విద్యార్థుల ఆమరణ దీక్ష భగ్నం | Students offended by fasting | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆమరణ దీక్ష భగ్నం

Sep 5 2014 4:14 AM | Updated on Sep 2 2017 12:52 PM

ఓయూలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల టెంట్‌ను పోలీసులు కూల్చివేశారు.

  •      అర్థరాత్రి దాటాక ఆస్పత్రికి తరలింపు
  •      విద్యార్థుల నిరసన ర్యాలీ
  •      విద్యార్థి నేతల అరెస్ట్
  • ఉస్మానియా యూనివర్సిటీ:  ఓయూలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల టెంట్‌ను పోలీసులు కూల్చివేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మీనెంట్ చేయవద్దని, టీపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో విద్యార్థులు వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్న విషయం విదితమే.

    ఇందులో భాగంగా ఆర్ట్స్ కళాశాల ఎదుట మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల శిబిరంపై గురువారం తెల్లవారు జామున పోలీసులు హఠాత్తుగా దాడి చేశారు. టెంట్‌ను కూల్చివేశారు. దీక్షలో ఉన్న విద్యార్థి నేతలు గుండగాని కిరణ్ గౌడ్, సోలంకి శ్రీనివాస్, రవీంద్ర నాయక్, బీం రావ్ నాయక్, షేక్ హుస్సేన్, చందు, శివాజీ, అనిల్ కుమార్‌లను అరెస్ట్ చేసి గాంధీ ఆస్పత్రికితరలించారు. అడ్డుపడిన విద్యార్థులను పక్కకు నెట్టేశారు.

    విద్యార్థుల ఆరోగ్యం క్షీణించినందునే ఆస్పత్రికితీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీ ఆస్పత్రికి ర్యాలీగా బయలుదేరారు. వర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుట ఇనుప ముళ్ల కంచె, బారికేడ్లతో విద్యార్థులను పోలీసులు కట్టడి చేశారు. దీంతో కోపోద్రీక్తులైన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

    పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  పోలీసులు టి.విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మానవతరాయ్‌ని అరెస్ట్ చేసేందుకు ఉపక్రమించారు. దీన్ని గమనించిన మానవతరాయ్ పొదల వైపు పరుగు తీశారు. పోలీసులు వెంబడించి అతనితో పాటు సురేందర్, వీరేందర్ అనే విద్యార్థులను అరెస్ట్ చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    ఇతర విద్యార్థుల సమూహాన్ని చెదరగొట్టారు. అనంతరం టి.విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ కల్యాణ్ మాట్లాడుతూ కేసీఆర్ కంటే సీమాంధ్ర పాలకులే నయమన్నారు. గాంధీ ఆస్పత్రిలో దీక్షలు కొనసాగుతాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే జీవోను ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమాన్నికొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు భగత్, విష్ణు, నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
     
    కొనసాగుతున్న దీక్షలు

    గాంధీ ఆస్పత్రి: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గాంధీ ఆస్పత్రిలో ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఎనిమిది మంది విద్యార్థులను చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి డిజాస్టర్ వార్డులో దీక్షను కొనసాగిస్తున్నట్లు నిరసనకారులు స్పష్టం చేశారు. ఆస్పత్రి నోడల్ అధికారి కె.నర్సింహులు వైద్య పరీక్షలు నిర్వహించి, విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా గోపాలపురం ఏసీపీ శివకుమార్, చిలకలగూడ సీఐ మోహన్‌ల ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్ద  మోహరించారు.
     
    గవర్నర్ స్పందించాలి

     
    ఉస్మానియాలో పరిస్థితిపై రాష్ట్ర గవర్నర్ తక్షణమే స్పందించాలని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) జాతీయ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ కోరారు. నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థులను గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిన దొంగదీక్షను భగ్నం చేసినపుడు అప్రజాస్వామికమంటూ గగ్గోలు పెట్టిన హరీష్‌రావు, కవిత, కేటీఆర్‌లు ఇప్పుడు మాట్లాడాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌ను పోలీసు రాజ్యంగా మార్చేసి విద్యార్థుల గొంతు నొక్కడం కేసీఆర్‌కు తగదన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, శరత్‌చంద్ర, వెంకటప్ప, సాయి, రామకృష్ణ, రాములు, వేణు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement