దేశవ్యాప్తంగా టైటిల్‌ గ్యారంటీ!

Title Guaranty Through Out Country - Sakshi

ప్రయోగాత్మకంగా హరియాణాలో అమలు

2022లోపు టైటిల్‌ గ్యారంటీని తేవాలని నీతి ఆయోగ్‌ సిఫారసు

అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని మోదీ సర్కారు యోచన

భూ సర్వే, సంస్కరణల భారం కేంద్రానిదే

కొత్త రెవెన్యూ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వ యోచన

కేంద్రమిలా... 
2011 యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త ముసాయిదాను రూపొందించాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది.  
రాష్ట్రమిలా... 
ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న భూ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యయనం చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం కోసం ముసాయిదాకు తుదిరూపునిస్తోంది. 

సాక్షి, హైదరాబాద్‌: టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే హరియాణాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2011 యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త ముసాయిదాను రూపొందించాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది. ఇప్పటికే మన రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడానికి నిపుణుల కమిటీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే ఉద్ధేశంతో టైటిల్‌ గ్యారెంటీ చట్టాన్ని ప్రవేశపెట్టడమే ఉత్తమ మార్గమమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేసేందుకుగాను ముసాయిదాకు తుదిరూపునిస్తోంది. 

ఆర్థిక భారం కేంద్రానిదే!.. 
భూ సర్వే, రెవెన్యూ సంస్కరణలకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం ఇది వరకే అంగీకరించింది. భూ భారతి మొదలు సమగ్ర భూ సర్వేకు కూడా నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలోనే టైటిల్‌ గ్యారెంటీ చట్టం అమలుకు అవసరమైన వ్యయాన్ని భరించడానికి సుముఖంగా ఉంది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జాతీయ భూ రికార్డుల నవీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) ప్రవేశపెట్టింది. దీని స్థానే ఎన్డీఏ సర్కారు డిజిటల్‌ ఇండియా భూ రికార్డుల నవీకరణ ప్రోగ్రాం (డీఐఎల్‌ఆర్‌ఎంపీ)ను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశం టైటిల్‌ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయడం. ఈ నేపథ్యంలోనే గతేడాది హర్యానాలోని ఒక జిల్లాలో టైటిల్‌ గ్యారెంటీని పైలెట్‌ ప్రాజెక్టుగా మొదలు పెట్టింది. అలాగే మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని పట్టణ ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలులో కొంత ముందడుగు పడింది.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడంతో టైటిల్‌ గ్యారెంటీ చట్టంపై ఆశలు చిగురించాయి. మరోవైపు మన రాష్ట్ర ప్రభుత్వంకూడా ఆ దిశగా ఆలోచన చేస్తుండటం.. కేంద్రం కూడా దానికి సానుకూలంగా ఉండటంతో టైటిల్‌ గ్యారెంటీ పట్టాలెక్కేందుకు మార్గం సుగమమం కానుంది. అంతేగాకుండా.. టైటిల్‌ గ్యారెంటీని ప్రవేశపెట్టాలంటే హద్దులు, టైటిల్‌ క్లియర్‌ అవసరం. దీంతో భూసర్వే నిర్వహిస్తే తప్ప ఈ చట్టం అమలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సమగ్ర భూ సర్వే చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అవసరమైన నిధులను రాష్ట్రాలకు కేటాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. 2022లోపు టైటిల్‌ గ్యారెంటీని అందుబాటులోకి తీసుకురావాలని నీతి ఆయోగ్‌ సూచించడం కూడా మోదీ సర్కారు భూసంస్కరణల వైపు మొగ్గు చూపడానికి కారణంగా కనిపిస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top