అమ్మా నాన్న.. ఓ ఎమ్మెల్యే టికెట్‌ | TRS Leaders Fighting For MLA Seats Warangal | Sakshi
Sakshi News home page

అమ్మా నాన్న.. ఓ ఎమ్మెల్యే టికెట్‌

Sep 13 2018 11:32 AM | Updated on Sep 15 2018 10:55 AM

TRS Leaders Fighting For MLA Seats Warangal - Sakshi

చందూలాల్‌ ప్రహ్లాద్‌, శ్రీహరి కావ్య, రెడ్యానాయక్‌ కవిత, సురేఖ సుస్మిత

ఇది అమ్మానాన్నల తండ్లాట.. పిల్లల రాజకీయ భవిష్యత్‌ కోసం తండ్లాట.. తమకు బలం ఉన్నప్పుడే బిడ్డలను నేతలుగా నిలబెట్టాలనే తపన.. తమ రాజకీయ జీవితాలను త్యాగం చేసైనా కొడుకు, కూతుళ్లను అధికారంలోకి తేవాలనే ఆరాటం.. కొండా దంపతులు తమ కూతురు కోసం తమ రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడితే.. ములుగులో చందూలాల్‌ తన కొడుకు కోసం పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రెడ్యానాయక్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజకీయ బలం ఉపయోగించి కూతుళ్ల కోసం చక్రం తిప్పుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సీనియర్‌ రాజకీయ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలోపడ్డారు. తమకు ప్రజల్లో పేరు, ప్రతిష్టలు ఉన్నప్పుడే తమ వారసులను రాజకీయ రంగం మీద అరంగేట్రం చేయించాలని భావిస్తున్నారు. తమకు టికెట్లు రాకపోయిన ఫరవాలేదు.. తమ పిల్లలను మాత్రం ఎమ్మెల్యేలుగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

కూతురు కోసం కొండా దంపతులు..
ఈ సారి కూతురు సుష్మితా పటేల్‌ను రాజకీయ అరంగేట్రం చేయించడానికి కొండా మురళి, సురేఖ దంపతులు గట్టి పట్టుదలతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి రెండు టికెట్లను ఆశించారు. అవకాశం కలిసి వస్తే భూపాలపల్లి నుంచి సుష్మితను నిలబెట్టాలని ఆలోచించారు. రెండు సీట్లు రాకుంటే వరంగల్‌ తూర్పులో సురేఖ రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి కూతురు భవిష్యత్‌కు పునాదులు వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ ఆమె టికెట్‌ను పెండింగ్‌లో పెట్టింది. దీంతో వాళ్లు కారుతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కూతురు సుష్మితను పరకాల నుంచి, సురేఖ వరంగల్‌ తూర్పు నుంచి నిలబడేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీతో కూడా ఏకాభిప్రాయం కుదరకపోతే స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో నిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇండిపెండెంట్‌గా అయితే పరకాల, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు నుంచి ముగ్గురు నిలబడే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.

స్టేషన్‌ఘన్‌పూర్‌పై శ్రీహరి..
ఎమ్మెల్సీతో రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యను రాజకీయ రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయించేందుకు స్కెచ్‌ వేశారు. అయితే సిట్టింగుల కోటా కింద గులాబీ దళపతి కేసీఆర్‌.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్‌ ఇచ్చారు. ఈ నిర్ణయం కడియం శ్రీహరి వర్గాన్ని కలవరపరిచింది. నియోజకవర్గంలోని ఆయన అనుకూల వర్గం ప్రజాప్రనిధులు రోడ్డెక్కారు. సభలు పెట్టి రాజయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఒక మహిళతో శృంగార పలుకులతో రాజయ్య స్వరాన్ని పోలిన ఆడియో క్లిప్పింగ్‌ ఒకటి సోషల్‌ మీడియా ద్వారా బయటకు వచ్చింది.
 
ములుగులో.. 
ములుగు ఎమ్మెల్యే, ఆపద్ధర్మ మంత్రి చందూలాల్‌ ఆరోగ్య పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సారి టికెట్‌ తన కుమారుడు, ములుగు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్‌కు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ములుగు నియోజకవర్గంలో చందూలాల్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రహ్లాద్‌ చక్కబెడుతున్నారు. అధికారులతో మాట్లాడడంతోపాటు అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు. డోర్నకల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఖరారైంది. తన కూతురు మాజీ ఎమ్మెల్యే కవిత మహబూబాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. దీంతో కూతురు టికెట్‌ విషయంపై ఆయన ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమనుకుంటే కూతురు కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement