ఇంటికే పండ్లకి జనం జేజేలు

Walk For Water: Delivering Fruits To Customers With A Missed Call - Sakshi

తాజా పండ్ల సరఫరాకి ఊహించని జన స్పందన  

నలుమూలల డెలివరీకోసం రంగంలోకి తపాలశాఖ

సాక్షి, హైదరాబాద్‌ : వాక్‌ ఫర్ వాటర్‌, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటికే పండ్ల కార్యక్రమానికి జనాదరణ పెరుగుతోంది. ఫోనుకాల్స్‌, ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. నాణ్యత బాగుండడం, తక్కువ ధరకావడంవల్ల పండ్లు కావాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. సంబంధిత వెబ్‌సైట్‌కి ఇప్పటికి 26   లక్షల హిట్స్‌ రాగా... ఇప్పటి వరకు వచ్చిన లక్షన్నర ఆర్డర్లలో... 65 వేలు సరఫరా చేశారు.  డెలివరీ వేగవంతం చేసేందుకు తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. లాక్‌డౌన్‌ వేళ దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజల ఇళ్ల వద్దకే తాజా పండ్లు సరఫరా చేస్తున్నందున... ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డిని నగరవాసులు ప్రశంసిస్తున్నారు. ఇటు రైతులు అటు వినియోగదారులకి ఏకకాలంలో మంచి చేస్తున్నారంటూ కొనియాడుతున్నారు. ఈ  కిట్‌లో రూ.300 కు ప్రజల ఇంటి వద్దకే మామిడి(1.5 కేజీ), బొప్పాయి ‍(3 కేజీలు), నిమ్మ(12కాయలు), పుచ్చ(3 కేజీలు), బత్తాయి(2 కేజీలు), సపోట(1 కేజీ) పండ్ల డెలివరీ చేస్తున్నారు. 88753 51555 నంబర్‌కి ఒక్క మిస్‌డ్‌ కాల్ ఇస్తే ఇంటివద్దకే పండ్లు అందిస్తున్నారు. ( ‘సరిలేరు’ తర్వాత మహేశ్‌ చిత్రం ఇదే! )

ప్రజాదరణ, అధికారుల సహకారంతో... ఇంటికే పండ్ల కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోందని వాక్‌ ఫర్‌ వాటర్‌ ఛైర్మన్‌ ఎం. కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నలుమూలల పంపిణీకోసం తపాలశాఖ రంగంలోకి దిగుతోందన్నారు. పండ్లు తీసుకున్న వారిలో 98 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని... నాణ్యత, పరిమాణం బాగున్న కారణంగా మళ్లీ మళ్లీ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రవాస తెలంగాణ పౌరులు... తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకి పండ్ల సంచి ‌అందించాలంటూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున వినతులు పంపిస్తున్నారని చెప్పారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు ఫోన్లు చేసి తమకి కూడా పండ్లు కావాలని కోరుతున్నట్లు వెల్లడించారు. సర్కార్‌ పిలుపు మేరకు కొందరు దాతలు స్పందించి పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అనాధలకి పండ్లు వితరణ చేస్తున్నారని చెప్పారు. కరోనాతో దేశంలోని ప్రధాన రంగాలు స్తంభించిన సమయంలో రైతులని ఆదుకునేందుకు సత్‌ సంకల్పంతో చేపట్టిన ప్రయోగానికి జనామోదం లభించడం సంతోషంగా ఉందన్నారు. (ఇర్ఫాన్‌ భార్య సుతప భావోద్వేగ పోస్టు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top