టీఆర్‌ఎస్‌లో ‘రాజ్యసభ’ లెక్కలు 

TRS Review On Rajya Sabha Elections - Sakshi

రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలు..

సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

రేసులో మాజీ ఎంపీలు కవిత, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి...

ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం కడియం

రాజ్యసభలో 55 స్థానాలకు సంబంధించిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించగా, మార్చి 6వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర కోటాలో కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్‌), గరికపాటి రామ్మోహన్‌రావు, (బీజేపీ)తో పాటు ఏపీ కోటాలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు రిటైర్‌ అవుతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యసభలో 55 స్థానాలకు సంబంధించిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించగా, మార్చి 6వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర కోటాలో కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్‌), గరికపాటి రామ్మోహన్‌రావు (బీజేపీ)తో పాటు ఏపీ కోటాలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు రిటైర్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు వచ్చే నెల 26న పోలింగ్‌ నిర్వహించేలా షెడ్యూల్‌ విడుదలైంది. అయితే అసెంబ్లీలో సంఖ్యా పరంగా టీఆర్‌ఎస్‌కు 104 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది.

రాజ్యసభలో రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులుండగా, ఐదుగురు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే ఉన్నారు. వీరిలో డి.శ్రీనివాస్‌ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలలో జరిగే ద్వైవార్షిక ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి మరో ఇద్దరు ఎన్నికయ్యే అవకాశం ఉండటంతో రాజ్యసభలో రాష్ట్ర కోటాకు సంబంధించిన ఏడు స్థానాలు టీఆర్‌ఎస్‌కు దక్కనున్నాయి. వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ అధినేత కేసీఆర్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. 

అభ్యర్థిత్వం ఎవరికి?
శాసనసభలో టీఆర్‌ఎస్‌కు సంఖ్యా బలం ఉండటంతో పలువురు ఆశావహులు టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభ అభ్య ర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు మరోమారు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అయితే సంఖ్యా పరంగా పార్టీ తరఫున ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులుండటం కేశవరావు అభ్యర్థిత్వానికి ఆటంకంగా కనిపిస్తోంది.

అయితే రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో ఒకదానికి మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రెండో స్థానాన్ని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. 2014లో వరంగల్‌ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై న కడియం ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నా సామాజిక సమీకరణాలతో రాష్ట్ర మంత్రిమండలిలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కడియంను రాజ్యసభకు పంపాలని పార్టీ అధినేత కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఇటు ఎస్టీ కోటాలో మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top