లాక్‌డౌన్‌ : అంబులెన్స్‌లో ప్రయాణికుల తరలింపు

Telangana LockDown: Ambulance Drivers Moving Passengers - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌ : కరోనావైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలుగు రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజారవాణా మొత్తం బంద్‌ అయింది. అత్యవసర విభాగాలకు చెందిన వాహనాలను తప్ప వేటిని రోడ్లపైకి అనుమతించడం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు రెచ్చిపోతున్నారు. పేషెంట్ల ముసుగులో ప్రయాణికులను తరలిస్తున్నారు. కోదాడ దగ్గర ఈ దందా బయటపడింది.

పెషెంట్ల ముసుగులో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి అంబులెన్స్ డ్రైవర్లు వెయ్యి రూపాయిలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంబులెన్స్‌ కావడంతో ప్రతి చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు బారికేడ్లను తీసి పంపించారు. కానీ కోదాడ వద్ద పోలీసుల తనిఖీల్లో బయటపడ్డారు.

అంబులెన్స్‌ డ్రైవర్లు డబ్బులు తీసుకొని ప్రయాణికులను రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారన్న సమాచారంతో కోదాడ పోలీసులు రామపురం చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన మూడు అంబులెన్స్‌ను తనిఖీలు చేయగా ప్రయాణికులు బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రయాణికులతో పాటు అంబులెన్స్‌ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ప్రైవేట్ వాహనాలను కూడా అడ్డుకోవడంతో కొత్త దందా షురూ అయ్యింది.  అంబులెన్స్‌లో ప్రయాణికుల తరలింపు ఘటన వెలుగులోకి రావడంతో హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇకపై హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో.. హైవే రోడ్లపై ఇకపై చెకింగ్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top