించి చెప్తుంటే ఆమె కనుగుడ్లను గుండ్రంగా తిప్పితూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఫిలడెల్ఫియాలో డెమొక్రటిక్ జాతీయ సదస్సు సందర్భంగా సీఎన్‌ఎన్ చానెల్ ప్యానెల్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో కన్జర్వేటివ్ కామెంటెటర్ కేలీ మెక్‌ఎనానీ డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ ఎన్నో గొప్పపనులు చేశాడని, తన ప్రైవేటు టైమ్‌లో సమాజానికి సేవలు అందించాడని ఆమె చెప్పింది. ఆమె వ్యాఖ్యలు వింటూ విస్తుపోయిన సీఎన్‌ఎన్ విశ్లేషకురాలు ఏంజెలా రైయి తన ముఖ కవళికలను దాచుకోలేకపోయింది. ట్రంప్ గొప్పతనాన్ని వింటూ ఆమె భలే విచిత్రంగా కనుగుడ్లు తిప్పుతూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.
నమ్మశక్యంకాని విషయాలు, అబ్బో నిజమా అనిపించే విషయాలు విన్నప్పుడు మనషుల ముఖ కవళిక ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూడాల్సిందేనంటూ ట్విట్టర్‌లో పోస్టులు మీద పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ గారి గొప్పతనం గురించి తెలుసుకొని మున్ముందు ఇంకెంతమంది విస్తుపోతారని చాలా ఛలోక్తులు విసురుతున్నారు.