ఆశల్లేకున్నా.. అడగాల్సిందే 

State Government Requests Central Government To Help Out In Polavaram Project - Sakshi

కాళేశ్వరం, పాలమూరులలో ఒకదానికి మరోసారి జాతీయ హోదా కోరనున్న రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన భారీ ఎత్తిపోతల పథకాలకు సాయం చేయాలని రాష్ట్రం మరోమారు కేంద్రాన్ని కోరనుంది. ఈ నెల 21న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తున్న భేటీలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా లేదా కేంద్ర సంస్థల నుంచి ఆర్థిక సాయమైనా ఇవ్వాలని అభ్యర్థించనుంది. దీనిపై ఇప్పటికే పలు మార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. ఈసారి కూడా స్పందిస్తుందన్న ఆశలు పెద్దగా లేకున్నా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రాజెక్టులకు నిధుల కొరత రాకుండా రాష్ట్రానికి ఊరటినిచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరనుంది.

ఎన్నిమార్లు కోరినా మొండిచెయ్యే... 
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉంది. దీనిపై పార్లమెంటు లోపలా వెలుపలా పోరాటం చేస్తున్నా కేంద్రం మొండిచెయ్యే చూపు తోంది. గత జూన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్రం కోరింది. అయినా కేంద్రం ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు.

20 శాతమే లెక్కిస్తారా?
కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల కింద వినియోగిస్తున్న తాగునీటి జలా ల్లో 20 శాతాన్ని మాత్రమే రాష్ట్రా ల వినియోగ ఖాతాలో వేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఏడో క్లాజు ప్రకారం తాగునీటి కోసం వాడే జలాల్లో 20 శాతాన్నే లెక్కలోకి తీసుకోవాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తోంది. పట్టణాలు, మున్సిపాలిటీల్లో తాగునీటికి సరఫరా చేసిన నీటిలో 20 శాతం మాత్రమే వినియోగం కిందకు వస్తుంది. హైదరాబాద్‌ తాగునీటి కోసం తెలంగాణ ఏటా 16.5 టీఎంసీలు సరఫరా చేస్తుండగా ఇందులో  3.3 టీఎంసీలు (20%) మాత్రమే వాస్తవ వినియోగం ఉండగా మరో 13 టీఎంసీలు వివిధ రూపాల్లో నదిలోకే చేరుతోంది. కానీ ఏటా కృష్ణా బోర్డు 16.5 టీఎంసీలను లెక్కలోకి తీసుకుం టోంది. దీనిపై ఇటీవల బోర్డు భేటీలో రాష్ట్రం ప్రస్తావించగా కేంద్రమే దీనిపై మార్గదర్శనం చేయాలని బోర్డు చైర్మన్‌ పేర్కొ న్నారు. దీంతో 21న జరిగే భేటీలో దీనిపై కేంద్రం ఏం చెబుతుంద నేది కీలకంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top