
ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేతల సమావేశం
ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేతలు ...పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోమవారం సమావేశం అయ్యారు.
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేతలు ...పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోమవారం సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. కాగా ఢిల్లీలో ఏ పార్టీ మద్దతుతోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని జెయింట్ కిల్లర్, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైతే ...కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
ఇక ఫలితాలు వెలువడిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు స్పష్టమైన సందేశమిది. కులం, మతం, అవినీతి, నేరాలు, ధన, కండ బలాలే ఇప్పటిదాకా ఈ పార్టీలను నడిపించాయి. ఇకనైనా సంస్కరణ బాట పట్టకుంటే ప్రజలే వాటిని ఇంటికి పంపుతారు’’ అన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కాదని, ప్రజా విజయమని అన్నారు.