వృద్ధ మహిళలే లక్ష్యంగా... | the target of chain theft is old woman | Sakshi
Sakshi News home page

వృద్ధ మహిళలే లక్ష్యంగా...

Aug 9 2014 4:22 AM | Updated on Sep 2 2017 11:35 AM

జిల్లాలో వరుస చోరీలతో సతమతమవుతున్న పోలీసు శాఖకు.. కొన్ని రోజులుగా చైన్ స్నాచింగ్ ముఠా పెద్ద తొలనొప్పిగా తయారైంది.

ఖమ్మం క్రైం: జిల్లాలో వరుస చోరీలతో సతమతమవుతున్న పోలీసు శాఖకు.. కొన్ని రోజులుగా చైన్ స్నాచింగ్ ముఠా పెద్ద తొలనొప్పిగా తయారైంది. గతంలో కేవలం యువతులు, మధ్య వయసు మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను మాత్రమే చైన్ స్నాచర్లు చోరీ చేసేవారు. వీరు ఇటీవలి కాలంలో రూటు మార్చారు. వీరు ప్రధానంగా వృద్ధ మహిళలనే లక్ష్యం గా చేసుకుంటున్నారు.

యువతులు, మధ్య వయసు మహిళలైతే ప్రతిఘటిస్తారు. దొంగలను గుర్తుపడతారు. వారి వాహనం నంబరు.. ఆనవాళ్లు గుర్తించగలరు. అదే వృద్ధ మహిళలైతే.. శారీరక బలహీనత, దృష్టి లోపం కారణంగా ప్రతిఘటన శక్తి ఉండదు. అందుకే, వీరినే లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ ముఠా ఆగడాలు సాగిస్తోంది.

 ఇటీవలి కాలంలో జరిగి న కొన్ని ఘటనల వివరాలు చూడండి...
నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో దంపతులు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. వారిని వెనుకగా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వెం బడించారు. నిర్మానుష్య ప్రాంతంలోకి రాగానే... వెనుకగా కూర్చున్న ఆమె (మధ్య వయస్కురాలు) మెడలోని బంగారపు గొలుసును లాక్కుని పరారయ్యారు. ఆమె వాహనం పైనుంచి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి.

 ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని రాజేంద్రనగర్ పార్‌‌క వద్ద ఓ వృద్ధురాలు (కల్పనేని రత్నమ్మ) ఉదయం వాకింగ్ చేస్తుండగా ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారపు గొలుసును లాక్కుని పరారయ్యారు.

ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని పంపింగ్‌వెల్ రోడ్డులో ఓ వృద్ధురాలు (సీతమ్మ) తన ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని అగంతకుడు గమనించాడు. చుట్టుపక్కల ఎవరూ లేనిది గమనించి ఆమె ఇంటి ముందుకు వెళ్లి మంచినీళ్లు అడిగాడు. నీళ్లు తాగేసిన వెంటనే ఆమె మెడలోని బంగారపు గొలుసు లాక్కుని ద్విచక్ర వాహనంపై క్షణాల్లో బాయమయ్యాడు.

ఖమ్మం టూటౌన్ పరిధిలోని బుర్హాన్‌పురంలో ఓ వృద్ధురాలు ఉదయమే తన ఇంటి ముందు చెట్టుకు పూలు కోస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి, ఆమె మెడలోని బంగాపు గొలుసును గుంజుకుని పారిపోయారు.

 కొత్తగూడెంలో ఓ వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై దగ్గరగా వచ్చి ఆగారు. ఫలానా అడ్రస్ ఎక్కడంటూ అడిగారు. ఆమె సమాధానం చెబుతుండగానే... మెడలోని బంగారపు గొలుసును లాక్కుని మెరుపు వేగంతో పారిపోయారు.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. జిల్లాలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. బాధితుల్లో అత్యధికులు వృద్ధులే ఉన్నా రు. ఇటీవల నమోదైన ఈ కేసుల్లో దొంగలను పోలీసులు ఇప్పటివరకూ పట్టుకోలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement