బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డులు

Voter cards in Braille script - Sakshi

     దేశంలోనే ప్రథమం..

     రావత్‌ చేతుల మీదుగా కొందరికి పంపిణీ

     వాదా, ఓటరు చైతన్య రథాలను ప్రారంభించిన రావత్‌  

సాక్షి, హైదరాబాద్‌: అంధుల సదుపాయార్థం రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే ప్రథమంగా అంధుల కోసం బ్రెయిలీ లిపిలోనూ ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల (ఎపిక్‌) జారీ చేపట్టింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ చేతుల మీదుగా కొందరు దివ్యాంగులకు ఈ బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కరపత్రాలు, మూగ, బధిరులకు అర్థమయ్యేలా సైన్‌ లాంగ్వేజితో రూపొందించిన చిత్రాల సీడీలను రావత్‌ ఆవిష్కరించారు. ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో ఈసీ ఈ చిత్రాలు రూపొందించింది. ఈ చిత్రాలు, కరపత్రాల్లో పోలింగ్‌ కేంద్రంలో ఎలా ఓటు వేయాలి.. ఈవీఎం మెషీన్లను ఎలా వాడాలి.. తదితర వివరాలున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్, రాష్ట్ర కమిషనర్‌ బి.శైలజ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంప్‌లు, వలంటీర్లు, చక్రాల కుర్చీలు,  తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.  
బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డు  

ఐకాన్లుగా దివ్యాంగ సెలబ్రిటీలు..  
వివిధ రంగాల్లో సెలబ్రిటీలుగా ఉన్న 9 మంది దివ్యాంగులతో ఓపీ రావత్, కమిషనర్లు అశోక్‌ లవాసా, సునీల్‌ అరోరా సమావేశమయ్యారు. అంధత్వ దివ్యాంగులైన గాయని శ్రావ్య, అంతర్జాతీయ క్రికెటర్లు మహేందర్‌ వైష్ణవ్, జి.మధు, ఐటీ డెవలపర్‌ అనీస్‌ సుల్తానా, రేడియో జాకీ టి.వెంకటేశ్, బధిర దివ్యాంగులు నటి అభినయ, ఆర్థోపెడిక్‌కు సంబంధించి సైంటిస్ట్‌ (ఆర్‌ అండ్‌ డీ) థాండర్‌ బాబూ నాయక్, బారియర్‌ ఫ్రీ కంపెయినర్‌ నర్సింగ్‌రావు, టీవీ యాంకర్‌ సుజాత వీరిలో ఉన్నారు. ఐకాన్లుగా ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసేందుకు వీరంతా సమ్మతి తెలిపారు. సదరం జాబితాలోని వివరాలతో రాష్ట్రంలోని 4,12,098 మంది దివ్యాంగులను ఓటరు జాబితాలో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో దాదాపు 56 వేల మంది అంధత్వ దివ్యాంగులున్నారని తెలిపారు.

వాదా యాప్‌ ప్రారంభం..
హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్‌ చైతన్య రథాలు, దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేందుకు సహాయపడే మొబైల్‌ యాప్‌ ‘వాదా’(ఓటర్‌ యాక్సెస్‌బిలిటీ యాప్‌ ఫర్‌ ద డిఫరెంట్లీ ఏబుల్డ్‌)లను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఓపీ రావత్‌ ప్రారంభించారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు సునీల్‌ అరోరా, అశోక్‌ లవాస, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. ఓటర్‌ చైతన్య రథాల్లో కొన్నింటిని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులందరూ ఓటు వేసేందుకు సహాయ సహకారాలు అందించేందుకు వాదా యాప్‌ను రూపొందించామని దానకిశోర్‌ వివరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top