21లోగా 22 భాషల పరిచయం 

Special program for school children - Sakshi

బడి పిల్లలకు ప్రత్యేక కార్యక్రమం

సాక్షి, హైదరాబాద్‌: దేశ భాషలపై విద్యార్థులకు కనీస అవగాహన కల్పించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పాఠశాల స్థాయిలోనే వీరికి అవగాహన కల్పిస్తే... ముఖ్యమైన పదాలపై కొంతమేర పట్టు రావడంతో పాటు జాతీయ సమగ్రత పెంపొందుతుందని ఎంహెచ్‌ఆర్‌డీ భావిస్తోంది. భాషా పరిచయం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిన ప్రభుత్వం... ఈ దిశగా ప్రతి పాఠశాలకు కార్యాచరణ సిద్ధం చేసింది. యాజమాన్యాలకు అతీతంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తప్పకుండా భాషా పరిచయాన్ని అమలు చేయాలని ఎంహెచ్‌ఆర్‌డీ స్పష్టం చేసింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. 

ప్రార్థన సమయంలో ఉచ్ఛారణ... 
మాతృభాష మినహాయిస్తే ఇతర భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి విద్యార్థుల్లోనూ ఉంటుంది. ఈ దిశగా యోచించిన ఎంహెచ్‌ఆర్‌డీ కనీస సామర్థ్యం కోసం భాషా పరిచయ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిపై పాఠ్యాంశంలో ప్రత్యేకంగా నిర్దేశించనప్పటికీ... ప్రార్థన సమయంలో కనీసం 5 పదాలను ఉ చ్ఛరించేలా ప్రణాళిక రూపొందించింది. నమస్కారం, మీ పేరు ఏమిటి?, నా పేరు, మీరు ఎలా ఉన్నారు వంటి ప్రశ్నలు, సమాధానాలు ఇచ్చి వాటిపై అ వ గాహన కల్పించాలని సూచించింది. నిర్దేశించిన వాక్యాలను రోజుకొక భాష వంతున డిసెంబర్‌ 21లోపు దేశంలోని 22 భాషల్లో పరిచయం పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ కార్యక్రమంపై మార్గనిర్దేశాలతో పాటు 3 నిమిషాల ఆడియోను విడుదల చేసి విద్యాశాఖ అధికారులకు  పంపింది.  ఎంహెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్‌ లోనూ వీటిని అందుబాటులో ఉంచింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top