54ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న సైనికుడు | After 54 years in India Chinese soldier returns home | Sakshi
Sakshi News home page

54ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న సైనికుడు

Feb 11 2017 11:30 PM | Updated on Aug 13 2018 3:45 PM

54ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న సైనికుడు - Sakshi

54ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న సైనికుడు

హాలీవుడ్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. పొరపాటున సరిహద్దులుదాటి పొరుగుదేశంలోకి ప్రవేశించిన ఓ సైనికుడు తిరిగి 54 ఏళ్ల తర్వాత సొంత దేశానికి చేరుకున్నాడు.

బీజింగ్‌: హాలీవుడ్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. పొరపాటున సరిహద్దులుదాటి పొరుగుదేశంలోకి ప్రవేశించిన ఓ సైనికుడు తిరిగి 54 ఏళ్ల తర్వాత సొంత దేశానికి చేరుకున్నాడు. భార్యాపిల్లలతో కలిసి శనివారం పుట్టినగడ్డకు చేరుకున్న అతడికి గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. ఆ చైనీస్‌ సైనికుడి పేరు వాంగ్‌ కీ. ఇన్నాళ్లు అతను గడిపింది ఎక్కడోకాదు.. మన ఇండియాలోనే!

అది 1963నాటి ముచ్చట.. భారత్ - చైనా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో కాపలా కాస్తోన్న వాంగ్‌ కీ.. పొరపాటున భారతభూభాగంలోకి ప్రవేశించి గల్లంతయ్యాడు. దారితోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతణ్ని రెడ్‌ క్రాస్‌ సంస్థ గుర్తించింది. అనంతరం వాంగ్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. వాంగ్‌ను చైనీస్‌ గూఢచారిగా అనుమానించిన ఇండియా అతనికి ఏడేళ్ల కారగారశిక్షను విధించింది. శిక్షపూర్తయిన తర్వాత చైనాకు వెళదామనుకున్న వాంగ్‌కు సొంతదేశం నుంచే విముఖత ఎదురైంది!

పలు కారణాల వల్ల వాంగ్‌ను తన దేశస్తుడిగా అంగీకరించడానికి చైనా ప్రభుత్వం విముఖత ప్రదర్శించింది. దీంతో అతను ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడి అమ్మాయినే పెళ్లిచేసుకున్నాడు. ఏళ్లు గడిచినా వాంగ్‌కు సొంతదేశం వెళ్లాలనే కోరిక తగ్గలేదు. చైనీస్‌ ప్రభుత్వానికి తరచూ మొరపెట్టుకుంటూనే ఉండేవాడు. షాంగ్జీ క్జియాంగ్జియాన్ కౌంటీలోని జూజియానన్ గ్రామంలోని నివసించే వాంగ్‌కీ కుటుంబ సభ్యులు సైతం అంగీకరించినా ప్రభుత్వం వినిపించుకోలేదు. అతను కూడా తన పోరాటాన్ని ఆపలేదు..

వాంగ్‌కీ విషయమై భారత-చైనా దౌత్యాధికారుల మధ్య ఏళ్లపాటు చర్చలు జరిగాయి. చివరికి 2013లో వాంగ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేందుకు చైనీస్‌ ప్రభుత్వం అంగీకరించింది. పాస్‌పోర్టు లభించిన నాలుగేళ్ల తర్వాత, శనివారం అతను చైనాలోని సొంత ఊరికి వెళ్లాడు. 54 ఏళ్ల తర్వాత తిరిగి వస్తుండటంతో వాంగ్‌ను చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిజియానన్‌ గ్రామస్తులంతా వరుసగా నిలబడి అతనికి స్వాగతం పలికారు. 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తన అన్నను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వాంగ్‌కీ సోదరుడు వాంగ్ షన్ మీడియాకు చెప్పాడు. చైనాలోని గ్జియాన్ జియాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ వాంగ్ తన సోదరులు, అక్కచెల్లెల్లకు దగ్గరకు తీసుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. 'చిట్టచివరికి నా సొంతగూటికి చేరుకున్నా..' అన్నాడు చెమ్మగిల్లినకళ్లతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement