రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి విద్యార్థులు తప్పించుకు పోవడం తీవ్ర కలకలం రేపింది.
యాచారం(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి విద్యార్థులు తప్పించుకు పోవడం తీవ్ర కలకలం రేపింది. సదరు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న యాజమాన్యం, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు మండల కేంద్రంలో ఉన్న ఓ మత సంస్థ నడుపుతున్న రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. అయితే, క్రమశిక్షణ విషయంలో యాజమాన్యం నిక్కచ్చిగా ఉండటంతో నలుగురు విద్యార్థులు పారిపోవాలని నిర్ణయించుకున్నారు.
పథకం ప్రకారం ఆ నలుగురూ సోమవారం రాత్రి 8.30 గంటల తర్వాత భోజనం చేసి పాఠశాల ప్రహరీ దూకి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వారు లేకపోవటాన్ని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తప్పించుకున్న సదరు బాలురు సోమవారం రాత్రి కాలినడకన నందివనపర్తి గ్రామం చేరుకున్నారు. పాఠశాలలో చదివే గ్రామానికి చెందిన పవన్ ఇంటికెళ్ల్లి భోజనం చేసి అక్కడే నిద్రించారు. ఉదయం నిద్ర లేచిన విద్యార్థులు గ్రామంలోని నందీశ్వరాలయంలో తల దాచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారికి కౌన్సిలింగ్ చేశారు. అయితే, వారు తిరిగి స్కూలుకు వెళ్లటానికి ఇష్టపడకపోవటంతో తల్లిదండ్రులను రప్పించి, వారి ఇళ్లకు పంపించారు.