Sakshi News home page

‘మిగులు’పై తేలుస్తారా..?

Published Mon, Nov 7 2016 3:31 AM

‘మిగులు’పై తేలుస్తారా..? - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయని గోదావరిలో మిగులు జలాల లభ్యతపై ఉన్న సందిగ్ధతపై చర్చించేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈ నెల 9న మరోమారు ఢిల్లీలో భేటీ కానుంది. మిగులు జలాలపై నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ), రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన భిన్న గణాంకాల్లో ఏది వాస్తవం, ఏది అవాస్తవమో కమిటీ చర్చిం చనుంది. ఈ సమావేశంలో గోదావరి మిగు లు జలాల అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేర్చింది. దీంతో పాటు మహానది మిగులు జలాలపైనా చర్చిస్తారు. నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా మహానది, గోదావరిలో మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలో ఇచ్ఛంపల్లి(గోదావరి)- నాగార్జునసాగర్(కృష్ణా), ఇచ్ఛంపల్లి- పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని గతంలో ప్రణాళిక వేసిన విషయం తెలిసిందే.

అయితే గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీల్లో ప్రస్తుత, రాబోయే అన్ని ప్రాజెక్టులతో కలిపి మొత్తంగా 628.64 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటోందని, మిగతావన్నీ మిగులు జలాలేనని ఎన్‌డబ్ల్యూడీఏ తేల్చిచెబుతోంది. ఈ లెక్కలు తప్పని రాష్ట్రం వాదిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మితమైన ప్రాజెక్టులతో మొత్తంగా 433.04 టీఎంసీల వినియోగం జరుగుతోందని, నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులతో మొత్తంగా 475.79 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేనున్నామని తెలిపింది. ఇక మరో 45.38 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయని,  ఈ లెక్కల ఆధారంగా గోదావరిలో మిగులు ఏమీ లేదని చెబుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement