తీరు మారని వైద్యులు | the behaviour of medical staff not changed in hospital | Sakshi
Sakshi News home page

తీరు మారని వైద్యులు

Nov 17 2014 3:13 AM | Updated on Sep 2 2017 4:35 PM

జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో వైద్యుల తీరు మారడం లేదు.

నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో వైద్యుల తీరు మారడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. వైద్యు ల గైర్హాజరుతో వైద్య సేవలు అందకపోగా రోగు లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొందరు రోగులైతే ప్రాణాలు సైతం కోల్పోవాల్సి వసోంది. ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ వైద్యులు ఆస్పత్రికి రావడానికి మొగ్గు చూపడం లేదు. మెడికల్ కళాశాలకు 120 మంది ప్రొఫెసర్లను నియమించారు. వైద్య విధాన పరిషత్ నుంచి 36 మంది వై ద్యులు ఉన్నారు.

వీరు నిత్యం ఆసుపత్రిలో వైద్యసేవలు అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆస్పత్రికి  33 మంత్రి వైద్యులు మాత్రమే హాజరవుతున్నారు.అలాగే 109 మంది సీనియర్ రెసిడెంట్ వైద్యులు నియమితులైనా వీరు సమ్మె పేరిట పూర్తిగా గైర్హాజరవుతున్నా రు. ఆస్పత్రికి మాత్రం ప్రతినిత్యం 600 మంది అవుట్‌పేషెంట్లు, 350 ఇన్‌పేషెంట్లు వస్తున్నారు. కాగా వైద్యుల గైర్హాజరుతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఇటీవల వారం రోజుల్లో నాలుగుసార్లు ఓపీ సేవలకు కూడా వైద్యులు రాలేకపోయారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చి వైద్యులు విధులను సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వచ్చివెళ్లిన మరుసటి రోజునే  వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన అన్వేష్ అనే బాలుడు మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన అన్వేష్‌ను మధ్యాహ్నం మూడు గంటలకు ఆస్పత్రికి తీసుకురాగా, సాయంత్రం ఐదు గంటల వరకు గానీ వైద్యులు రాలేదు. తీరా వచ్చి అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తేల్చారు.

ఇలాంటి ఘటనల నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు తదితర అత్యవసర కేసులను హైదరాబాద్ ఆస్పత్రులకే తరలిస్తున్నారు. సీనియర్ వైద్యులు ఉన్నప్పటికీ వారి గైర్హాజరు మూలంగా ఈ పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉంటే ప్రతి శుక్రవారం సదరం క్యాంపులో పాల్గొని సర్టిఫికెట్లను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆదేశించినప్పటికీ వైద్యులెవరూ పట్టించుకోవడం లేదు.వైద్యులు అందుబాటులో ఉండక పోవడంతో తరచూ  వికలాంగులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.

అధికారుల మౌనం
వైద్యులు ఆస్పత్రికి వచ్చి సేవలందించకపోయినప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనంగానే ఉంటున్నారు. కొందరు వైద్యులు ఇక్కడ పనిచేసేందుకు ఇష్టపడక పోగా, మరికొందరు అధికారులను మచ్చిక చేసుకుని విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది.కొందరు వైద్యులు హైదరాబాద్‌లో, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో  ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరిపై కళాశాల అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కళాశాల పర్యటనకు వచ్చేసమయంలో మాత్రమే ప్రొఫెసర్లు వస్తున్నారు. తర్వాత తిరిగి ముఖం చూడడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement