గవర్నర్‌గిరీ తాత్కాలిక నిలిపివేత

గవర్నర్‌గిరీ తాత్కాలిక నిలిపివేత - Sakshi


హోంమంత్రి హామీ ఇచ్చినట్టు టీఆర్‌ఎస్ ఎంపీల వెల్లడి

 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్టు టీఆర్‌ఎస్ ఎంపీలు వెల్లడించారు. సోమవారం పార్లమెంటు వద్ద టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీ బీ వినోద్‌కుమార్‌లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్ 8 లోని అంశాలను, తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారాలను లాగేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను హోం మంత్రికి వివరించామని వారు చెప్పారు. శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చినట్టు వారు తెలిపారు. తమ నోటీసును స్పీకర్ తిరస్కరించగా, తాము ఉభయసభలను అడ్డుకున్నామని వారు చెప్పారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని, రాజ్యసభ నుంచి హోంమంత్రి రాజ్‌నాథ్‌ను లోక్‌సభకు పిలిపించారని వారు వివరించారు.



వాయిదా అనంతరం తిరిగి సభ సమావేశమైనపుడు సెక్షన్ 8లోలేని అంశాలను రాజ్‌నాథ్ దృష్టికి తెచ్చినట్టు ఎంపీలు చెప్పారు. ‘ఈనెల 18వ తేదీన జరిగే సమావేశానికి హోంమంత్రి తమను ఆహ్వానించారని, గవర్నర్ ఆదేశాలకు సంబంధించి వెర్బాటమ్ సవరిస్తామని, ప్రస్తు తం హోంశాఖ జారీచేసిన ఆదేశాలను నిలిపివేస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు.’ అని టీఆర్‌ఎస్ ఎంపీలు వివరించారు. ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల పట్ల ఒక వర్గం విద్వేషపూరితంగా నేరాలు చేస్తే, ఆ నేరాలపైన గవర్నర్ ఆలోచన చేస్తారని సెక్షన్ 8లో ఉందని,అయితే, జాయింట్ సెక్రటరీ జారీచేసిన ఉత్తర్వులు అందుకు భిన్నంగా, పోలీసు అధికారుల బదిలీ లు  కూడా గవర్నర్ పరిధిలో ఉంటాయని ఉంద ని ఎంపీలు తెలిపారు. సెక్షన్ 8 ప్రకారం ఉంటే తప్పుపట్టడంలేదని, అందులో లేని అధికారాలను గవర్నర్‌కు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అసలు సెక్షన్ 8లో ఏముందనే విషయం హోంమంత్రికి కూడా తెలియదని ఎంపీలు వ్యాఖ్యానించారు. రాష్ట్రపునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 8 ని బూచిగా చూపి కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమించిందని వారు ఆరోపించారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు చెప్పారు.  శాంతిభద్రతలపై విశేషాధికారాలను గవర్నర్‌కు ఇచ్చే ఉత్తర్వులను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.



గవర్నర్ గిరీపై ‘ సుప్రీం’కు: ఎంపీ కె.కవిత



రాష్ట్రాల అధికారాలను లాక్కోవడానికి కేంద్రం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే న్యాయపోరాటం చేస్తామని, హైదరాబాద్ నగరంలో  శాంతిభద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకు వెళతామని టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత చెప్పారు.  న్యాయం తమవైపే ఉందని, గెలుస్తామన్న నమ్మకముం దని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంటు వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి వారంలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం లాక్కొనే ప్రయత్నం చేసిందని ఆమె ఆరోపించారు. దాన్ని తాము తిప్పికొట్టగా, కొద్దిపాటి మార్పులు, చేర్పులతో హైదరాబాద్‌లో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్‌కు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.రాజ్యాంగంలో గవర్నర్‌కు ఏవైతే అధికారాలు ఉన్నాయో అవే అధికారాలు బిల్లు లో ఉన్నాయని, అంతకు మించి ప్రత్యేక అధికారాలేవీ లేవన్నారు. బిల్లును సాకుగా తీసుకుని  కేంద్ర హోంశాఖ రాసిన లేఖ వెనుక తెలంగాణపై కుట్ర ఉందని, దీన్ని తిప్పికొడతామన్నారు.



బిల్లులోని నిబంధనల మేరకే గవర్నర్‌కు అధికారాలిచ్చామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చెప్పారని, కానీ ఆ నిబంధన అలాలేదని కవిత వివరించారు. కేంద్రం ఇలానే మొండిగా ప్రవర్తిస్తే సుప్రీంకు వెళ్తామన్నారు.  కేంద్రం ఇచ్చే ప్రతి అంశాన్ని రాష్ట్రాలు అమలు చేయాలని లేదు. రాష్ట్రానికి నచ్చితే అమలు చేయడం జరుగుతుందని ఆమె ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top