సాగునీటికి బడ్జెట్ ఏదీ..? | There is no budget for irrigation ..? | Sakshi
Sakshi News home page

సాగునీటికి బడ్జెట్ ఏదీ..?

Jul 21 2016 4:02 AM | Updated on Sep 4 2017 5:29 AM

రాష్ట్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులతో నీటి పారుదల శాఖకు అగ్రస్థానాన్ని కట్టబెట్టినా, నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది.

- ప్రాజెక్టుల పనులకు బడ్జెట్ విడుదలలో తీవ్ర జాప్యం
- ప్రతీనెలా రూ.2వేల కోట్లను విడుదల చేయాల్సి ఉన్నా వెయ్యి కోట్లను దాటని వైనం
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులతో నీటి పారుదల శాఖకు అగ్రస్థానాన్ని కట్టబెట్టినా, నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది. ప్రతీ నెలా రూ.2వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నా రూ.1000 కోట్లకు మించి విడుదల చేయడం లేదు. దీంతో ప్రాజెక్టుల బిల్లులన్నీ బకాయిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో నీటి పారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యమిచ్చి రూ.25 వేల కోట్లు కేటాయించింది. ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా చేపట్టేందుకు ఈ శాఖకు ప్రతీనెలా రూ. 2000 కోట్లు చెల్లించే పద్ధతిని అనుసరిస్తోంది.

ఇలా ఈ నాలుగు నెలల కాలానికి రూ.8వేల కోట్లు విడుద చేయాల్సి ఉన్నా ఇంతవరకు కేవలం 3,700కోట్లను మాత్రమే విడుదల చేసింది. మరో రూ.800కోట్లకు సంబంధించిన బిల్లులకు ఆమోదం లభించినా ఇంకా పీఏఓలో ఉన్నాయి. దీంతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు నీటి పారుదల శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీనిపై ఆర్థిక శాఖను నీటి పారుదల శాఖ అధికారులు అడిగినప్పుడల్లా రూ.100 నుంచి రూ.200కోట్లు విడుదల చేస్తున్నారని, మిగతా నిధుల విడుదలకు ఆగాల్సిందేనన్న సమాధానం వస్తోంది.

రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో చేపట్టిన కార్యక్రమాలతో పాటు రైతుల రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, విద్యుత్తు, బియ్యం సబ్సిడీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులన్నీ ఏకకాలంలో రావడంతో ఇరిగేషన్ బడ్జెట్‌కు కోత పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ విడుదల చేస్తున్న బడ్జెట్‌ను జాగ్రత్తగా వాడుతున్న నీటి పారుదల శాఖ పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పూర్తికి, ఆదిలాబాద్‌లోని కొమరంభీం సహా ఇతర మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువులకు సంబంధించిన మిషన్ కాకతీయ పనులకు సర్దుబాటు చేస్తున్నారు. అయితే ఇటీవల నీటిపారుదలశాఖ విన్నపం మేరకు ప్రాజెక్టుల్లో అవసరమైన భూసేకరణకు నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ సమ్మతించింది. ప్రాజెక్టుల భూసేకరణకు గాను జూలైలో రూ.162కోట్ల మేర విడుదల చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement