
ఎమ్మెల్యే ఇంట్లో సీబీఐ సోదాలు
బీహార్కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంట్లో సీబీఐ బృందం సోదాలు చేసింది.
బీహార్కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంట్లో సీబీఐ బృందం సోదాలు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం అనంత సింగ్ అధికారిక నివాసంలో సోదాలు చేసిందని పోలీసులు చెప్పారు. ఆయన ప్రస్తుతం ఓ కిడ్నాప్ - హత్య కేసులో జైల్లో ఉన్నారు. ఆయన ఇంట్లో సోదాలకు వచ్చేముందు సీబీఐ బృందం అనంత్ సింగ్ను జైల్లో ప్రశ్నించింది. సీబీఐ బృందం స్థానిక పోలీసులను సాయం కోరడంతో.. సీనియర్ ఎస్పీ వికాస్ వైభవ్ ఆ బృందానికి తమ సిబ్బందిని తోడుగా పంపారు.
అయితే.. కిడ్నాప్ - హత్య కేసుకు, సీబీఐ సోదాలకు సంబంధం లేదు. అక్రమంగా కాంట్రాక్టులు ఇప్పించడంలోను, దోపిడీ రాకెట్ నడిపించడంలోను ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మీద సీబీఐ విచారణ జరుపుతోంది. బీహార్లో శక్తిమంతమైన భూమిహార్ వర్గానికి చెందిన అనంత్ సింగ్.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సన్నిహితుడని చెబుతారు. ఆయనపై డజన్లకొద్దీ క్రిమినల్ కేసులున్నాయి. వాటిలో చాలా హత్య, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి.