అఫిడవిట్లతో వైద్య విద్యార్థులకు టెన్షన్.. | Tension affidavit medical students .. | Sakshi
Sakshi News home page

అఫిడవిట్లతో వైద్య విద్యార్థులకు టెన్షన్..

Jan 4 2015 6:02 AM | Updated on Nov 6 2018 4:42 PM

ఎంబీబీఎస్‌లో హాజరు శాతం తగ్గితే అఫిడవిట్లు సమర్పించాలన్న వైద్య విద్యాశాఖ ఉత్తర్వులపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • 17వ తేదీ నుంచి పరీక్షలు... అఫిడవిట్లు ఇస్తేనే అనుమతి
  • సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్‌లో హాజరు శాతం తగ్గితే అఫిడవిట్లు సమర్పించాలన్న వైద్య విద్యాశాఖ ఉత్తర్వులపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు రాయాలంటే 75 శాతం హాజరు తప్పక ఉండాలి. రెండు నెలలపాటు జూనియర్ డాక్టర్లు నిర్వహించిన సమ్మెలో పాల్గొనడంతో ఎంబీబీఎస్ విద్యార్థుల హాజరు శాతం తగ్గింది. దీంతో వారంతా తల్లిదండ్రులు, ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంతకంతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య విద్యశాఖ డెరైక్టర్ అంతర్గత ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

    ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు సమ్మెలు, ఆందోళనలు, ధర్నాలు, ప్రదర్శనల్లో పాల్గొనబోనని పూచీకత్తు ఇవ్వాలని స్పష్టంచేసింది. దీనికి గత శుక్రవారం వరకే గడువు అని చెప్పడంతో విద్యార్థులంతా అఫిడవిట్లు సిద్ధం చేసుకొని తమ తరగతి ప్రతినిధులకు అందజేశారు. వారు వీటిని సోమవారం వైద్య విద్యాశాఖకు అందజేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. మరోవైపు వైద్య విద్యాశాఖ నిర్ణయంపై జూడాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అఫిడవిట్లన్నింటినీ సమర్పించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో విద్యార్థులున్నారు.

    తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,500 మందికి పైగా ఎంబీబీస్ చదివే వారున్నారు. అందరూ సమ్మెలో పాల్గొనలేదు. జూడాలు తరగతులు జరగనీయకుండా చేయడంతో కొందరు ఇళ్లకు వెళ్లిపోగా, కొందరు సమ్మెలో పాల్గొన్నారు. ఎలా ఉన్నా అందరూ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందేనని వైద్య విద్యా శాఖ స్పష్టం చేసింది. అధికారుల ఆదేశాలను ధిక్కరించి అఫిడవిట్లు దాఖలు చేయకుండా ఎదుర్కోవాలని కొందరు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.

    ఇలా అందరూ చేస్తే అధికారులే దిగి వస్తారని అంటున్నారు. కాగా, హాజరు తక్కువున్న విద్యార్థులు అఫిడవిట్లు దాఖలు చేయాలని నిర్ణయించిన విషయం వాస్తవమేనని,  పదేపదే జూడాలు సమ్మెలు చేస్తున్నారని, దీని వల్ల విద్యా వాతావరణం దెబ్బతింటోందని, నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తామని వైద్య విద్యా శాఖ డెరైక్టర్ పుట్టా శ్రీనివాస్ పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement