వరంగల్‌లో ఉనికి  కోల్పోయిన టీడీపీ

Tdp Lost Vote Bank On Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: ఒకప్పుడు ఒంటిచేత్తో జిల్లాను ఏలిన రాజకీయ పార్టీలు క్రమంగా ప్రాభవం కోల్పోతున్నాయి. అధికార పీఠాలతో.. ప్రజా పోరాటాలతో ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత క్రమక్రమంగా పోటీకి దూరమవుతున్నాయి. జిల్లాలో 1984 నుంచి వరంగల్‌ పార్లమెంట్‌కు 11 పర్యాయాలు ఎన్నికలు జరిగితే.. టీడీపీ అభ్యర్థులు ఏడు సార్లు గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రెండుకళ్ల సిద్ధాంతం అవలంభించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా పలువురు ఇతర పార్టీల్లోకి వెళ్లగా ఈ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను బరిలో దింపలేని పరిస్థితి నెలకొంది. 35 ఏళ్లుగా అనేక మంది నాయకులను అందించిన టీడీపీ ప్రస్తుతం పోటీ పడలేని పరిస్థితికి దిగజారి పోయింది. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమి చేయాలో తెలియక అంతర్మథనంలో పడ్డారు. 

వరంగల్‌ నుంచి ఏడు సార్లు 
1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ ఇక్కడ పాగా వేసింది. వరంగల్‌ పార్లమెంట్‌కు 1984 నుంచి 2015 వరకు ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఏడు పర్యాయాలు గెలుపొందారు. 1984లో తొలిసారి టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థిగా డాక్టర్‌ టి.కల్పనాదేవిని బరిలోకి దింపగా.. ఆమె కాంగ్రెస్‌ దిగ్గజం కమాలొద్దీన్‌ అహ్మద్‌పై ఘన విజయం సాధించింది. 1989, 1991 ఎన్నికలు మినహాయిస్తే 1996 నుంచి 1999 వరకు వచ్చిన మూడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు.

ఈ క్రమంలో కల్పనాదేవి  కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్‌ చేతిలో ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి బోడకుంటి వెంకటేశ్వర్లు పోటీ చేయగా కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన డాక్టర్‌ కల్పనపై గెలుపొందాడు. 2004లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డి.రవీందర్‌నాయక్‌ టీడీపీ అభ్యర్థి బోడకుంటి వెంకటేశ్వర్లుపై గెలుపొందాడు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలో ప్రస్తుత పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి పి.రామేశ్వర్‌రెడ్డిపై గెలుపొందాడు.

అనంతరం మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా 2009లో ఉధృతం కాగా.. చంద్రబాబు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ‘యు’టర్న్‌ తీసుకోవడంతో ఆ పార్టీకి ఉద్యమాల ఖిల్లా వరంగల్‌లో పుట్టగతులు లేకుండా పోయాయి. 2009లో కాంగ్రెస్, 2014, 2015 ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. వరంగల్‌లో పూర్తిగా ఉనికి కోల్పోయిన టీడీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉందిట.

టీడీపీ తమ్ముళ్ల దారెటు? సంప్రదాయ ఓటింగ్‌పై సర్వత్రా చర్చ
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ క్యాడర్‌ చెల్లా చెదురైంది. చాలా మంది నాయకులు పార్టీ మారారు. అధిక శాతం మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్లమెంట్‌ బరి నుంచి తప్పుకోవడంతో తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారన్నది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమితో కలిసి నడిచిన టీడీపీ ఆ తర్వాత ఇంకా పూర్తిగా ఉనికిని కోల్పోయింది. ఈ నేపథ్యంలో మిగిలిన టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ వైపు వెళ్తారా? లేదా తమ విచక్షణ మేరకు ఓటేస్తారా? అనే చర్చ మొదలైంది.

గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న టీడీపీ ఓటర్లు తమకు సానుకూలంగానే ఉంటారనే భావన ఒక వైపు ఉన్నా.. ఇంకో వైపు చేజారవచ్చన్న గుబులు కూడా కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుని మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. అటు పార్టీ  అధిష్టానం టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపకపోవడం.. ఇటు వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఓటేయడమో స్పష్టత ఇవ్వకపోవడంతో ఏమీ చేయాలో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ క్యాడర్‌ ఉంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top