ఆపరేషన్‌ ఆకర్ష్‌

Telangana Election TRS Leaders Nizamabad - Sakshi

ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో బలమైన నాయకులకు టీఆర్‌ఎస్‌ గాలం వేస్తోంది. పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలను దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. బాన్సువాడలో గట్టి పట్టున్న కాంగ్రెస్‌ నేత మల్యాద్రిరెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌లో బీజేపీ టిక్కెట్‌ ఆశిస్తున్న ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తాతో టీఆర్‌ఎస్‌ టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ ఫిరాయింపులపై ఆయా నేతలు బయట పడటం లేదు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆపరేషన్‌ ఆకర్షకు మరింత పదును పెడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులకు గాలం వేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులను కారెక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపే నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలను దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ ఇప్పుడు మిగితా పార్టీల్లోని కొందరు నేతలతో టచ్‌లో ఉంటుంది. ఈ రెండు పార్టీల్లో టికెట్‌ విషయంలో అసంతృప్త నేతలకు గాలం  వేస్తోంది.
 
బాన్సువాడలో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు.. 
బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్టు ఆశిస్తున్న ఆ పార్టీ నేత మల్యాద్రిరెడ్డికి టీఆర్‌ఎస్‌ గాలం వేస్తోంది. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న మల్యాద్రిరెడ్డి గత కొంతకాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సీనియర్‌ నేత మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఎలాగైనా అనుకూలంగా మార్చుకుని గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఇప్పటి వరకు చెప్పుకోదగిన నాయకులు తెరపైకి రాలేదు. ప్రస్తుతానికి ఒక్క కాంగ్రెస్‌ నుంచే పోటీ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన మల్యాద్రిరెడ్డికి గులాబీ కండువా కప్పడం ద్వారా గట్టి పోటీనిచ్చే కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టవచ్చని భావిస్తోంది.

జనగామ తాజా మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు.. 
మల్యాద్రిరెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకునేందుకు జనగామ జిల్లా టీఆర్‌ఎస్‌కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ద్వారా టీఆర్‌ఎస్‌ సంప్రదింపులు జరిపింది. మల్యాద్రిరెడ్డి సతీమణి ముత్తిరెడ్డి సోదరుని కుమార్తె. దీంతో ముత్తిరెడ్డి ద్వారా టీఆర్‌ఎస్‌ పావులు కదిపింది. ఈ మేరకు మంత్రి పోచారం ముత్తిరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చర్చ జరుగుతోంది. అయితే చేతగాని నేతలు చేసే ప్రచారం తప్ప తాను పార్టీ మారుతాననడంలో నిజం లేదని మల్యాద్రి తేల్చిచెప్పారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకే తాను కాంగ్రెస్‌లోకి వచ్చానని అన్నారు. ఎవరో చెబితే తాను పార్టీ మారుతానని అనుకోవడం సరికాదని అన్నారు.

అర్బన్‌లో ధన్‌పాల్‌కు.. 
నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తతో కూడా టీఆర్‌ఎస్‌ టచ్‌లో ఉంది. ఆయనతో ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆయన నివాసంలో చర్చించినట్లు ప్రచారం జోరందుకుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ధన్‌పాల్‌ మూడో స్థానంలో నిలిచారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ బలంగా ఉన్న అర్బన్‌ నియోజకవర్గంపై మరింత పట్టు సాధించవచ్చని టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఇదంతా పూర్తిగా అసత్య ప్రచారమని, గిట్టనివాళ్లు చేస్తున్న పని అని ఆయన కొట్టిపారేశారు. 20 ఏళ్లుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న తనను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ అదే ఊపును కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top