విద్యుత్‌ సరఫరాపై తిత్లీ ప్రభావం 

Titli effect on power supply - Sakshi

  ఉత్తర–దక్షిణాది గ్రిడ్‌కు అంతరాయం

  మరో 3 రోజులు అప్రమత్తత అవసరం: టీఎస్‌పీసీసీ  

సాక్షి, హైదరాబాద్‌: తిత్లీ తుపాను ప్రభావంతో రానున్న 3 రోజులపాటు విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యుత్‌ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ విద్యుత్‌ సమన్వయ కమిటీ (టీఎస్‌పీసీసీ) సూచించింది. సోమవారం విద్యుత్‌ సౌధలో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అధ్యక్షతన టీఎస్‌పీసీసీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, వివిధ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ సరఫరా పరిస్థితిని సమీక్షించి తిత్లీ తుపాను ప్రభావం వల్ల కలుగుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అన్ని రంగాలకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్, హైడల్‌ పవర్‌ స్టేషన్ల ద్వారా పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని థర్మల్‌ స్టేషన్లలో చాలినంత బొగ్గు నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కేవలం రాష్ట్రంలోని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారానే విద్యుత్‌ అందాల్సి ఉన్నందున ఏ ఒక్క పవర్‌ ప్లాంటులో కూడా ఏ ఒక్క యూనిట్లోనూ ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని జెన్‌కో అధికారులను ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఎంత దొరికితే అంత విద్యుత్‌ను ఎంత ధరైనా  కొనుగోలు చేయాలని నిర్ణయించారు.  

ఇవీ ఇబ్బందులు.. 
తిత్లీ తుపాను వల్ల ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య విద్యుత్‌ సరఫరా చేసే టవర్లు కూలిపోయాయి. హైటెన్షన్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు దేశంలో ఎటువైపు నుంచి కూడా విద్యుత్‌ అందడం లేదు. ఉత్తర–దక్షిణాది గ్రిడ్‌కు అంతరాయం ఏర్పడింది. తాల్చేరు–కోలార్, అంగూల్‌–శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో తెలంగాణకు రావాల్సిన 3 వేల మెగావాట్ల విద్యుత్‌ అందడం లేదు. దీనికి తోడు సెంట్రల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు కొరత వల్ల కూడా దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సెంట్రల్‌ షేర్‌ కింద రాష్ట్రానికి 2,500 మెగావాట్ల విద్యుత్‌ అందాల్సి ఉండగా, కేవలం 1,500 మెగావాట్లు మాత్రమే అందుతోంది. ఛత్తీస్‌గఢ్‌ ద్వారా 1,000 మెగావాట్లు రావాల్సి ఉండగా, కేవలం 350 మెగావాట్లు మాత్రమే వస్తోంది. ఒకవైపు బయట నుంచి రావాల్సిన విద్యుత్‌ రాకపోవడం సరఫరాపై ప్రభావం చూపుతుండగా, మరోవైపు ఏడాది కాలంలో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 40 శాతం మేర పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 7,538 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌కు అది 10,600 మెగావాట్లకు చేరింది.

ప్రజలు సహకరించాలి
తిత్లీ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలన్నింటితోపాటు రాష్ట్రంపైనా ఉంది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా 24 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయడానికి విద్యుత్‌ సంస్థల అధికారులు సిద్ధం గా ఉండాలి. లైన్ల పునరుద్ధరణ చర్యలకు ప్రతికూల వాతావరణం ప్రతిబంధకంగా మారింది. మరో 3 రోజులపాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి. విద్యుత్‌ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి కరెంటు కోతలు లేకుండా చూస్తున్నారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలి.
– దేవులపల్లి ప్రభాకర్‌రావు,సీఎండీ జెన్‌కో, ట్రాన్స్‌కో

‘అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా’ 
ఎలాంటి అంతరాయం లేకుండా గ్రేటర్‌ వాసులకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. టీఎస్‌జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం మింట్‌ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయా సర్కిళ్ల ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో రఘుమారెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం గ్రేటర్‌లో 55.9 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం, డిస్కం పరిధిలో 155 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరుగుతుందని చెప్పారు. తిత్లీ తుపాన్‌ ప్రభావం వల్ల ఉత్తరాది నుంచి రావాల్సిన విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు రఘుమారెడ్డి తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top